ఉత్కంఠ రేపుతున్న రామగుండం..

కరీంనగర్‌, అక్టోబరు 4
కార్మిక క్షేత్రంగా పేరుగాంచిన రామగుండం నియోజకవర్గంలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మరో షాక్‌ తగిలింది. రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బీజేపీ పార్టీకి రాజీనామా చేసారు.ఈ సారి ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్‌ గా పోటీచేయడమే శ్రేయస్కరమని భావిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఇంజనీర్‌ గా పనిచేసిన సోమారపు సత్యనారాయణ 1998లో కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టి రామగుండం మున్సిపాలిటీ తొలి ఛైర్మైన్‌ గా ఎన్నికయ్యారు.2004 వరకు ఛైర్మైన్‌ గా కొనసాగిన సత్యనారాయణ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి మంథని నుండి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేసారు.ఆ తదుపరి 2009 లో రామగుండం నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌ గా పోటీచేసి ఘన విజయం సాధించి తిరిగి కాంగ్రెస్‌ పార్టీ లో చేరారు.తెలంగాణా రాష్ట్ర సాధనకోసం కేసీఆర్‌ చేసిన పోరాటానికి ఆకర్షితుడై టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన సోమారపు 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు.సోమారపు పనితీరు మెచ్చిన కేసీఆర్‌ 2016లో ఆర్టీసీ ఛైర్మైన్‌ గా నియమించారు.2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి టీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసిన సత్యనారాయణకు స్వంత పార్టీ నేతలు సహకరించకపోవడంతో ఓటమి పాలయ్యారు.సోమారపు సత్యనారాయణ ప్రియశిష్యుడిగా పారిశ్రామిక ప్రాంతంలో పేరుగాంచిన కోరుకంటి చందర్‌, 2018లో జరిగిన ఎన్నికల్లో చివరి క్షణంలో సోమారపు సత్యనారాయణపై రెబెల్‌ అభ్యర్థిగా పోటీలో నిలిచారు.స్వంత పార్టీ నేతలే రెబెల్‌ అభ్యర్థి కోరుకంటికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించి.. సోమారపును ఎన్నికల్లో ఓడిరచారని భావించి టీఆర్‌ఎస్‌ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరారు.కాంగ్రెస్‌ పార్టీ నుండి ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, బీజేపీ పార్టీ నుండి సోమారపు సత్యనారాయణలు అసెంబ్లీ అభ్యర్థులుగా ఖరారయ్యారనే ప్రచారం నేపథ్యంలో బీజేపీ పార్టీకి రాజీనామా చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.గతంలో పలుపార్టీల్లో పనిచేసిన అనుభవంతో పాటు అన్ని పార్టీలతో సత్సంబంధాల నేపథ్యంలో ఏదొక పార్టీ అభ్యర్థిగా ఉంటే ఇతర పార్టీలవాళ్ల మద్దతు తక్కువగా ఉంటుందని సోమారపు భావిస్తున్నారు. రెబెల్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగితే కోరుకంటి చందర్‌ పై ఉన్న వ్యతిరేఖత తనకు అనుకూలం అవుతుందని,కార్మిక సంఘాల నాయకుల మద్దతు కూడా తనకే దక్కుతుందని భావిస్తున్నారు.ఈ ఆలోచనతో సోమారపు సత్యనారాయణ ఇండిపెండెంట్‌ గా పోటీలోకి దిగడం ఖాయమని తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అయిన కోరుకంటి చందర్‌ పై జరిపిన సర్వేల్లో సోమారపు ముందంజలో ఉన్నట్టు భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ తిరిగి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి రావాలని స్వయంగా ఆహ్వానించినా ,సున్నితంగా తిరస్కరించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.గత ఎన్నికల్లో చందర్‌ కు కేటీఆర్‌ మద్దతునివ్వడం వల్లే తాను ఓటమి పాలయ్యాయని, బీఆర్‌ఎస్‌ నుంచి తాను పోటీచేయడానికి అవకాశమిచ్చినా చందర్‌ మరో సారి ఇండిపెండెంట్‌ గా నిలుస్తాడని,కేటీఆర్‌ మరోసారి తనకు మద్దతు ఇవ్వడనే గ్యారంటీ ఏముందని సన్నిహితుల దగ్గర వాపోయినట్టు ప్రచారం జరుగుతోంది. ఏమైనా రామగుండం నియోజకవర్గంలో రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతూ ఉత్కంఠ ను రేపుతున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *