మైనంపల్లిపై వేటుకు… విూన మేషాలు..?

హైదరాబాద్‌, ఆగస్టు 24
భారత రాష్ట్ర సమితిలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అంతా మైనంపల్లి హన్మంతరావుదే. ఆయన ఉద్దేశపూర్వకంగానే టార్గెట్‌ చేసినట్లుగా హరీష్‌ రావుపై కామెంట్లు చేస్తున్నారని.. దీని వెనుక బీఆర్‌ఎస్‌ అంతర్గత రాజకీయాల కోణం ఉందన్న చర్చలు జరుగుతున్నాయి. తిరుమలలో అలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా మైనంపల్లికి టిక్కెట్‌ ప్రకటించారు. ఇప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోలేదు. ఏ క్షణమైనా సస్పెండ్‌ అనే లీకులు వస్తున్నాయి. ప్రత్యామ్నాయ అభ్యర్థిపై కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు. కానీ ఆయన సైలెంట్‌ గా ఉంటే అంతా సర్దుకుపోతుందని బీఆర్‌ఎస్‌లోని ఓ వర్గం గట్టి నమ్మకంతో ఉంది. బీఆర్‌ఎస్‌ సోషల్‌ విూడియా టీం కూడా మైనంపల్లికి వ్యతిరేకంగా పోస్టులు ఆపేసింది. గత ఏడాది డిసెంబర్‌లో మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలందర్నీ తన నివాసానికి పిలిచారు. మల్లారెడ్డి కారణంగా పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని ఆరోపణలు చేశారు. ఈ అంశం బీఆర్‌ఎస్‌ లో హాట్‌ టాపిక్‌ అయింది. కానీ తర్వాత చల్లారిపోయింది. అప్పట్లో మల్లారెడ్డిని టార్గెట్‌ చేసిన మైనంపల్లి హన్మంతరావు ఇప్పుడు పార్టీలో మరో కీలక అయిన హరీష్‌ రావును లక్ష్యంగా ఎంచుకున్నారు. హరీష్‌ రావుపై చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. సిద్దిపేటలోనే ఓడిస్తానని సవాల్‌ చేశారు. మైనంపల్లి సవాళ్లను చూస్తే… హరీష్‌ రావును పూర్తి స్థాయిలో టార్గెట్‌ చేశారని అర్థం చేసుకోవచ్చు. మైనంపల్లికి, హరీష్‌ రావుకు పాత గొడవులు ఉన్నాయా అంటే… లేవనే సమాదానం వస్తుంది. మరి ఎందుకు టార్గెట్‌ చేశారు ?మైనంపల్లి మెదక్‌ జిల్లాకు చెందిన వారు. 2009లో మహాకూటమిలో భాగంగా టీఆర్‌ఎస్‌ పొత్తులో మెదక్‌ సీటు టీడీపీకి వచ్చింది. టీడీపీ నుంచి మైనంపల్లి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత ఆయన హైదరాబాద్‌ సిటీకి మారాలనుకుని.. మెదక్‌ ఎమ్మెల్యేగా ఉంటూ… మల్కాజిగిరిలో టీడీపీ తరపున పని చేసుకున్నారు. కానీ 2014కి వచ్చే సరికి.. బీజేపీతో పొత్తుల్లో ఆయనకు చాన్స్‌ దొరకలేదు. దాంతో కాంగ్రెస్‌లో చేరారు. అక్కడా టిక్కెట్‌ దొరకకపోవడంతో వెంటనే బీఆర్‌ఎస్‌ లో చేరి ఎంపీగా పోటీ చేశారు. మల్లారెడ్డి చేతిలో చాలా స్వల్ప తేడాతోనే ఓడిపోయారు కానీ.. కేసీఆర్‌ మంచి ప్రాధాన్యం ఇచ్చారు. తర్వాత మల్కాజిగిరి టిక్కెట్‌ ఇచ్చారు. అయితే తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన మెదక్‌ ను తన కుమారుడికి వారసత్వంగా ఇవ్వాలని.. గత మూడు,నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. మెదక్‌ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ తరపున పద్మా దేవందర్‌ రెడ్డి వరుసగా రెండు సార్లు గెలిచారు. ఆమె ఉన్నప్పటికీ.. మైనంపల్లి రోహిత్‌ తో … హన్మంతరావు అక్కడ పాగా వేయించే ప్రయత్నం చేశారు. విస్తృతంగా సేవా కార్యాక్రమాలు చేపట్టారు. సొంత వర్గాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్‌ దక్కుతుందన్న ఆయనకు నిరాశ ఎదురయింది. హరీష్‌ రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవే. కానీ ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన తరవాత కూడా కేసీఆర్‌ టిక్కెట్‌ ప్రకటించారు. ఆయన వెళ్తానంటే తాము అడ్డుకోబోమన్నారు. అయితే పార్టీలో కీలక నేత అయిన హరీష్‌ రావుపై ఆరోపణలు చేస్తే హైకమాండ్‌ నుంచి ఖండన రాకపోతే .. అది హరీష్‌ రావుకు అవమానమని అనుకున్నారేమో కానీ.. అలాంటి ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్‌ రావుకు అండగా ఉంటామని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. తర్వాత కవితకూడా స్పందించారు. హరీష్‌ పై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను ఖండిరచారు. బీఆర్‌ఎస్‌ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు మైనంపల్లి తన కుమారుడికి టిక్కెట్‌ విషయంలో తగ్గే అవకాశం లేదని.. ఆయన పార్టీ మారిపోవడం ఖాయమని చెబుతున్నారు. కానీ ఆయన లాంటి నేతలు వదులుకోవడం ఇష్టం లేని కేసీఆర్‌.. దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *