చావోరేవో..

ప్రావిడెన్స్‌ (గయానా): పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టు ఇప్పటి వరకు వరుసగా 11 సిరీ్‌సల రికార్డు విజయాలతో కొనసాగుతోంది. కానీ తాజాగా ఆ జైత్రయాత్రకు వెస్టిండీస్‌ రూపంలో ప్రమాదం కనిపిస్తోంది. ప్రస్తుతం ఐదు టీ20ల సిరీ్‌సలో 0-2తో వెనుకబడిన భారత్‌ నేడు (మంగళవారం) కీలక మూడో మ్యాచ్‌ బరిలోకి దిగనుంది. వరుసగా రెండు ఓటములతో ఉన్న హార్దిక్‌ సేన ఈ టీ20లో కచ్చితంగా గెలవాల్సిందే. అలా జరిగితేనే సిరీ్‌సలో సజీవంగా ఉంటుంది. ఇక్కడి స్లో పిచ్‌లపై బ్యాటింగ్‌ చేసేందుకు భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ తెగ ఇబ్బందిపడుతోంది. ఈ వైఫల్యంతోనే వరుస పరాజయాలు ఎదురయ్యాయి. అటు విండీస్‌ మాత్రం అంచనాలకు మించే రాణిస్తోంది. టెస్టు, వన్డే సిరీ్‌సలో ఓటమి తర్వాత పొట్టి ఫార్మాట్‌లో చెలరేగుతోంది. అన్ని విభాగాల్లోనూ ఆకట్టుకుంటూ ఇప్పుడు సిరీ్‌సపైనే కన్నేసింది. చివరిసారిగా 2016లో కరీబియన్‌ గడ్డపై భారత్‌ టీ20 సిరీస్‌ ఓడింది.

టాపార్డర్‌పై భారం
పొట్టి ఫార్మాట్‌లో తొలి బంతి నుంచే బ్యాట్లకు పనిచెప్పాల్సి ఉంటుంది. అయితే భారత టాపార్డర్‌ ఇషాన్‌, గిల్‌, సూర్యకుమార్‌ తమ స్థాయికి తగ్గట్టుగా రాణించడం లేదు. ఐపీఎల్‌లో వీరంతా ప్రత్యర్థులపై విరుచుకుపడినవారే. సిరీ్‌సలో వీరి వైఫల్యం మిడిలార్డర్‌పై పడుతోంది. ముఖ్యంగా శాంసన్‌ రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు. కానీ తిలక్‌ మాత్రం ఒత్తిడిని తట్టుకుంటూ పరుగులు రాబట్టడం కాస్త ఊరటనిచ్చే విషయం. ఒకవేళ ఓపెనర్లలో ఒకరిని తప్పించి జైస్వాల్‌ను ఆడిస్తారా? అనేది వేచిచూడాల్సిందే. బ్యాటర్లు మరింత బాధ్యత తీసుకోవాలని కెప్టెన్‌ హార్దిక్‌ కూడా తేల్చి చెప్పాడు. వాస్తవానికి ఏడో నెంబర్‌ వరకు భారత్‌కు పటిష్ట బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది. నేటి మ్యాచ్‌లో వీరంతా చెలరేగితే విజయం కష్టం కాబోదు. మరోవైపు నికోలస్‌ పూరన్‌ ఊచకోతను అరికట్టేందుకు స్పిన్‌త్రయం చాహల్‌, అక్షర్‌, కుల్దీప్‌ చక్కటి వ్యూహంతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. కొత్త బంతితో పేసర్లు హార్దిక్‌, అర్ష్‌దీప్‌ స్వింగ్‌ను రాబడుతున్నారు. మరో పేసర్‌ ముకేశ్‌ భారీగా పరుగులిచ్చుకోవడంతో అవేశ్‌ లేక ఉమ్రాన్‌లలో ఒకరిని బరిలోకి దింపవచ్చు.

జట్లు (అంచనా)

భారత్‌: గిల్‌, ఇషాన్‌/జైస్వాల్‌, సూర్యకుమార్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ (కెప్టెన్‌), శాంసన్‌, అక్షర్‌, కుల్దీప్‌, చాహల్‌, అర్ష్‌దీప్‌, ముకేశ్‌/ఉమ్రాన్‌.

వెస్టిండీస్‌: కింగ్‌, మేయర్స్‌, చార్లెస్‌, పూరన్‌, హెట్‌మయెర్‌, పావెల్‌ (కెప్టెన్‌), హోల్డర్‌, షెఫర్డ్‌, హొసేన్‌, జోసెఫ్‌, మెకాయ్‌.

పిచ్‌, వాతావరణం

రెండో మ్యాచ్‌లాగే ఈసారి కూడా స్లోపిచ్‌ ఎదురుకానుంది. దీంతో స్పిన్నర్లు కీలకమవుతారు. ఆకాశం మేఘావృతంగా ఉంటూ, మధ్యాహ్నం వర్షం కురిసే అవకాశం ఉండొచ్చు.

ఆత్మవిశ్వాసంతో విండీస్‌

2016 తర్వాత భారత్‌పై వరుసగా రెండు టీ20 మ్యాచ్‌లు గెలవడంతో విండీస్‌ శిబిరంలో జోష్‌ కనిపిస్తోంది. ఇదే ఉత్సాహంతో సిరీ్‌సను పట్టేయాలనుకుంటోంది. అయితే విండీస్‌ టాపార్డర్‌ కూడా బలహీనంగా ఉంది. బ్యాటింగ్‌లో నికోలస్‌ పూరన్‌పై ఒత్తిడి పడుతోంది. అతడి బాదుడుకు లక్ష్యం చిన్నదవుతోంది. తనతోపాటు హెట్‌మయెర్‌ స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగాలనుకుంటున్నారు. ఈ కీలక మ్యాచ్‌లో ఇతర బ్యాటర్లు కూడా రాణిస్తేనే భారీ స్కోరును ఆశించవచ్చు. అలాగే భారత్‌ను కట్టడి చేయడంలో బౌలర్లు సఫలమవుతున్నారు. అందుకే 2-0తో స్పష్టమైన ఆధిక్యంలో ఉండగలిగింది.

పూరన్‌పై జరిమానా

విండీస్‌ బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌ మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత పడింది. రెండో టీ20 సందర్భంగా బహిరంగంగా అంపైర్లను విమర్శించడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే అతడి ఖాతాలో ఒక డీమెరిట్‌పాయింట్‌ కూడా వేశారు. భారత ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో అంపైర్‌ రివ్యూపై తను విభేదిస్తూ వాగ్వాదానికి దిగాడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *