వానలతో అల్లాడుతున్న చిరు వ్యాపారులు

వర్షాకాలం మాదిరిగా వేసవి కాలంలోనూ ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షాలు అన్నదాతలనే కాదు చిరు వ్యాపారులను సైతం అతలాకుతలం చేస్తున్నాయి. అకాలంగా కురుస్తున్న వర్షాల వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాల్లో వరి ధాన్యం తడిసి ముద్దవుతుండగా నగరంలో ఈ అకాల వర్షాల వల్ల చెట్లు నేలకూలి, డ్రైనేజీలు మ్యాన్‌ హోల్స్‌ వల్ల లోతట్టు ప్రాంతాలు నీట మునుగిపోతున్నాయి. దీంతో చిరు వ్యాపారులు అనునిత్యం ఇబ్బందులు పడుతున్నారు.పొట్ట చేతపట్టుకుని రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి నగరానికి వలస వచ్చిన పల్లె జనం వేసవికాలం కావడంతో అప్పులు చేసి మరీ అక్కడక్కడ చెరుకు రసం బండ్లు, జ్యూస్‌ సెంటర్లు, సోడా బండ్లు, కొబ్బరి బోండా షాపులు ఇలా అనేక చిరు వ్యాపారాలను మొదలుపెట్టారు. ఇందుకోసం రోజు వారి ఫైనాన్స్‌ వ్యాపారుల వద్ద అప్పులు చేసి వచ్చిన ఆదాయంలో ఏ రోజుకు ఆరోజు కొంత మొత్తం డబ్బులు చెల్లిస్తూ వ్యాపారాలు సాగిస్తుంటారు. ఇవన్నీ కూడా కేవలం వేసవి సీజన్‌లోనే నడుస్తాయి. అయితే ఈ అకాల వర్షాలు చిరు వ్యాపారుల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి. వేసవి తాపానికి కొబ్బరి బోండాలు, చెరుకు రసం, సోడాలు తాగే వారు వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో అటు వైపు కన్నెత్తిచూడడం లేదు. దీంతో వేసవి కాలంలోనూ గిరాకీలు లేక చిరు వ్యాపారుల దుకాణాలు వెలవెలబోతున్నాయి.ఈ వేసవి సీజన్‌లో సోడా బండి, చెరుకు బండి, కొబ్బరి బోండా షాపులు పెట్టి నాలుగు డబ్బులు కూడా బెట్టుకుని తిరిగి వర్షాకాలంలో ఊరికి వెళ్లి వ్యవసాయం చేసుకుందామని ఎన్నో ఆశలతో నగరానికి వలస వచ్చిన వారు ఇక్కడ డైలీ ఫైనాన్స్‌ తీసుకుని వ్యాపారాలు మొదలు పెడుతున్నారు. ఇలా డైలీ ఫైనాన్స్‌లో రూ.10వేలు తీసుకున్న వారు రోజుకు వంద రూపాయలు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని, కానీ వర్షాల వల్ల గత 10 రోజులుగా గిరాకీలు లేక ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉరుములు, గిరాకీలు లేక డైలీ ఫైనాన్స్‌ కట్టలేక, పిల్లలను పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. చిరు వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.వర్షాల వల్ల కొబ్బరి బోండాలు అమ్ముడు పోవడం లేదు. ఎండాకాలంలో రోజుకు 200 నుంచి 300 బోండాలను అమ్మే వాళ్లం. కానీ వర్షాల వల్ల ఇప్పుడు రోజుకు 50 నుంచి 100 బోండాలను కూడా అమ్మలేక పోతున్నాం. ఈ సీజన్‌లో సుమారు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *