కొత్త చట్టాలతో సామాజిక న్యాయం

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా లోక్‌సభలో ప్రవేశపెట్టిన మూడు కీలక బిల్లులు భారతీయ సమాజంపై తీవ్ర ప్రభావం చూపగల చట్టాలకు దారి తీసే అవకాశమున్నది. భారతీయ శిక్షాస్మృతి (ఎఖఅ)ని రద్దు చేసే కొత్త బిల్లు మొదటిసారిగా , వేర్పాటు, సాయుధ తిరుగుబాటు, విధ్వంసక కార్యకలాపాలు, వేర్పాటువాదం, భారతదేశ ఐక్యత, సార్వభౌమాధికారం మరియు సమగ్రతను సవాలు చేయడం వంటి నేరాలను నిర్వచించి, ఆస్తులను జప్తు చేయడానికి అనుమతిస్తుంది.అధికారులు, రాజద్రోహం యొక్క నిబంధనలు రద్దు చేయబడుతున్నాయి. ప్రకటన లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉందని, దాని చట్టాలలో దేశద్రోహానికి చోటు లేదని అన్నారు. కొత్త బిల్లు ఉగ్రవాదానికి నిర్వచనాన్ని అందిస్తుంది. ‘‘ఎవరైనా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేసినా, లేదా అలాంటి యుద్ధం చేయడానికి ప్రయత్నించినా, లేదా అలాంటి యుద్ధానికి సహకరించినా, మరణశిక్ష లేదా జీవిత ఖైదు మరియు జరిమానా కూడా విధించబడుతుంది.దేశంలో జరిగే నేరాలకు సంబంధించిన న్యాయ వ్యవస్థలో మార్పులను ఈ బిల్లులు ఉద్దేశిస్తున్నాయి. వలస కాలం నాటి చట్టాలంటూ ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (భారత శిక్షాస్మృతిఐపిసి) ను, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ (భారత సాక్షాల చట్టం) ను, క్రిమినల్‌ ప్రోసీజర్‌ కోడ్‌ (నేర శిక్షాస్మృతి) ను రద్దు చేస్తున్నామని అమిత్‌ షా ప్రకటించారు. వీటికి బదులుగా వరుసగా భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ సాక్ష్యా, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత అనే పేర్లతో కొత్త చట్టాలు రానున్నాయి. ఈ బిల్లులకు హిందీ పేర్లు పెట్టడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ వెంటనే ఖండిరచారు. ఈ బిల్లులను ప్రస్తుతానికి పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపించాలని మంత్రి సభను కోరారు. అందుచేత ఇవి పార్లమెంటు శీతాకాల సభల్లోనే ఆమోదం పొందే అవకాశాలున్నాయి. హత్యలు, స్త్రీలపై అత్యాచారాలు వంటి సామాజిక నేరాలకు కఠినమైన శిక్షలు ఈ బిల్లుల్లో ప్రతిపాదించారు.పెళ్ళి చేసుకొంటానని మభ్యపెట్టి మహిళను లొంగదీసుకొనే నేరానికి పదేళ్ళ శిక్షను, మూకలు విరుచుకుపడి చేసే హత్యకు ఉరి శిక్షను భారతీయ న్యాయ సంహిత బిల్లులో ఉద్దేశించారు. ఈ బిల్లులో మొత్తం 313 సవరణలు చేసినట్టు బోధపడుతున్నది. మహిళలకు నేరగాళ్ళ నుంచి భద్రత కల్పించడానికి ఉద్దేశించిన ఈ బిల్లు భార్యతో లైంగికంగా కలవడాన్ని అత్యాచారం (రేప్‌) గా పరిగణించరాదని ఈ బిల్లు స్పష్టం చేస్తున్నది. మహిళ అనుమతి లేకుండా భర్త జరిపే బలవంతపు కలయికను వైవాహిక అత్యాచారంగా పరిగణించాలనే డిమాండ్‌ ముందుకొస్తున్న నేపథ్యంలో ఈ స్పష్టీకరణ వివాదాస్పదం అయ్యే అవకాశాలున్నాయి. ఐపిసిలోని రాజద్రోహ నేరానికి సంబంధించిన సెక్షన్‌ను రద్దు చేయాలని నిర్ణయించడం ఒక మంచి పరిణామమే. దీని రద్దు కోసం చిరకాలంగా డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సెక్షన్‌ మాదిరిగానే ప్రమాదకరంగా వున్న ఇతర సెక్షన్లు, చట్టాలు వున్నాయి. అన్ని చట్టాలను సాకల్యంగా పరిశీలించి న్యాయ సవిూక్షకు అందకుండా నిరవధికంగా జైలు పాలు చేసేందుకు అవకాశమున్న ప్రతిఒక్క సెక్షన్‌ను, చట్టాన్ని మానవీయ కోణంతో సవరించవలసిన అవసరం ఎంతైనా వుంది.తీవ్రవాదులను, ఉగ్రవాదులను శిక్షించే పేరిట ప్రభుత్వం తనకు గిట్టని వ్యక్తులను, మేధావులను జైల్లో పెట్టేందుకు వాడుకొంటున్న ‘ఉపా ‘ వంటి శాసనాలను కూడా పునఃపరిశీలించవలసి వుంది. బెయిల్‌ కూడా నిరాకరిస్తూ నిరవధిక నిర్బంధానికి సందు కలిగిస్తున్న చట్టాలను మార్చవలసి వుంది. కేసుల సకాల దర్యాప్తు, విచారణ, తీర్పు ప్రకటన జరిగేలా మార్పులు తెస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి తెలిపిన అంశాన్ని హర్షించవలసిందే. దర్యాప్తు జరుగుతున్నదంటూ పోలీసులు నిరవధికంగా ఆలస్యం చేయడానికి గల అవకాశాలను తొలగిస్తున్నట్టు మంత్రి చెప్పారు. వారు ప్రాథమిక అభియోగ పత్రాన్ని (ఛార్జిషీట్‌) దాఖలు చేయడానికి గరిష్ఠంగా 180 రోజులు వ్యవధి ఇవ్వనున్నట్టు వెల్లడిరచారు. అలాగే నేర పరిశోధనలో భాగంగా సోదాలు, స్వాధీనాలు జరిపేటప్పుడు పోలీసులు తప్పనిసరిగా వాటిని వీడియో తీయాలని, అది లేకుండా ఛార్జిషీట్‌ను అనుమతించడం జరగదని ఈ బిల్లు స్పష్టం చేస్తున్నది. నేరాలకు కఠిన శిక్షలు విధించడం, వాటిని నిర్దాక్షిణ్యంగా అమలు పరచడం ఒక పార్శం కాగా, అసలు అవి జరగడానికి దారి తీస్తున్న పరిస్థితుల విూద దృష్టి పెట్టడం మరొక పార్శం.ఇప్పటికే నిర్భయ చట్టం వంటి తీవ్రమైన శిక్షలను ఉద్దేశించిన శాసనాలు ప్రభుత్వాల అమ్ములపొదిలో వున్నాయి. అంతమాత్రాన ఆ నేరాలు ఆగడం లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మహిళలపై ఎన్నెన్ని అక్రమాలు సంభవిస్తున్నాయో చెప్పడం కష్టం. 2021 నాటి జాతీయ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో సమాచారం ప్రకారం ఆ ఏడాది దేశంలో 31,677 రేప్‌ కేసులు నమోదయ్యాయి. అంటే సగటున రోజుకు 86 కేసులు. 2020లో 28,046 కేసులు, 2019లో 32,033 కేసులు రిజిస్టర్‌ అయ్యాయి. మహిళలపై అత్యాచారాలు ఏటేటా పెరుగుతున్నాయే గాని తగ్గడం లేదు. ఈ నేరాలు చేసే వారికి చట్టం గురించి తెలియదా, తెలిసీ దానిని ఖాతరు చేయకుండా చేస్తున్నారా, అదే జరుగుతుంటే అందుకు గల మూల కారణాన్ని శోధించి తగిన పరిష్కారాన్ని కనుక్కోవాలి. స్త్రీని ద్వితీయ శ్రేణి పౌరగా పరిగణించే ధోరణి, పురుషుడికి ఎదురు తిరిగే సాహసం తనంత తానుగా చేయలేని పరిస్థితి పోతే గాని ఆమె తన భద్రతను తానే చూసుకోగల మంచి రోజులు రావు. అటువంటి రోజులు రానంత వరకు శిక్షాస్మృతులను ఎంత కఠినంగా తీర్చిదిద్దినా ఆశించిన ప్రయోజనం వుండదు. అన్ని నేరాల సందర్భంగానూ వాస్తవ స్థితిని తెలుసుకొని శాస్త్రీయమైన దృష్టితో చట్టాలను సవరించే వైఖరి సమాజానికి మేలు చేస్తుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *