సిద్ధిపేటలో వివక్ష…

మెదక్‌, జూలై 7
దళితులకు సెలూన్‌ షాపులో కటింగ్‌ వేయమని వివక్ష చూపుతున్న ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది. గ్రామపెద్దల ఆదేశాలతో దళితులను షాపులోకి అనుమతించడంలేదు.మద్యం మత్తులో దళితుడిపై మూత్రవిసర్జన చేసిన అమానవీయ ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగుచూసింది. దళితులపై వివక్ష చూపుతూ సెలూన్‌ షాప్‌ లోకి రానీయకుండా అమానుషంగా ప్రవర్తించారు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లా జగదేవ్‌ పూర్‌ మండలం తిమ్మాపూర్‌లో చోటుచేసుకుంది. గత కొన్నాళ్లుగా దళితులకు హెయిర్‌ సెలూన్‌లలో కటింగ్‌ చేసేందుకు నాయీబ్రాహ్మణులు నిరాకరిస్తున్నారు. ఇతర కులాల వారికి సెలూన్‌ లో కటింగ్‌ చేస్తామని, దళితులకు మాత్రం చెట్టు కింద చేస్తామని నాయీ బ్రాహ్మణులు చెప్తున్నారు. గ్రామపెద్దలు ఒప్పుకుంటేనే దళితులను సెలూన్‌ షాపులలో అనుమతిస్తామని చెబుతున్నారు. దీంతో దళితులు చేసేదేంలేక చెట్టుకిందే క్షవరం చేయించుకుంటున్నారు. దళితులకు షాపులలో ఎందుకు కటింగ్‌ చేయరని ప్రశ్నిస్తే… గ్రామ పెద్దలు ఒప్పుకోవడం లేదని నాయీబ్రాహ్మణులు అంటున్నారు. దీంతో కులవివక్ష చూపుతున్నారని దళితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. దళితుల పట్ల గ్రామ పెద్దలు వివక్ష చూపడంపై విమర్శలు వస్తున్నాయి.మధ్యప్రదేశ్‌ లోని సిధి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఒక షాప్‌ లో మొబైల్‌ రీచార్జ్‌ కోసం వచ్చిన దశరథ్‌ రావత్‌ అనే గిరిజనుడు, షాప్‌ బిజీగా ఉండడంతో బయట కూర్చున్నారు. ఫూటుగా మద్యం తాగి, సిగరెట్‌ కాలుస్తూ అటువైపు వచ్చిన ప్రవేశ్‌ శుక్లా…మద్యం మత్తులో దశరథ్‌ రావత్‌ ముఖంపై మూత్ర విసర్జన చేశాడు. అక్కడి వారు, ఆ షాపు యజమాని అతన్ని వారించినా వినకుండా, ఆ దారుణానికి పాల్పడ్డాడు. వీడియో తీస్తున్నామని బెదిరించినా పట్టించుకోలేదు. దాంతో ఆ దారుణాన్ని వీడియో తీసి సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేశారు. ఆ వీడియో వైరల్‌ కావడంతో, నెటిజన్లు, ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ విచారణకు ఆదేశించారు. నిందితుడిని వెంటనే అరెస్ట్‌ చేసి, కఠినంగా శిక్ష పడేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. నిందితుడిపై పోలీసులు ఐపీసీ, ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ లతో పాటు జాతీయ భద్రత చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. దాంతో పాటు, బాధితుడు దశరథ్‌ ను భోపాల్‌ లోని తన అధికారిక నివాసానికి పిలిపించుకున్న సీఎం చౌహాన్‌.. అతడిని కుర్చీలో కూర్చోబెట్టి, తాను కింద కూర్చుని, పళ్లెంలో అతడి కాళ్లు పెట్టి, ఆ కాళ్లను కడిగి జరిగిన తప్పుకు క్షమాపణ అడిగారు. తాను ప్రజా సేవకుడినని, ప్రజలు తనకు దేవుళ్లతో సమానమని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. ఈ దారుణానికి పాల్పడిన ప్రవేశ్‌ శుక్లాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నివాసాన్ని అధికారులు కూల్చివేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *