కమ్యూనిస్టులకు దూరమే….

భారత రాష్ట్ర సమితితో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండటానికి తామేవిూ సన్యాసం తీసుకోలేదని సీపీఐ అగ్రనేత నారాయణ స్పష్టం చేశారు. కేసీఆర్‌ నుంచి పొత్తులపై సానుకూల సంకేతాలు రాకపోతే ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. మునుగోడు ఉపఎన్నికల సమయంలో కేసీఆర్‌..కమ్యూనిస్టులతో కలిసి రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలోనూ కలిసి పని చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా వెనక్కి తగ్గుతున్నారు. దీంతో జాతీయ రాజకీయాల విషయంలోనూ కేసీఆర్‌ వెనక్కి తగ్గుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత భారత రాష్ట్ర సమితి ఎప్పుడూ పొత్తుల గురించి ఆలోచించలేదు. మజ్లిస్‌ తెర వనుక నుంచి ఇచ్చే సహకారం చాలని.. అనుకుంటోంది. మజ్లిస్‌ సహకరిస్తూ వస్తోంది. అయితే టీఆర్‌ఎస్‌ ను బీఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాతా జాతీయ రాజకీయాలను ప్రారంభించిన కేసీఆర్‌ కమ్యూనిస్టులను చేరదీశారు. వచ్చే ఎన్నికల్లోనూ కలిసి పనిచేద్దామని మునుగోడు ఉపఎన్నికల్లో వారి మద్దతు పొందారు. బీఆర్‌ఎస్‌ విజయంలో వారి ఓట్లు కీలకమయ్యాయని చెబుతూ ఉంటా?. కానీ ఇప్పుడు కేసీఆర్‌ ఆ లెఫ్ట్‌ పార్టీల గురించి మాట్లాడటం లేదు. కనీసం పిలిచి మాట్లాడటం లేదు. నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఆయన జాతీయ రాజకీయాల గురించే మాట్లాడటం లేదు కాబట్టి.. లెఫ్ట్‌ పార్టీల నేతలకూ ఆహ్వానాలు లేకుండా పోయాయి. అందుకే సీపీఐ జాతీయ నేత నారాయణ.. కేసీఆర్‌ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సరైన స్పందన రావడం లేదని.. అలాగని తామేవిూ సన్యాసం తీసుకోలేదని ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామంటున్నారు. అంటే టీఆర్‌ఎస్‌ పొత్తులు పెట్టుకుంటే సీట్లివ్వాలి కానీ ఇప్పుడు ఒక్క సీటు కూడా కేటాయించే అవకాశం లేదు. అలాంటి సూచనలు కూడా కేసీఆర్‌ ఇవ్వడం లేదని చెబుతున్నారు. ప్రతీ సారి మజ్లిస్‌ తో లోపాయికారీ పొత్తులు ఉంటాయి. ఈ సారి మజ్లిస్‌ నుంచి ఆ పార్టీకి అలాంటి సహకారం వస్తుందా లేదా అన్నది సందేహమే. పాతబస్తీలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వరకూ ఢోకా లేదు. కానీ ఆ బయట కూడా సత్తా చూపించాలని ఊబలాటపడుతోంది. రెండు, మూడు అసెంబ్లీ సీట్లు ఇచ్చినా సంతృప్తి పడుతుంది. కానీ కేసీఆర్‌ పాతబస్తీ బయట మజ్లిస్‌ బలపడటానకి చాన్సిస్తారా అంటే.. అసలు చాన్స్‌ లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది ఇక అడపా దడపా కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుల గురించి చర్చల్లోకి వస్తుంది కానీ.. అది అసాధ్యమని రాజకీయ వర్గాలందరికీ తెలుసు. ఒక వేళ జాతీయ స్థాయి లో ఏదైనా రాజకీయం చేయాలనుకుంటే అక్కడ చేస్తారు కానీ.. గల్లీలో మాత్రం ఆ రెండు పార్టీలు కొట్లాడుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే బీఆర్‌ఎస్‌ ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే అవకాశం లేదు. జాతీయ రాజకీయాల కోణంలో తెలంగాణలోనూ కొన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకునే విషయాన్ని ఆలోచన చేయాలని గతంలో కేసీఆర్‌ అనుకున్నారు. కమ్యూనిస్టు పార్టీలతో పాటు బీఎస్పీ వంటి పార్టీలతో పొత్తుల గురించి ఆలోచించినట్లుగా తెలుస్తోంది. కారణం ఏదైనా కానీ..కేసీఆర్‌ జాతీయ రాజకీయాల విషయంలో పూర్తిగా సైలెంట్‌ అయ్యారు. గతంలోలా ఇతర రాష్ట్రాల నుంచి నేతల్ని పిలిపించి కండువాలు కప్పడం లేదు. బహిరంగసభల ఆలోచనలు చేయలేదు. దీంతో .. ముందు తెలంగాణలో ఒంటరి పోరు చేసి.. బీఆర్‌ఎస్‌ ను గట్టెక్కించుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *