తెలంగాణలో డైవర్షన్‌ పాలిట్రిక్స్‌

తెలంగాణ ఆవిర్బావం నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ గతంలో ఎన్నడూ ఎదుర్కోనన్ని చిక్కులను ఇటీవలి కాలంలో ఎదుర్కొన వలసి వస్తున్నది. వరుస సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న టీఆర్‌ఎస్‌ ఆ సమస్యల నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్‌ చేయడానికి అంది వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకోవాలనుకుంటోంది. అవకాశాలు అంది రాకపోతే సృష్టించుకోవాలని ప్రయత్నిస్తున్నది.అదిగో అలాంటి ప్రయత్నమే రాజాసింగ్‌ అరెస్టు అని పరిశీలకులు అంటున్నారు. మునావర్‌ స్టాండప్‌ కామెడీ షో, దానికి వ్యతిరేకంగా ఘోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ ఆందోళన, ఆ తరువాత మత విద్వేషాలకు దోహదపడే విధంగా వివాదాస్పద వీడియో విడుదల చేసి అది తన కామెడీ షో అనడం ఇవన్నీ కూడా ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్‌ చేయడానికి టీఆర్‌ఎస్‌ సృష్టించుకున్న అవకాశంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.ఎందుకంటే.. మామూలుగా వంద మంది రాజాసింగ్‌ లు వివాదాస్పద కామెంట్లు, చేసినా, వీడియోలు చేసి విడుదల చేసినా హైదరాబాద్‌ మహానగరంలో మత విద్వేషాలు పెచ్చరిల్లే అవకాశం లేదు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి కావడానికి ముందు హైదరాబాద్‌ లో మత కల్లోలాలు జరిగేవి.. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత తీసుకున్న చర్యలు, చేపట్టిన అభివృద్ధి పనులు, ఆయన తరువాత చంద్రబాబునాయుడు హయాంలో కూడా హిందూ ముస్లింల మధ్య సామరస్యమే కొనసాగింది. హైదరాబాద్‌ లో సున్నిత అంశాల మధ్య ముస్లిం, హిందువులు సంయమనం పాటిస్తున్నారు. ఎవరో రెచ్చగొట్టారని రెచ్చిపోయే పరిస్థితి లేదు.మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా హైదరాబాద్‌ విలసిల్లుతోంది. అటువంటి హైదరాబాద్‌ లో రాజాసింగ్‌ తీరు మతసామరస్యాన్ని రెచ్చగొడుతోందంటూ టీఆర్‌ఎస్‌ చేస్తున్న ఆరోపణలను, విమర్శలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. మునావర్‌ కామెడీ షో, దానిని అడ్డుకోవడానికి జరిగిన ప్రయత్నాన్ని భూతద్దంలో చూపి హైదరాబాద్‌ లో మత కల్లోలాలు జరగబోతున్నాయన్నంతగా హడావుడి చేయడం వెనుక టీఆర్‌ఎస్‌ పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు అంటున్నారు. కేసీఆర్‌ కు మొదటి నుంచీ కూడా డైవర్షన్‌ పాలిటిక్స్‌ అలవాటేననీ, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారనీ అంటున్నారు. ఒక వైపు కాళేశ్వరం వైఫల్యం, లక్షల కోట్ల వ్యయంతో నిర్మించిన ఆ ప్రాజెక్టు ఒకే ఒక్క వరదకు ఎందుకూ పనికి రాకుండా పోవడం, దానిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతుండటం, ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ లో కేసీఆర్‌ తనయ కవిత పేరు ప్రముఖంగా బయటకు రావడం, అలాగే కుమారుడు కేసీఆర్‌ కు సంబంధించినదడిగా చెబుతున్న ఫీనెక్స్‌ కంపెనీపై ఐటీ దాడులు వంటి అంశాలపై చర్చకు అవకాశం లేకుండా ప్రజల దృష్టిని డైవర్ట్‌ చేయడానికే రాజాసింగ్‌ ఇష్యూకు అంత హైప్‌ ఇచ్చారని విశ్లేషిస్తున్నారు.పాత బస్తీలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారిందనీ, అల్లర్లు జరుగుతున్నాయనీ టీఆర్‌ఎస్‌ సర్కార్‌ చేస్తున్న ప్రచారం, ఆర్భాటం అన్నీ కూడా ఈ డైవర్షన్‌ పాలిటిక్స్‌ లో భాగమేనని అంటున్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత, పాలనా వైఫల్యాలు, తన కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు ఇలా ముప్పేట దాడిలో ఉక్కిరి బిక్కిరైపోతున్న కేసీఆర్‌.. రాజా సింగ్‌ వ్యవహారానికి అవసరానికి మించిన ప్రాధాన్యత ఇచ్చి ప్రజల దృష్టిని మరల్చాలని భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. హైదరాబాద్‌ లో మత వైషమ్యాలు పెచ్చరిల్లే కుట్ర, శాంతి భద్రతలకు విఘాతం అంటూ టీఆర్‌ఎస్‌ సర్కార్‌ చెబుతున్నట్లుగా హైదరాబాద్‌ లో పరిస్థితి లేదనీ, నగరంలో మతసామరస్యానికి విఘాతం కలిగించడం ఎవరి వల్లా కాదనీ, ప్రజలలో చైతన్యం వచ్చిందనీ పరిశీలకులు అంటున్నారు. 1984 తరువాత హైదరాబాద్‌ నగరంలో మత పరమైన ఘర్షణలు తలెత్తిన సంఘటన ఒక్కటీ లేదనీ, మత సామరస్యానికి ప్రతీకగా నాడు ఎన్టీఆర్‌ హైదరాబాద్‌ నగరాన్ని తీర్చి దిద్దారని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాజా సింగ్‌ వ్యవహారంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న హడావుడి ప్రచారం అంతా డైవర్షన్‌ పాలిటిక్స్‌ లో భాగమేననీ విశ్లేషిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *