ఎన్నికల మూడ్‌ లోకి పార్టీలు…

తెలంగాణలో ఎన్నికల మూడ్‌ వచ్చేసింది. ప్రధాన పార్టీలు గేర్లు మార్చి వేగం పెంచాయి. అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ పరంగా పెద్దగా కార్యక్రమాలు నిర్వహించనప్పటికీ.. ప్రభుత్వం తరపున మాత్రం వారంలో మూడు, నాలుగు కార్యక్రమాలను నిర్వహిస్తూ గత తొమ్మిదేళ్ళ తమ పాలనలో ఏం చేశామో ప్రజలకు వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కలెక్టరేట్ల కొత్త భవనాలు, హౌజింగ్‌ కాలనీల ప్రారంభోత్సవాలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ విరివిగా పాల్గొంటున్నారు. కేసీఆర్‌ కేబినెట్‌లో కీలక మంత్రులు కేటీరామారావు, హరీశ్‌ రావు సైతం జిల్లాల పర్యటనలను వేగవంతం చేశారు. తాజాగా హైదరాబాద్‌ నగర సిగలో మూడో ఆణిముత్యాన్ని చేర్చారు గులాబీ బాస్‌ కేసీఆర్‌. నగరం నడిబొడ్డు రూపురేఖలు మారుస్తూ ట్యాంక్‌ బండ్‌ సవిూప ప్రాంతంలో నిర్మించిన కట్టడాలలో తొలుత భారీ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అదయ్యాక తమ ప్రభుత్వం అత్యంత ప్రతిస్టాత్మకంగా నిర్మించిన సచివాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు. తాజాగా ట్యాంక్‌ బండ్‌ పక్కనే జలదృశ్యానికి సవిూపంలో నిర్మించిన అమర వీరుల స్థూపాన్ని సీఎం ఆవిష్కరించారు. నభూతోనభవిష్యతిలా అమరజ్యోతి ప్రారంభోత్సవంలో డ్రోన్‌ షో నిర్వహించారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమ అంశాలను ప్రస్తావించి, సభికుల్లో ఉద్వేగం రేకెత్తించారు. ఇకపై జిల్లాల పర్యటనలను కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ రావు వేగవంతం చేస్తారన్న ప్రచారం బీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీది జోరందుకున్న వైనం. కర్నాటక ఎన్నికల ఫలితాలిచ్చిన ఉత్సాహంతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. కర్నాటక ఫలితాల వరకు తెలంగాణలో మూడు పార్టీలు బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు సమాన స్థాయిలో ధీటుగా వున్నాయని అంతా భావించారు. కానీ కర్నాటక ఫలితాలు తెలంగాణపై పెద్ద ప్రభావాన్నే చూపాయి. రాష్ట్రంలో బీజేపీ నేతల్లో ఒక్కసారి స్థబ్దత ఏర్పడిరది. ఆ పార్టీ ప్రారంభించిన ఆపరేషన్‌ ఆకర్ష నిలిచిపోయింది. అదేసమయంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో ఉత్సాహం పెరిగింది. పార్టీలో చేరికలు కూడా పెరిగాయి. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు సమాన దూరం పాటిస్తున్న సమయంలో వెల్లడైన కర్నాటక ఫలితాలు వారిద్దరినీ కాంగ్రెస్‌ పార్టీ వైపు మొగ్గు చూపేలా చేశాయి. అయితే, ఇక్కడ ఓ గొబెల్స్‌ ప్రచారం.. ఇంకా చెప్పాలంటే ఒకట్రెండు విూడియా సంస్థలు కావాలని రాస్తున్న వార్తలు గందరగోళం రేకెత్తిస్తున్నాయి. చాలా కాలం క్రితమే కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరిన పలువురు నేతలు తిరిగి గాంధీభవన్‌ వైపు చూస్తున్నారంటూ రెండు పత్రికలు అదేపనిగా కథనాలు రాస్తున్నాయి. తాము పార్టీ మారడం లేదని వారు పదేపదే చెబుతున్నా.. ఈ ఊహాజనిత వార్తలను కొందరు కొనసాగిస్తున్నారు. బీజేపీలో వున్న ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, మహేశ్వర్‌ రెడ్డి కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారన్నది ఆ కథనాల సారాంశం. అయితే, వారు పదేపదే తమకా ఆలోచన లేదని చెబుతూ వుండడం బీజేపీ నాయకత్వానికి కాస్త ఊరటనిచ్చే అంశం.జిల్లాల వారీగా చూస్తే ఉమ్మడి పాలమూరు, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలపై కాంగ్రెస్‌ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చర్చ జరుగుతోంది. ఈ నాలుగు జిల్లాల్లో కలిపి మొత్తం 40 అసెంబ్లీ సీట్లున్నాయి. వీటిని ఏకమొత్తంగా కైవసం చేసుకునేందుకు టీపీసీసీ వ్యూహరచన చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో బీజేపీలో వున్న ఓ కీలక నేతను రప్పించుకోవడం ద్వారా ఆ జిల్లాలో పట్టుసాధించాలని టీపీసీసీ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ సైతం తమకు పట్టున్న జిల్లాల్లో ఏకమొత్తంగా సీట్లు కైవసం చేసుకోవాలని ప్లాన్‌ చేస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని విద్యావంతులను ప్రభావితం చేసే దిశగా కమలనాథులు కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఇంటింటికీ బీజేపీ పేరిట బీజేపీ రాష్ట్ర నేతలు గ్రౌండ్‌ లెవెల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లాల్లో టీ.బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌, సికింద్రాబాద్‌ పరిధిలో కేంద్ర టూరిజం శాఖా మంత్రి జి.కిషన్‌ రెడ్డి ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని, పార్టీ అధిష్టానమిచ్చిన ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించారు. మూడు ప్రధాన పార్టీలు ప్రజల్లోకి వెళ్ళేందుకు తమదైన శైలిలో కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తుండడంతో తెలంగాణలో ఎన్నికల మూడ్‌ సుస్పష్టంగా కనిపిస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *