ఒంటరి పోరే సో బెటర్‌ అంటున్న తమ్ముళ్లు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే పొత్తులు పెట్టుకుంటే ఆ నియోజకవర్గంలో ఇక టీడీపీ కోలుకోలేని పరిస్థితి నెలకొంటుందన్నది గత చరిత్రను పరిశీలిస్తే అవగతమవుతుంది. పొత్తులు పెట్టుకుని ఇతర పార్టీలకు సీట్లు కేటాయించడంతో అక్కడ క్యాడర్‌ డైలమాలో పడుతుంది. యాక్టివ్‌ గా ఉండకపోవడం, అక్కడ ఎన్నికైన ఎమ్మెల్యే కూడా టీడీపీ క్యాడర్‌ కు సహకరించకపోవడంతో కొన్ని నియోజకవర్గాల్లో పొత్తులు పెట్టుకుని ఇప్పటికీ కోలుకోలేదన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు కొందరు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు పర్యటనలకు మంచి స్పందన లభిస్తుంది. జనం కూడా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పొత్తులు పార్టీకి నష్టం చేస్తాయనే వారు కూడా ఇటీవల కాలంలో పెరిగిపోయారు. ఆయన జిల్లాలో పర్యటనలో పొత్తుల వద్దంటూ నేతలు వేడుకుంటున్నారు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పొత్తులకు సిద్ధమవుతున్నారు. జనసేనతో ఆయన పొత్తును బలంగా కోరుకుంటున్నారు. కలసి వస్తే బీజేపీతో నడిచేందుకు సిద్ధమయ్యారు. అందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి బీజేపీ, కమ్యునిస్టులు, టీఆర్‌ఎస్‌ ఇలా అన్ని పార్టీలతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. అయితే విభజన ఆంధ్రప్రదేశ్‌ లో 2014లో ఒక్క బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకున్నారు. జనసేన ఈ కూటమికి మద్దతు నిచ్చింది. అయితే 2014 ఎన్నికల్లో బీజేపీకి అతి తక్కువ స్థానాలను పొత్తులో భాగంగా టీడీపీ కట్టబెట్టింది. అయినా నాలుగు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. విశాఖ పట్నంలోని ఉత్తర నియోజకవర్గం నుంచి విష్ణుకుమార్‌ రాజు, తాడేపల్లి గూడెం నుంచి మాణిక్యాలరావు, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్‌, రాజమండ్రి అర్బన్‌ నియోజకవర్గం నుంచి ఆకుల సత్యనారాయణ విజయం సాధించారు. ఈ స్థానాల్లో టీడీపీ గత ఏడాది ఎన్నికల్లో బలహీనమయింది. 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు కేవలం రెండు వేల ఓట్ల మెజారిటీతోనే గెలుపొందారు. ఇక తాడేపల్లి గూడెం నియోజకవర్గంలో 2014లో బీజేపీకి కేటాయిస్తే 2019 ఎన్నికల్లో అక్కడ గెలవలేదు. కైకలూరులో 2014లో బీజేపీకి కేటాయిస్తే అక్కడ 2019 ఎన్నికల్లో గెలవని పరిస్థితి. ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లోనే కమ్యునిస్టులకు టీడీపీ కేటాయించింది. ఇంతవరకూ టీడీపీ పశ్చిమ నియోజకవర్గంలో గెలిచిన చరిత్ర లేదు.ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ పొత్తులో భాగంగా నరసరావుపేటను కేటాయించింది. కానీ ఆ తర్వాత ఏడాది ఒంటరిగా పోటీ చేస్తే గెలుపు సాధ్యపడలేదు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం కూడా అంతే. 2014లో బీజేపీకి కేటాయిస్తే 2019 ఎన్నికల్లోనూ ఓటమి పాలయింది. ఇవన్నీ టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గాలు కూడా అంతే. అంతెందుకు టీడీపీ పొత్తులో భాగంగా తిరుపతి పార్లమెంటును 1999లో కేటాయిస్తే ఇంతవరకూ అక్కడ టీడీపీ నెగ్గలేదు. అందుకే పొత్తులు వద్దని కొందరు సూచిస్తున్నారు. బీజేపీ కాబట్టి తక్కువ స్థానాలను కేటాయించాల్సి వచ్చింది. అదే జనసేనకు అయితే కనీసం నలభై స్థానాలను కేటాయించాల్సి వస్తుంది. అక్కడ పార్టీ భవిష్యత్‌ ను కోల్పోతుందన్న ఆందోళన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతుంది. ఒంటరిగా పోటీ చేసి అధికారం దక్కించుకుంటే ఈ పరిస్థితి పార్టీకి ఉండదన్నది ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. పొత్తులతో అధికారంలోకి వచ్చినా ఆ తర్వాత అక్కడ పార్టీ బలహీనంగా మారుతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా సీనియర్‌ నేతలు గుర్తు చేస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *