అత్యంత కీలకం కానున్న యూపీఐ ప్లగిన్‌

ముంబై, ఆగస్టు 8
ఆన్‌లైన్‌ చెల్లింపుల వ్యవస్థను ఒక రేంజ్‌కు తీసుకెళ్లింది యూపీఐ! జస్ట్‌ స్కాన్‌ చేస్తే చాలు సులభంగా డబ్బులు చెల్లించొచ్చు. ఫోన్‌ నంబర్‌ కొట్టినా డబ్బులు బదిలీ చేయొచ్చు. యూపీఐ లావాదేవీల్లో దాదాపు 80 శాతం వరకు ఫోన్‌పే, గూగుల్‌ పే నుంచే జరుగుతున్నాయి. మార్కెట్‌ లీడర్లుగా అవతరించిన ఈ రెండు యాప్స్‌కు ఇప్పుడో కొత్త టెక్నాలజీ సవాళ్లు విసురుతోంది. అదే యూపీఐ ప్లగిన్‌.యూపీఐ ప్లగిన్‌ను మర్చంట్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ కిట్‌ అనీ పిలవొచ్చు. ఈ వ్యవస్థ పేమెంట్స్‌ యాప్‌ అవసరం లేకుండానే డబ్బులు జమ చేసుకొనేందుకు వర్చువల్‌ పేమెంట్‌ అడ్రెస్‌ను సృష్టిస్తుంది. దాంతో థర్డ్‌పార్టీ యాప్‌ లేకుండానే కస్టమర్లు వేగంగా, సులభంగా డబ్బులు చెల్లించొచ్చు. ఉదాహరణకు స్విగ్గీ, జొమాటోనే తీసుకుందాం. వీటిల్లోంచి వినియోగదారులు ఆహార పదార్థాలని ఆర్డర్‌ చేసి డబ్బులు చెల్లించేందుకు యూపీఐ ఎంచుకున్నారని అనుకుందాం. అప్పుడా యాప్‌ నోటిఫికేషన్‌ ద్వారా గూగుల్‌ పే లేదా ఫోన్‌పేకు తీసుకెళ్లుంది. లావాదేవీ పూర్తవ్వగానే మళ్లీ స్విగీ, జొమాటోకు రీడైరెక్ట్‌ అవుతుంది. ఇలా చేసేటప్పుడు కొన్నిసార్లు ఎర్రర్స్‌, పేమెంట్‌ ఫెయిల్యూర్స్‌ వంటివి జరుగుతున్నాయి.యూపీఐ ప్లగిన్‌ ద్వారా ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టాలని ఎన్‌సీపీఐ భావిస్తోందని సమాచారం. ఈ ప్లగిన్‌ ఉంటే ఇకపై ఇతర యాప్స్‌తో సంబంధం లేకుండా నేరుగా స్విగ్గీ నుంచే డబ్బులు చెల్లించొచ్చు. పేటీఎం, రేజర్‌పే, జస్‌పే వంటివి ఎస్డీకేను ఎనేబుల్‌ చేసుకొనేందుకు మర్చంట్స్‌కు అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో సక్సెస్‌ రేటు 15 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నాయియూపీఐ లావాదేవీల్లో నంబర్‌ వన్‌గా ఉన్న ఫోన్‌పే మాత్రం యూపీఐ ప్లగిన్‌పై భిన్నంగా స్పందించింది. ‘సక్సెర్‌ రేటును మెరుగుపర్చేందుకు యూపీఐ ప్లగిన్‌ మోడల్‌ ఎలాంటి టెక్నాలజీ ప్రయోజనాన్ని అందించడం లేదు. ఇది పేమెంట్స్‌ యాప్స్‌ బాధ్యతలను స్పాన్సర్‌ బ్యాంకు, మర్చంట్‌ అప్లికేషన్‌కు మళ్లిస్తోంది. ఈ మోడల్‌ చాలా సంక్లిష్టమైంది. మర్చంట్స్‌కు మరింత భారం అవుతుంది. దాంతో వారు తమ ప్రధాన వ్యాపారంపై దృష్టి సారించలేరు’ అని ఆ కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ రాహుల్‌ చారీ అంటున్నారు.కొందరు మర్చంట్లు యూపీఐ ప్లగిన్‌ వైపు మళ్లేందుకు సిద్ధమవుతుండటం ఫోన్‌పే, గూగుల్‌ పేకు ఇబ్బందిగా మారుతోంది. ప్రస్తుతం ఫోన్‌పేకు 47 శాతం, గూగుల్‌ పేకు 33 శాతం మార్కెట్‌ వాటా ఉంది. వినియోగదారులు వీటి నుంచి కాకుండా నేరుగా మర్చంట్‌ యాప్స్‌ నుంచే డబ్బులు చెల్లిస్తే వీటి మార్కెట్‌ శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది. ‘స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా, డ్రీమ్‌11 వంటి పెద్ద కంపెనీలు యూపీఐ ప్లగిన్‌ వైపు వస్తే గూగుల్‌ పే, ఫోన్‌పేకు పెద్ద షాకే అవుతుంది. అప్పుడు వారి మార్కెట్‌ వాటా తగ్గుతుంది. అందుకే వారు భయపడుతున్నారు’ అని ఎన్‌సీపీఐతో సన్నిహితంగా పనిచేసే సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు మనీ కంట్రోల్‌కు తెలిపారు.నిజానికి చెల్లింపుల వ్యవస్థలోని మర్చంట్లు, పేమెంట్‌ ప్రాసెసర్లు, బ్యాంకులు సుదీర్ఘ కాలం నుంచి యూపీఐ ప్లగిన్‌ కోసం డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం యూపీఐ చెల్లింపుల్లో 57 శాతం మర్చంట్‌ లావాదేవీలే. అందులో సగం ఆన్‌లైన్‌ ద్వారానే జరుగుతున్నాయి. దీన్నుంచి ఫోన్‌పే, గూగుల్‌ పే ప్రయోజనం పొందుతున్నాయి. మర్చంట్లు యూపీఐ ప్లగిన్‌కు అలవాటు పడితే వీటికి సవాళ్లు ఎదురవ్వక తప్పదు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ లావాదేవీల్లో 60 శాతం వరకు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. రాబోయే రెండేళ్లలో ఇది 75 శాతానికి పెరుగుతుందని అంచనా. అందుకే యూపీఐ ప్లగిన్‌ అత్యంత కీలకం కానుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *