ఇక అందరికి..అందుబాటులోకి బాస్‌….

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొమ్మిదేళ్ల పాటు ప్రగతి భవన్‌ నుంచే పాలన సాగించారు. ఆయన సచివాలయానికి వచ్చింది లేదు. ప్రగతి భవన్‌లోనే ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం ఉండటంతో అక్కడే ఆయన ఉండేవారు. ప్రగతి భవన్‌లోకి ఎవరికీ ఎంట్రీ ఉండేది కాదు. ప్రగతి భవన్‌ నుంచి పిలుపు వస్తేనే ఎంట్రీ. లేకుంటే మంత్రులయినా సరే.. నో ఎంట్రీ. తొమ్మిదేళ్ల పాటు కేసీఆర్‌ పాలన ఇలాగే సాగింది. కానీ మే 1వ తేదీ నుంచి పూర్తిగా మారిపోయింది. కేసీఆర్‌ ఇక అందరికీ అందుబాటులోకి వస్తున్నారు. ఎమ్మెల్యేలు కలిసేందుకు కూడా సీఎం కేసీఆర్‌ కొంత సమయం ఇచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు గులాబీ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన ఘనత కూడా కేసీఆర్‌ దే. అందులో ఎవరికి ఏమాత్రం సందేహం లేదు. అయితే కేసీఆర్‌ నియోజకవర్గాల పర్యటనకు వచ్చినప్పుడు మాత్రమే ఆయన దర్శన భాగ్యం మంత్రులకు, ఎమ్మెల్యేలకు లభిస్తుంది. మంత్రులయితే కేబినెట్‌ సమావేశాల్లో కలుస్తున్నా అంత వరకే. ఆ అజెండా వరకే. తమ నియోజకవర్గం, జిల్లా సమస్యల గురించి మాట్లాడేందుకు వీలు లేదు. ప్రగతి భవన్‌లో తమ సమస్యలపై కలవాలనుకునే వారికి గగనమే. గగనమే అనే కన్నా అది అసాధ్యమని చెప్పాలి. అయితే అక్కడి నుంచి పిలుపు వస్తేనే ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో, ఉప ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే ఎమ్మెల్యేలయినా, మంత్రులయినా కేసీఆర్‌ ను దర్శించుకునే వీలుంది. కానీ ఏప్రిల్‌ 30వ తేదీ నుంచి కొత్త సచివాలయం ప్రారంభం కానుంది. ఈ సచివాలయంలోని ఆరో అంతస్థులో కేసీఆర్‌ తన ఛాంబర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. సచివాలయం లోపలికి మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లే అవకాశాలు సులువుగా ఉంటాయి. ఇక కేసీఆర్‌ మూడ్‌ చూసుకుని ఆయనతో ముచ్చటించడానికి టైం కోరితే లక్‌… పిలిచినా పిలవొచ్చు. ఆయన ఖాళీగా ఉంటే పిలుస్తారు. లేదంటే మరో తేదీ ఇచ్చే అవకాశాలున్నాయి. గతంలో సచివాయం నుంచి పనిచేసిన ముఖ్యమంత్రులు అందరూ ఇదే విధానాన్ని పాటించే వారు. ఎమ్మెల్యేలకు కొంత సమయం కేటాయించే వారు. వారు వచ్చి తమ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను ప్రస్తావించి, వాటి పరిష్కారానికి ముఖ్యమంత్రి నుంచి త్వరగా నిధులు తెచ్చుకునే వీలుండేది. కానీ తొమ్మిదేళ్ల నుంచి ఎమ్మెల్యేలకు ప్రగతి భవన్‌లో ప్రవేశం లేదు. అందులోకి ఎంట్రీ అంటే మామూలు విషయం కాదు. కుదిరే పని కాదని కేటీఆర్‌ ను కలసి తమ సమస్యల గురించి చెప్పుకునే వారు. కానీ మే 1వ తేదీ నుంచి గులాబీ బాస్‌ అందరివాడులా మారబోతున్నాడు. ఆయన అందరికీ అందుబాటులో ఉండనున్నారు. సెక్రటేరియట్‌లో కేసీఆర్‌ ఉన్నంత సేపు ఆయన పిలుపు కోసం ఎదురు చూసేందుకు ఎమ్మెల్యేలకు ఇక చక్కని అవకాశమంటున్నారు. అందుకే కొత్త సెక్రటేరియట్‌ ప్రారంభమవుతుందంటే ముందుగా ఎగిరి గంతేస్తుంది ఎమ్మెల్యేలే. సో.. ఇక కేసీఆర్‌ ఆరో అంతస్థులో అందరికీ అందుబాటులో ఉంటారన్న విషయం గులాబీ పార్టీ నేతల్లో హుషారు నింపుతుంది. మరి కేసీఆర్‌ వారికి ఎంత మేర సమయం కేటాయిస్తారన్నది చూడాల్సి ఉంది.
RRRRRRRRRRRRRRRRRR

Leave a comment

Your email address will not be published. Required fields are marked *