ఓ వైపు వరదలు.. మరో వైపు కరువు

ఖరీఫ్‌ వరి సాగు సీజన్‌ ప్రారంభమై రెండు నెలలు గడిచినా రైతులకు సాగు నీరు ఇబ్బందులు తప్పడం లేదు. తోటపల్లి ప్రాజెక్టు నుంచి గత రెండు సంవత్సరాలుగా సాగునీరందక రైతులు ఇబ్బందులు పడుతుంటే, గడిగెడ్డలో నీరు ఎక్కువై వృధాగా పోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా అక్కడ కూడా రైతులకు నీరు సక్రమంగా అందడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకచోట నీరు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే మరోచోట నీరుండీ సక్రమంగా పొలాలకు అందడం లేదని ఇబ్బందులు పడుతున్నారు. వెరసి రెండు చోట్లా రైతులకు నీటి కష్టాలు తప్పడం లేదు. అధికారులు దీనిపై దృష్టి సారించాల్సి ఉంది. తోటపల్లి ప్రాజెక్ట్‌ నుండి చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని 25,100 ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందని, ప్రజాప్రతినిధులు, అధికారులు సభలు, సమావేశాలలో చెప్పారు. కానీ ఇంత వరకూ తోటపల్లి కాలువలు నుండి పూర్తిస్థాయిలో సాగునీరు అందలేదు. గత ప్రభుత్వం పరిపాలనలో రెండు, మూడు సంవత్సరాలు సాగునీరు కొంత వరకు సరఫరా చేశారు. గడిచిన ఖరీఫ్‌, ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌కు సాగునీరు అందక పోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తోటపల్లి నీరు కోసం ఈ సంవత్సరం ప్రజాప్రతినిధులు, అధికారులు కనీసం పట్టించుకోలేదని వల్లాపురం, నాగళ్లవలస, తాటిపూడి, గొలగాం, రాగోలు గ్రామాల రైతులు అంటున్నారు. తోటపల్లి నుండి సాగు నీరును అ దించాలని రైతులు కోరుతున్నారు. రైతు ప్రభుత్వం అంటూ చెబుతున్న పాలకులు రైతులు గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తోటపల్లి డిఇ వివరణ కోరగా వారం రోజుల్లో తోటపల్లి నీరు గుర్ల మండలానికి వస్తుందని తెలిపారు.మండలంలో గడిగెడ్డ రిజర్వాయర్‌లో నీరు పుష్కరలంగా ఉంది. అయితే కుడి కాలువకు సంబంధించి బూర్లపేట సువిూపంలో కాలువ పై నుంచి నీరు పొంగి పైకి ప్రవహించడంతో సాగునీరు వృధాగా పోతుంది. కాలువలో మట్టి పేరుకపోవడం, పిచ్చి మొక్కలు ఉండడంతో నీరు ప్రవాహానికి అడ్డంకిగా మారి నీరు సరఫరా సక్రమంగా జరగడం లేదు. వేసవిలో కాలువలో ఉన్న మట్టి, పిచ్చి మొక్కలను తొలగించక పోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని రైతులు అంటున్నారు. ఎడమ కాలువకు శివారు ప్రాంతాలైన పాలవలస, గూడెం, పునపరెడ్డిపేట గ్రామాల కు కూడా సాగునీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *