టీడీపీకి అనుకున్నంత ఈజీయే కాదు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు రానున్న ఎన్నికలు సవాల్‌ అని చెప్పక తప్పదు. వచ్చే ఎన్నికలు పార్టీ మనుగడను కూడా ప్రశ్నార్థకం చేస్తాయి. అధికారం మరోసారి దక్కకపోతే పార్టీ మనుగడ కూడా కష్టసాధ్యమే అవుతుంది. అందుకే చంద్రబాబు తనకు శక్తికి మించి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ నేతల్లోనూ, క్యాడర్‌ లోనూ కొంత విశ్వాసాన్ని అయితే నింపగలిగారు. కానీ ప్రజలలో మాత్రం ఇంకా విశ్వాసాన్ని నింపలేకపోతున్నారు. అందుకు అనేక కారణాలున్నాయి. చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం ఉన్నప్పటికీ ఆయన చెప్పే మాటలకు, ఇచ్చే హావిూలకు విశ్వసనీయత లేకపోవడం. దివ్యవాణి వంటి నేతలు పార్టీని వీడటం కూడా పార్టీకి ఇబ్బంది కలిగించేవే. ఆమె చెప్పినట్లుగానే బాబు కొందరి చేతుల్లో బందీ అయ్యారన్నది కాదనలేని వాస్తవం. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సమాచారాన్ని కొందరు పార్టీ నేతలు చంద్రబాబును తప్పుదోవ పట్టిస్తున్నారన్న దివ్యవాణి మాటల్లో నిజం లేకపోలేదు. అది సరిచేసుకునే వయసు చంద్రబాబుది కాదన్నది కూడా అంతే నిజం. చంద్రబాబుకు సమర్థ నాయకుడిగా పేరుంది. మంచి అడ్మినిస్ట్రేషర్‌ గా కూడా ఆయన గుర్తింపు పొందారు. దానిని ఎవరూ కాదనలేరు. ఆయన విజన్‌ ను కూడా ఎవరూ తప్పుపట్టలేరు. కానీ సంక్షేమ పథకాలకు వచ్చే సరికి ఆయనపై పేద, దిగువ, మధ్య తరగతి ప్రజల్లో విశ్వాసం లేదు. ముఖ్యంగా జగన్‌ అమలు పర్చే వివిధ పథకాలను, కార్యక్రమాలను చంద్రబాబు అధికారంలోకి వస్తే కొనసాగించరన్న నమ్మకం ప్రజల్లో ఉంది. జగన్‌ వివిధ పథకాల ద్వారా నగదు రూపంలో ఇచ్చే పథకాలు కావచ్చు. ముఖ్యంగా ఆరోగ్య శ్రీ విషయంలో కావచ్చు చంద్రబాబు కొనసాగించరన్న నమ్మకం ఆ వర్గాల ప్రజల్లో బలంగా ఉంది. దాదాపు మూడున్నర కోట్ల మంది వివిధ పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారు. మధ్య, ఎగువ తరగతి ప్రజల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత కన్పిస్తుంది. అయితే వారిలో ఎంత మంది పోలింగ్‌ కేంద్రాలకు వస్తారన్నది సందేహమే. ఎందుకంటే వారికి ఎన్నికలపై పెద్దగా నమ్మకం లేకపోవడం, క్యూలైన్లలో నిలబడి నిరీక్షించే ఓపిక లేకపోవడం వంటి కారణాలు ఆ వర్గాలు ఓటింగ్‌ కు కొంత దూరంగా ఉంటూ వస్తున్నట్లు గత ఎన్నికల పోలింగ్‌ తీరు చెబుతుంది. ఇక ఉద్యోగస్థుల్లో కొంత వ్యతిరేకత కన్పిస్తుంది. అయినా ఆర్టీసీ వంటి ఉద్యోగులు చంద్రబాబు తమను ప్రభుత్వంలో కొనసాగిస్తారన్న నమ్మకం లేదు. అందుకే ఆర్టీసీ ఉద్యోగులతో పాటు, మరికొన్ని సంస్థల ఉద్యోగులు చంద్రబాబు సంస్కరణల వైపు మొగ్గు చూపుతారన్న సందేహంతో వారు తిరిగి సైకిల్‌ కు ఓటు వేసే ధైర్యం చేయరన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా ఉన్నప్పుడు మాత్రమే విజయం సాధ్యమవుతుంది. దీంతో పాటు స్థానిక ఎమ్మెల్యేల పట్ల ఉన్న వ్యతిరేక కూడా ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా మారతాయి. రెండేళ్ల సమయంలో జగన్‌ ఆ వ్యతిరేకతను కొంత తగ్గించే చర్యలు చేపట్టే వీలుంది. గతంలో చంద్రబాబు మహాకూటములు ఏర్పాటు చేసినా ఆయన విజయం సాధించలేకపోయారన్న వాదన ఎటూ ఉండనే ఉంది. ఈసారి కూడా అన్ని రాజకీయ పార్టీలు ఏకమయినా తమ విజయం ఖాయమన్న ధీమాలో వైసీపీ ఉంది. అయితే చంద్రబాబు ఈసారి తనకు చివరసారి ఛాన్స్‌ ఇవ్వాలని ప్రజల ముందుకు వెళ్ళనున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో నెగ్గుకు రావడం చంద్రబాబుకు అంత సులువు కాదు. జగన్‌ పై అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమై అది పోలింగ్‌ కేంద్రాల వరకూ వస్తేనే బాబుకు విజయం సాధ్యమవుతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. మరి రానున్న కాలంలో ఏం జరుగుతుందో చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *