చంద్రగిరిలో కనిపిస్తున్న నైరాశ్యం

తిరుపతి, ఆగస్టు 19, (న్యూస్‌ పల్స్‌)
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్‌ రెడ్డి. ఎమ్మెల్యేగా వరసగా రెండుసార్లు గెలిచి లోకల్‌గా పట్టుసాధించారు. ఆయనలానే కేడర్‌ కూడా దూకుడే. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం భాస్కరరెడ్డి పిలుపు ఇస్తే చాలు కేడర్‌ వాలిపోయేది. అలాంటి చంద్రగిరి వైసీపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా నైరాశ్యం కనిపిస్తోందట. మునుపటి జోష్‌ లేదన్నది పార్టీ వర్గాలు చెప్పేమాట. వైఎస్‌ఆర్‌ వర్ధంతి.. జయంతి.. సీఎం జగన్‌ పుట్టినరోజు.. వైసీపీ ప్లీనరీలు ఇలా కార్యక్రమం ఏదైనా గతంలోలా ఉత్సాహంగా పాల్గొనలేదని చంద్రగిరిలో అధికారపార్టీ శ్రేణులు కోడై కూస్తున్నాయి.పంచాయతీ, పరిషత్‌ ఎన్నికల్లో ఎమ్మెల్యేకు.. పార్టీ కేడర్‌కు మధ్య మొదలైన దూరం ప్రస్తుతం చాలా పెరిగిందట. మొదటి నుంచి వైసీపీ జెండా భుజానకెత్తుకున్న వారిని కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు కట్టబెట్టడం సమస్య తెచ్చిపెట్టిందని టాక్‌. పదవులు పొందినవాళ్లు వాటిని అలంకార ప్రాయంగా చూస్తున్నారే తప్ప ఇతర కార్యక్రమాలేవీ పట్టించుకోవడం లేదట. ఇంకొందరు తమకు ఇష్టం లేని పోస్టులు ఇచ్చారని మౌనంగా ఉంటున్నారట. ఇలా ఎవరికి వారు తమకున్న సమస్యలతో మౌనవ్రతం పాటిస్తూ గ్యాప్‌ మెయింటైన్‌ చేయడం చర్చగా మారింది.అయితే కేడర్‌ ఏవిషయంలోనైనా భయపడుతుందా అనే ప్రశ్నలు ఉన్నాయట. కరోనా సమయంలో ఆనందయ్య మందులు పంపిణీని భారీ ఎత్తున చేపట్టారు ఎమ్మెల్యే చెవిరెడ్డి. మూడు రాజధానులకు మద్దతుగా నారావారి పల్లెలో భారీ కార్యక్రమం చేపట్టి చర్చల్లో నిలిచారు. ఆ తర్వాతే సీన్‌ మారిపోయింది. ఏ కార్యక్రమం చేపట్టినా.. అధికారులు.. వేళ్లపై లెక్కపెట్టే నేతలు తప్ప పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదట. చివరకు ఎమ్మెల్యే కార్యాలయంలోనూ సందడి లేదని చెవులు కొరుక్కుంటున్నారు.చంద్రగిరి వైసీపీలో వర్గపోరు ఎక్కువైందనే వాదనా ఉంది. అలాగే చేసిన పనులకు బిల్లులు రాక కొందరు.. అప్పులు చేసి వడ్డీలకు వడ్డీలు కట్టలేక మరికొందరు ఆర్థికంగా నలిగిపోతున్నారట. ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేక.. మింగలేక కక్కలేక ఉన్నారట. అందుకే ఎమ్మెల్యేతోనూ అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నట్టు చెబుతున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన ఉపఎన్నికల హడావిడిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ఉండిపోవడం కూడా సమస్య తీవ్రతను పెంచిందనే అభిప్రాయం కొందరు నేతల్లో ఉందట. ఆలస్యంగానైనా సమస్య ఎమ్మెల్యే దృష్టికి వెళ్లడంతో ఆయన ఉలిక్కి పడ్డారట. ఇలాగే వదిలేస్తే.. చంద్రగిరిలో పట్టుకోల్పోతామనే ఆందోళనతో పరిస్థితులు చక్కదిద్దే పనిలో పడ్డారట.అసంతృప్తితో ఉన్న చంద్రగిరి వైసీపీ నేతల జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం. అలాగే పదవుల విషయంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయో.. వ్యక్తం చేశారో తెలుసుకుంటున్నారట. వారితో మాట్లాడి పరిస్థితిని చక్కిదిద్దే పనిలో ఉన్నారట. మరి.. ఈ ప్రయత్నాలు ఎమ్మెల్యే చెవిరెడ్డికి ఏ మేరకు అక్కరకు వస్తాయో.. కేడర్‌ ఎంత వరకు సంతృప్తి చెందుతుందో చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *