ఎవరో..దెబ్బకు… విద్యార్ధుల బలి

తెలంగాణలో పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య రాజకీయ యుద్దానికి ఈ లీకేజీ మరో అస్త్రంగా మారింది. అయితే ఇప్పటికే 30 లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్‌ ప్రశ్నార్ధకంగా మార్చిన, టీఎస్పీఎస్సీ లీకుల బాగోతానికి తోడు ఇప్పడు ఈ పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ పరీక్ష ఇంకెంత మంది చిన్నారుల భవిష్యత్‌ ను ప్రశ్నార్ధకం చేస్తుందో అనే ఆందోళన తల్లి తండ్రులలో వ్యక్త మవుతోంది. ముఖ్యంగా హిందీ పేపర్‌ లీకేజికి నువ్వే కారణమంటూ అభం శుభం తెలియని ఓ విద్యార్ధిని ఏకంగా ఐదేళ్ళ పాటు డిబార్‌ చేసిన అధికారుల నిర్ణయం ఇటు విద్యార్ధులు, అటు తల్లి తండ్రులను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇక విషయంలోకి వస్తే అసల్యంగా వెలుగులోకి వచ్చిన సమాచారం మేరకు, హనుమకొండ జిల్లాలోని కమలాపూర్‌ ప్రభుత్వ బాలుర పాఠశాలలో పరీక్ష రాస్తున్న ఒక విద్యార్ధిని లీకేజీకి కారణం అని ఆరోపిస్తూ ఎగ్జామ్‌ హాల్‌ నుంచి బయటికి పంపించేశారు. ఎగ్జామ్‌ రాస్తుండగా అధికారులు వచ్చి, డీబార్‌ అయ్యావని చెప్పి హాల్‌ టికెట్‌ తీసుకున్నారని విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. తాను పరీక్ష రాస్తుండగా వేరే సర్‌ తో పిలిపించి, తన హాల్‌ టికెట్‌ తీసుకుని బయటికెళ్లమని డీఈవో సర్‌ చెప్పారని విద్యార్థి తెలిపాడు. అప్పుడే తనను డీఈవో సర్‌ సంతకం చేయమన్నారని, అక్కడ అందరూ ఉండడంతో భయపడి సంతకం చేశానని చెప్పాడు. ఎందుకు సైన్‌ చేయించుకుంటున్నారని అడిగితే.. నీ వల్లే పేపర్‌ లీకైందని, వైరల్‌ అయిందని చెప్పినట్టు విద్యార్థి తెలియజేశాడు. తనను ఐదు సంవత్సరాలు డిబార్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏప్రిల్‌ 4న హిందీ ఎగ్జామ్‌ జరుగుతుండగా ఓ వ్యక్తి తనను పిలిచి, తన పేపర్‌ ఇవ్వమని బెదిరించాడని, అయినా తాను ఇవ్వలేదన్నాడు. ఆ వ్యక్తి కాసేపయ్యాక సడెనా గా వచ్చి కిటికీలోనుంచి చేయి పెట్టి తన పేపర్‌ గుంజుకుని, ఫొటోలు తీసుకున్నాడని తెలిపాడు. ఆ తర్వాత ఏమైందో కూడా తనకు తెలియని చెప్పాడు. అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని చెప్పాడు. ఈ రోజు జరిగిన ఇంగ్లీష్‌ ఎగ్జామ్‌ రాయలేదని, ఆ విద్యార్థి వాపోయాడు. జీవితంలో చేయని తప్పుకు శిక్షను అనుభవిస్తున్నానని, ఈ రోజు జరిగిన ఎగ్జామ్‌ మినహాయిస్తే.. సప్లిమెంటరీలోనైనా ఎగ్జామ్‌ రాస్తానని, తనపై విధించిన డిబార్‌ తీసేయాలని కోరాడు. తన హాల్‌ టికెట్‌ తనకు ఇవ్వాలని, మిగతా ఎగ్జామ్స్‌ రాసేందుకు పర్మిషన్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. మరో వంక విద్యార్థి తల్లి ఇప్పటి వరకూ తన కొడుకుపై ఎలాంటి రిమార్కు రాలేదని చెప్పారు. ఒకబ్బాయి వచ్చి తన కొడుకును చంపుతా, పొడుస్తానంటూ బెదిరించాడని ఆమె తెలిపారు. ఎవరికైనా చెబితే చంపుతానన్నాడని చెప్పారు. తమ క్కూడా ముందుగా చెప్పలేదని, ఈ రోజు ఇంగ్లీష్‌ ఎగ్జామ్‌ రాయనివ్వలేదని, ఎవరో చేసిన పనికి తన కొడుకును బలిపశువును చేయొద్దని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాము తప్పు చేసే మనుషులం కాదన్న ఆమె.. తన కొడుకు బంగారు భవిష్యత్తును ఆగం చేయకండంటూ వేడుకున్నారు. తెలియక భయపడి సంతకం పెట్టాడని, హాల్‌ టికెట్‌ ఇచ్చి రేపట్నుంచి ఎగ్జామ్‌ కు అనుమతించండి అని ఆమె కోరారు. నిజానికి, పదవ తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో అటు విద్యా శాఖ అధికారులు, ఇటు విచారణ చేస్తున్న పోలీసు యంత్రాంగం వ్యవహారం చూస్తే గుడ్డెద్దు చేలో పడినట్లు ఉందని పరీక్ష నిర్వహణలో అనుభవం ఉన్న రిటైర్డ్‌ అధికారులు, ఉపాధ్యాయులు అంటున్నారు. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారాలు ఎవరికీ కొంచెం కూడా క్లారిటీ లేనట్లే ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిందీ పేపర్‌ లీక్‌ కాలేదని స్వయంగా విద్యాశాఖ మంత్రి ప్రకటించిన తర్వాత, అర్థరాత్రి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ను అరెస్ట్‌ చేయడంతో కథ మారిపోయింది. పేపర్‌ లీక్‌ గురించి తెర వెనక ఏమి జరుగుతుందో మంత్రి గారికి కూడా తెలియదా? తెలియకుండానే ఆమె హిందీ పేపర్‌ లీక్‌ కాలేదని ప్రకటించారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదెలా ఉన్నా, ఎవరో ఆగంతకుడు పరీక్ష కేంద్రలోకి సెల్‌ ఫోన్‌ తో వచ్చి విద్యార్ధి నుంచి ప్రశ్న పత్రం బలవంతంగా తీసుకుని, ఫోన్‌ లో ఫోటోలు తీసుకున్నాడంటే, అందుకు బాధ్యత విదార్ధిది అవుతుందా? ఒక వేళ ఆ విద్యార్ధి,ఆ అగంతకునికి ముందే బేరం కుదుర్చుకుని సహకరించాడని అనుకున్నా, ఆగంతకుడు పరీక్ష కేంద్రంలోకి ఎలా వచ్చారు? అందుకు ఎవరు సహకరించారు? ఎవరు బాధ్యత వహించాలి,అనే ప్రశ్న కు ఎవరు సమాధానం చెపుతారు?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *