పంద్రాగస్టులో పొలిటికల్‌ పంచ్‌ లు

హైదరాబాద్‌, ఆగస్టు 16
చేసింది.. చెయ్యబోయేది చెప్పుకునే స్వాతంత్య్రం రూలింగ్‌ పార్టీలకు. చెప్పింది ఎందుకు చెయ్యలేదని నిలదీసే స్వాతంత్రం అపోజిషన్‌ పార్టీలది! టోటల్‌గా ఆగస్టు పదిహేను అనేది భలే మంచి రోజు.. పసందైన రోజుగా మారింది పార్టీల నేతలకు. దొరికిన మైకుల్ని యదేఛ్చగా వాడేసుకున్నారు. ఇప్పుడు కాకుంటే ఎప్పుడు ఆడాల..? డప్పుల మేళాలు మహ గొప్పగ మోగాల.. అంటూ రెచ్చిపోయారు. అసలే ఎలక్షన్‌ ఇయర్‌. వాళ్లవాళ్ల టర్మ్‌కి ఇదే చిట్టచివరి పంద్రాగస్టు. అందుకే ఇంత స్వేచ్ఛగా విహరించారా? మరి ఈ చప్పుళ్లకు ప్రతిపక్షాలిచ్చిన రియాక్షన్లేంటి?గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించారు తెలంగాణా సీఎం కేసీఆర్‌. రాష్ట్ర ప్రగతి నివేదిక సమర్పిస్తూ.. పనిలో పనిగా విపక్షాలపై విరుచుకుపడ్డారు. పేదలకు ఉచితంగా డబుల్‌ బెడ్రూం ఇళ్లు, సొంత స్థలం ఉన్న పేదల కోసం గృహలక్ష్మి, దేశానికి ఆదర్శమైన దళితబంధు పథకం.. ఇలా తన మానసపుత్రికలన్నిటినీ ప్రస్తావిస్తూ.. అదే ఊపులో కాంగ్రెస్‌`బీజేపీలపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు.పదేళ్ళలో వందేళ్ళ అభివృద్ధిని సాధించిన తమనూ, గత పాలకులనూ పోల్చుకోమని ఓటర్లకు సలహా ఇచ్చారు తెలంగాణ సీఎం. రోజుకు 4 గంటల ఉచిత విద్యుత్‌ సరిపోతుందన్న రేవంత్‌ స్టేట్‌మెంట్‌ను పరోక్షంగా ప్రస్తావించారు కేసీఆర్‌. ఇటు.. ప్రిన్స్‌ ఆఫ్‌ బీఆర్‌ఎస్‌ కేటీఆర్‌ కూడా సూటిపోటి మాటలతో గుచ్చిపడేశారు విపక్షాల్ని. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణాలో రైతులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ మున్సిపాలిటీలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని చెబుతూ మోదీ సర్కారుకు చాటుమాటుగా చురకలంటించారు. సిద్దిపేటలో జాతీయ జెండా ఎగరేసిన మంత్రి హరీష్‌రావు కూడా ఆరోగ్యశాఖలో చేసిన సాహసాల్ని గుర్తు చేశారు.అపోజిషన్‌ పార్టీలు కూడా మేమేం తక్కువ తిన్నామా అంటూ స్వతంత్ర దినోత్సవాన్ని సొంత రాజకీయానికి వాడేసుకున్నాయి. ఖమ్మం జిల్లా మధిరలో పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నారు సీఎల్‌పి నేత భట్టి విక్రమార్క. కోటి ఎకరాలను సాగులోకి తెచ్చామనడం పచ్చి అబద్ధమంటూ కేసీఆర్‌ సర్కార్‌ ఇరిగేషన్‌ విధానాన్ని తప్పుపట్టారు. బీఆర్‌ఎస్‌ అబద్ధపు వాగ్దానాల్ని ప్రజలు నమ్మరని చెబుతూ, దొరల చేతిలో బందీ అయిన తెలంగాణను కాపాడుకుందాం రండి అంటూ పిలుపునిచ్చారు భట్టి.హైదరాబాద్‌ గాంధీభవన్‌లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్ని పూర్తిగా పొలిటికల్‌ కలర్లోకి మార్చేశారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. జాతీయ జెండాను ఆవిష్కరించి, గాంధీ, నెహ్రూ, పటేల్‌ చిత్రపటాలకు నేతల నివాళులు అర్పించి.. తెలంగాణా యువ ఓటర్లకు గాలం వేశారు. బీఆర్‌ఎస్‌నీ, బీజేపీని కలిపి విమర్శలు గుప్పించేశారు.తెలంగాణ బీజేపీ ఆఫీస్‌లో జెండా వందనం చేసిన టీ`బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి, మోదీ సర్కార్‌ని ప్రశంసించడంతో సరిపెట్టుకోలేదు. కేసీఆర్‌ సర్కార్‌ విూద విరుచుకుపడ్డారు. మరోసారి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే.. తెలంగాణ అధోగతి పాలవుతుందన్నారు. కాంగ్రెస్‌ పాలకులు కవిూషన్లు తీసుకుంటే.. బీఆర్‌ఎస్‌ పాలకులు వాటాలకు అలవాటుపడ్డారని విమర్శించారు కిషన్‌రెడ్డి.టోటల్‌గా తెలుగు రాష్ట్రాల్లో పంద్రాగస్టు కాస్తా పొలిటికల్‌ పంద్రాగస్టుగా మారిపోయింది. జెండా వందనం కాస్తా అజెండా వందనంగా టర్న్‌ ఇచ్చుకుంది. రాబోయే ఓట్ల పండగను గుర్తు చేసుకుని.. ఎవరికివాళ్లు స్పీచ్‌ థెరపీలతో జనం చెవుల్ని తూట్లు పొడిచేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *