శరత్‌బాబుకు కన్నీటి వీడ్కోలు

అనారోగ్యంతో కన్నుమూసిన సీనియర్‌ నటుడు శరత్‌బాబు (72) భౌతికకాయానికి అంత్యక్రియలు ముగిశాయి. కొంత కాలంగా హైదరాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరత్‌బాబు సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని మంగళవారం ఉదయం ప్రత్యేక వాహనంలో చెన్నైకి తీసుకువచ్చారు. స్థానిక టి.నగర్‌ వైద్యరామన్‌ వీధిలోని శరత్‌బాబు స్వగృహం వద్ద ఉదయం 9 గంటలకు ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శన కోసం ఉంచారు. అనంతరం తమిళ సినీ ప్రముఖులు, నటీనటులు ఆయనకు నివాళులర్పించేందుకు తరలివచ్చారు. నటి సుహాసిని మణిరత్నం, హాస్యనటుడు వైజీ మహేంద్రన్‌ తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, శరత్‌కుమార్‌, ఆయన సతీమణి రాధిక, దర్శకుడు కె.భాగ్యరాజ్‌, సూర్య, కార్తీ, పార్తీబన్‌, భానుచందర్‌ తదితరులు శరత్‌బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో శరత్‌బాబు భౌతికకాయానికి స్థానిక గిండి శ్మశానవాటికలో కుటుంబీకులు శాస్త్రోక్తంగా దహనక్రియలు నిర్వహించారు.

ఆప్తమిత్రుడిని కోల్పోయా : రజనీకాంత్‌

‘‘శరత్‌బాబు చాలా మంచి వ్యక్తి, ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించేవాడు. ఆయన కోపంతో ఉండడాన్ని నేనెప్పుడూ చూడలేదు. సినిమాల్లోకి రాకముందే ఆయన నాకు పరిచయం. నేనంటే చాలా అభిమానం. నాతో కలిసి ఆయన నటించిన చిత్రాలన్నీ సూపర్‌హిట్‌, సిగరెట్‌ కాల్చితే చాలా బాధపడేవాడు. నా చేతిలో సిగరెట్‌ ఉంటే లాగి పడేసేవాడు. ఆరోగ్యం జాగ్రత్త అంటూ హెచ్చరించేవాడు. ‘అన్నామలై’ చిత్రంలో ఆయనతో పోటీపడి ఓ సీరియస్‌ దృశ్యంలో నటించేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. వెంటనే శరత్‌బాబు ఎక్కడి నుంచో ఓ సిగరెట్‌ను తెప్పించి నాకిచ్చి రిలాక్స్‌ అయిన తర్వాత నటించమన్నాడు. సరేనని కాసేపు రిలాక్స్‌ అయ్యాక ఆ దృశ్యంలో చక్కగా నటించాను. ఎప్పుడూ నా బాగోగులు కోరుకునే మిత్రుడు ఇలా ఆకస్మికంగా మృతి చెందటం చాలా బాధగా వుంది. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను’’ అని రజనీకాంత్‌ పేర్కొన్నారు.

కొండంత అండగా ఉండేవారు : సుహాసిని మణిరత్నం

శరత్‌బాబుతో 40 చిత్రాల్లో నటించాను. ఆయన నటించిన సినిమాకి కెమెరా ఉమెన్‌గానూ పనిచేశాను. నా తొలిచిత్రం ‘నెంజత్తై కిళ్లాదే’ చిత్రంలోనూ శరత్‌ నటించారు. ‘సంసారం ఒక చదరంగం’, ‘అమ్మ’, వంటి పలు అద్భుతమైన చిత్రాల్లో ఆయనతో కలసి నటించాను. సెట్‌లో నాలాంటి ఆర్టిస్టులకు కొండంత అండగా ఉండేవారు. చివరిసారిగా ఆయన్ని నేను, చిరంజీవిగారు వెళ్లి చూశాం. అప్పటికే ఆయన మాట్లాడలేని పరిస్థితిని చూసి చిరంజీవిగారు కన్నీళ్లు పెట్టుకున్నారు. – ఆంధ్రజ్యోతి, చెన్నై

Leave a comment

Your email address will not be published. Required fields are marked *