పిఠాపురం ఫ్యాన్‌ కెక్కలు చెల్లా చెదురు

కాకినాడ జిల్లాలోని పిఠాపురం వైసీపీలో కొత్త సెగలు రేగుతున్నాయి. ఎంపీ వంగాగీత, ఎమ్మెల్యే పెండెం దొరబాబు మధ్య రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇద్దరూ పిఠాపురం కేంద్రంగా పొలిటికల్‌ ఎత్తుగడలు వేస్తున్నారు. రోజులు గడిచేకొద్దీ అవి కాకరేపుతున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యేలు వేసే ఎత్తుగడలు.. రాజకీయ వ్యూహాలు ఆసక్తిగా మారుతున్నాయి.వంగా గీత కాకినాడ వైసీపీ ఎంపీగా ఉన్నారు. అంతకుముందు టీడీపీ తరఫున జడ్పీ ఛైర్‌పర్సన్‌గా.. రాజ్యసభ సభ్యురాలిగా పని చేశారు. వంగా గీత సొంత నియోజకవర్గం పిఠాపురం. కాకినాడ పార్లమెంట్‌ పరిధిలోనే ఉంటుంది. 2009లో పీఆర్పీ తరఫున పిఠాపురం నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కాంగ్రెస్‌లో కొనసాగారు. 2019 ఎన్నికల వరకు సైలెంట్‌గా ఉన్న ఆమెకు.. అప్పటి వరకు కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న చెలమలశెట్టి సునీల్‌ టీడీపీలోకి వెళ్లిపోవడంతో రాజకీయంగా కలిసి వచ్చింది. వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేయడం గెలవడం చకచకా జరిగిపోయింది.పెండెం దొరబాబు 2004లో బీజేపీ నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత వైసీపీలో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో ఓడినా.. 2019లో గెలిచారు. వంగా గీత, దొరబాబు ఇద్దరూ ఒకే సామాజికవర్గం. ప్రస్తుతం ఒకే పార్టీ. అయినప్పటికీ ఇద్దరికీ అస్సలు పడదు. ఇటీవల కాలంలో పిఠాపురంపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు వంగా గీత. ఇది ఎమ్మెల్యే దొరబాబుకు చిర్రెత్తుకు వస్తోందట. నియోజకవర్గంలో ఎవరి గ్రూప్‌ వారిదే. పార్టీ నాయకులు ఒకరితో సఖ్యతగా ఉంటే మరొకరికి శత్రువు కావడం ఖాయం అనే చర్చ ఉంది. పార్టీ ఒక్కటే అయినా వర్గాలు వేర్వేరుతన పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపీగా పర్యటిస్తే తప్పేంటి అనేది గీత వేస్తున్న ప్రశ్న. కానీ, ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడటం లేదు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో హాజరైనా నోటితో నవ్వుకుని నొసటితో వెక్కిరించుకుంటున్న పరిస్థితి ఉంది. ఒకే పనికి చెరొక ఆర్డర్‌ ఇస్తుండటంతో అధికారులు సైతం తల పట్టుకుంటున్నారట. ఏదైనా ఉంటే విూరూ విూరూ తెల్చుకోవాలి కానీ.. మధ్యలో మమ్మల్ని డోలక్‌ వాయించినట్టు వాయిస్తే ఎలా మహాప్రభో అని గగ్గోలు పెడుతున్నారట అధికారులు. వైపీపీ కేడర్‌కి సైతం చుక్కలు కనిపిస్తున్నాయట.నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే బాస్‌ అని పార్టీ స్పష్టం చేసిందని.. మధ్యలో ఈ గూడు పుఠాణీ ఏంటన్నది ఎమ్మెల్యే దొరబాబు వాదన. అయితే వైసీపీలో చేరినప్పుడే అసెంబ్లీకి పోటీ చేయాలని వంగా గీత చూశారట. సామాజిక సవిూకరణాల వల్ల ఆమెను కాకినాడ ఎంపీగా పోటీ చేయించింది పార్టీ. చెలమలశెట్టి సునీల్‌ తిరిగి వైసీపీలోకి రావడవంతో.. వంగా గీత పిఠాపురం అసెంబ్లీ సీటుపై కన్నేసినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. వైసీపీలో మొదటి నుంచి ఉన్న తమను కాదని వేరెవరికో ఎలా టికెట్‌ ఇస్తారని దొరబాబు వర్గం కౌంటర్‌ ఇస్తోందట. ఈ క్రమంలోనే ఎంపీ దగ్గరకు వెళ్లిన వారికి ఎమ్మెల్యే దగ్గర పనులు కావని.. ఆయనకి టచ్‌లో ఉంటే ఆమె దగ్గర నోఎంట్రీ అని జోకులు పేలుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, ద్వితీయశ్రేణి నేతలు సైతం ఇరువురు నేతల వ్యవహార శైలికి నొచ్చుకుంటున్నారట. ఎవరికి వారు తమ ఆధిపత్యం కోసం తమని బలి చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారట. ఈ విషయం పార్టీ పెద్దలు దృష్టికి తీసుకుని వెళ్లాలని ప్రయత్నం చేసినా అవి ఆచరణలోకి రాలేదట.. ఈ లోపు రోజు రోజుకి నియోజకవర్గం ఫ్యాన్‌ పార్టీ లీడర్లకి హీట్‌ పెరిగిపోతోంది. మరి.. ఈ ఆధిపత్యపోరులో ఎవరు పైచెయ్యి సాధిస్తారో చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *