పాపం… షర్మిల…

హైదరాబాద్‌, అక్టోబరు 9
షర్మిల ఒంటరిపోరుకు దిగితే.. కచ్చితంగా పాలేరు నుంచే పోటీ చేస్తారు. అప్పుడు ఎవరిని ప్రత్యర్ధిగా చూస్తారనేది ఆసక్తికర అంశం. బీఆర్‌ఎస్‌ అభ్యర్ధిని టార్గెట్‌ చేస్తారా లేదంటే పాలేరు టికెట్‌ ఆశిస్తున్న తుమ్మల నాగేశ్వరరావుతో ఫైట్‌ చేస్తారా? ఒకవేళ తుమ్మల గనక ఖమ్మం సీటు తీసుకుని, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పాలేరు బరిలో దిగితే మాత్రం.. పోటీ మరింత రసవత్తరంగా ఉంటుంది. ఒకవిధంగా ఇది షర్మిలను ఇరుకునపెట్టడమే అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఖమ్మంలో పదికి పది సీట్లు గెలుస్తామని పొంగులేటి శపథం చేసిన నేపథ్యంలో షర్మిలను గెలవనివ్వకపోవచ్చని చెబుతున్నారు. ఏదేమైనా.. విలీనంపై షర్మిల వేసిన అడుగులు లాభం కంటే నష్టమే ఎక్కువ తెచ్చిపెట్టింది. వైఎస్‌ విూద అభిమానం కావొచ్చు, సమస్యలపై షర్మిల పోరాడుతున్న తీరు కావొచ్చు. కొంతమంది నేతలైతే ఆమె వెనక నడిచారు. కాని, ఎప్పుడైతే విలీనం చేయాలనే ఆలోచన మొదలుపెట్టారో అప్పటి నుంచి ఒక్కో లీడర్‌ పార్టీని వీడుతూ వచ్చారు. కొండా రాఘవరెడ్డి, గట్టు రామచంద్రరావు, ఏపూరి సోమన్న.. ఇలాంటి వాళ్లంతా షర్మిల నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు విలీనంపై వెనక్కి తగ్గినా.. మళ్లీ నేతలు తిరిగి వస్తారన్న గ్యారెంటీ లేదు. ఓవరాల్‌గా రాజకీయ పరిణతి లేకపోవడంతోనే షర్మిల కొన్ని రాంగ్‌ స్టెప్స్‌ వేశారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. షర్మిలలో రాజకీయ పరిణితి కూడా కనిపించలేదంటున్నారు పొలిటికల్‌ అనలిస్టులు. కష్టమో నష్టమో ముందు పార్టీని నడపాలి. ఎన్నికల్లో పోటీ చేయాలి. గెలుపో ఓటమో తరువాత సంగతి. అసలు పార్టీకి ఉన్న సత్తా ఏంటన్నది బయటపడుతుంది కదా. సీట్లు గెలవకపోయినా.. చూపించడానికి కనీసం ఓట్‌ షేర్‌ అయినా ఉంటుంది కదా. ఇవేవిూ జరక్కుండానే పార్టీ విలీనం కోసం ప్రయత్నించడం అంటే.. ఫెయిల్యూర్‌ను అంగీకరించడం కాదా? ఏ ఒక్క ఎన్నికను ఫేస్‌ చేయకుండానే విలీన ప్రతిపాదన పెట్టారంటే.. పార్టీని నడపడం అంత ఈజీ కాదని షర్మిలకు అర్ధమై ఉండాలి. 4వేల కిలోవిూటర్లు పాదయాత్ర చేసినా ఆ రేంజ్‌ రెస్పాన్స్‌ రాలేదని తెలుసుకుని ఉండాలి. లేదా ఆర్థిక వనరులైనా అడ్డం వచ్చి ఉండాలి. ఇవన్నీ పార్టీ అధ్యక్షురాలిగా తనకే అర్ధమైపోతున్నప్పుడు.. రాజకీయాల్లో కాకలుతీరిన నేతలకు ఆమాత్రం అర్దం కాదా? విలీనం కోసం నాలుగు నెలలుగా వెంటపడుతున్నారంటే.. తెలంగాణలో ప్రభావం చూపించలేకపోయారు కాబట్టే పార్టీని కాంగ్రెస్‌లో కలిపేస్తున్నారని.. చూస్తున్నవాళ్లు అర్ధం చేసుకోలేరా? అసలు విలీనం ఊసెత్తకుండా.. ఆ పాలేరుపై ఫోకస్‌ పెట్టినా బాగుండేదని అంటున్నారు. ఏమో గెలుపు అవకాశాలు ఉండేవేమో. కాని, ఇన్నాళ్లు విలీనం కోసం ప్రయత్నించి, ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తున్నా.. పాలేరులో గెలిపించండి అంటే ప్రజలు ఆదరిస్తారా? దీన్నే రాజకీయ పరిణితి లోపించడం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పైగా పాదయాత్రలో సమస్యలపై గళం వినిపించాల్సిందిపోయి.. ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కూడా లెక్కలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక రాజన్నరాజ్యం తెస్తానన్న కాన్సెప్ట్‌ తెలంగాణలో ఎంత వరకు ఇంపాక్ట్‌ చూపిస్తుందో ఆలోచించకపోవడం కూడా మైనస్‌గానే చూస్తున్నారు. పార్టీని విలీనం చేస్తే ఇందిరమ్మ రాజ్యం, రాజీవ్‌ పేరునే పలకాలి తప్ప రాజన్నరాజ్యం అంటే కుదరదు. బహుశా ఈ అంశం కూడా విలీనానికి అడ్డొచ్చి ఉండాలి. షర్మిల పార్టీలో చేరితే నేతల మధ్య ఓ చీలిక తీసుకురావొచ్చన్న అనుమానాలను కేంద్ర నాయకత్వానికి కొందరు నేతలు చెప్పి ఉంటారని తెలుస్తోంది. పైగా కాంగ్రెస్‌ పార్టీకే డెడ్‌లైన్‌ పెట్టి.. పార్టీని కలిపేసుకుంటారా లేదా అనడం కూడా కరెక్ట్‌ కాదంటున్నారు. కారణాలు ఏవైతేనేం ఇప్పటికైతే విలీనం ఆగినట్టే. కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి పిలుపువస్తే మళ్లీ ఆలోచిస్తారు. లేదంటే ఒంటరిపోరు తప్పదు. ఒంటరిపోరుపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోబోతున్నారని, ప్రెస్‌విూట్‌ పెట్టబోతున్నారని టాక్‌ నడుస్తోంది. 9వ తేదీ నుంచి వైఎస్‌ఆర్‌టీపీ నుంచి పోటీ చేయాలనుకునే అభ్యర్ధుల కోసం దరఖాస్తులను కూడా ఆహ్వానించాలనుకుంటున్నారు. సో, ఈలోపు జరగాల్సిన కార్యక్రమాలు పూర్తి చేస్తూ.. ఢల్లీి నుంచి పిలుపు వస్తే ఆలోచిద్దాం అనే రీతిలో షర్మిల వ్యూహం సాగుతోంది.ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్‌ ద్వారా హైకమాండ్‌కు ప్రతిపాదనలు పంపినా పని అవలేదంటే.. ఏవో బలమైన కారణాలే ఉండి ఉండాలి. ఇందులో ప్రధానంగా కనిపిస్తున్నది షర్మిల మూలాలే. ఆమె సీమాంధ్రకు చెందిన వ్యక్తి కావడం, ఉద్యమ సమయంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మాటలు, అప్పట్లో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా షర్మిల చేసిన కామెంట్లు.. ఇవే విలీనానికి ప్రధాన అడ్డంకిగా మారాయంటున్నారు. 2018లో టీడీపీతో కాంగ్రెస్‌ జతకట్టినందుకు.. సెంటిమెంట్‌ అస్త్రం ఎలా ప్రయోగించారో అందరూ చూశారు. ఎన్నికల ముందు అలాంటి తప్పిదం చేయొద్దని హైకమాండ్‌కు రాష్ట్ర నాయకత్వం బలంగా చెప్పిందంటున్నారు. టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారినా.. ఆంధ్ర ప్రాంత నాయకులు తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టడాన్ని అధికార పార్టీ వ్యతిరేకిస్తోంది. అసలు కాంగ్రెస్‌ పార్టీలోనే ఆ వ్యతిరేకత కనిపించింది. వీహెచ్‌, రేణుకా చౌదరి లాంటి వాళ్లు షర్మిల రాకను ఆహ్వానించడం లేదు. వెళ్లి ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోండని డైరెక్టుగానే చెప్పేశారు. సో, ఎట్టిపరిస్థితుల్లోనూ షర్మిల పార్టీ విలీనం వద్దే వద్దని రాష్ట్ర నాయకులు హైకమాండ్‌కు చెప్పి ఉంటారు.మరోవైపు సునీల్‌ కనుగోలు టీమ్‌ కూడా షర్మిల పార్టీ విలీనంపై గట్టిగానే సర్వే చేసిందని చెబుతున్నారు. వైఎస్‌ఆర్‌టీపీని విలీనం చేసుకుంటే లాభమా, నష్టమా అనే దానిపై కొన్ని శాంపిల్స్‌ కలెక్ట్‌ చేసిందంటున్నారు. అందులో నెగటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ రావడంతోనే హైకమాండ్‌ కూడా వెనకడుగు వేసినట్టు చెబుతున్నారు. లేదంటే.. డీకే శివకుమార్‌ చెప్పిన తరువాత దాదాపుగా విలీన ప్రక్రియ ఆగకూడదు. అయినా సరే ఆగిందంటే.. సునీల్‌ కనుగోలు ఇచ్చిన రిపోర్ట్‌ కూడా ఓ కారణమని తెలుస్తోంది. కర్నాటక ఎన్నికల్లోనూ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు మాటలనే అక్కడి కాంగ్రెస్‌ నేతలు విన్నారు. సో, డీకే శివకుమార్‌ను నొప్పించుకుండా ఉండడం కోసం ఓ సర్వే చేయించి, ఆ రిపోర్ట్‌ ఆధారంగానే విలీనంపై వెనకడుగు వేశారని చెప్పుకుంటున్నారు. పైగా విలీనం కోసం ఇటు షర్మిల అటు కాంగ్రెస్‌ అధిష్టానం కొన్ని షరతులు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పాలేరు టికెట్‌తో పాటు 20 అసెంబ్లీ స్థానాలు షర్మిల అడిగినట్టు చెబుతున్నారు. హైకమాండ్‌ మాత్రం ఏపీ రాజకీయాలకే ఒప్పుకోవాలని, కావాలంటే రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్‌ చేసినట్టు చెబుతున్నారు. రెండు పార్టీల మధ్య ముడిపడకపోవడంతో.. షర్మిలనే ఒంటరి దారి వెతుక్కుంటున్నారని తెలుస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *