మరో వివాదంలో రాపాక…

ప్రజాప్రతినిధులు ప్రజాధనంతో రోడ్లు వేయిస్తారు. మౌలిక సదుపాయాలు కల్పించుకుంటారు. జనసేన తరపున రాజోలు నుంచి గెలిచిన రాపాక కూడా అదే చేశారు. కానీ ఆ రోడ్డు తన ఇంట్లో వేయించుకున్నారు. జనసేన పార్టీ నుంచి ఎన్నికైన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వరుస వివాదాల్లో నిలుస్తున్నారు.. ఇటీవలే తాను దొంగ ఓట్లు ద్వారా ఎన్నికయ్యానని చింతలపూడి అనే గ్రామంలో ఓ వేదికపై మాట్లాడి ఏకంగా ఎన్నికల కమిషన్‌ ద్వారా విచారణకు ఆదేశాలంది చిక్కుల్లో పడ్డ రాపాక ఇప్పుడు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ హిమాన్షుశుక్లా విచారణకు ఆదేశించారు.రాజోలు నియోజకవర్గ పరిధిలోనే మలికిపురం మండలం కత్తిమండ గ్రామంలో ఎమ్మెల్యే రాపాక నూతన గృహాన్ని నిర్మించుకున్నారు. అయితే ఇంటి ప్రహారీ గేట్‌ నుంచి ఇంటి వరకు రూ.12 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మించారు. ఇవి ఎంపీ ల్యాడ్స్‌ నుంచి మంజూరైన నిధులు. కాగా దీనిపై కేశవదాసుపాలెంకు చెందిన వెంకటపతిరాజు అనే వ్యక్తి కేంద్ర మంత్రిత్వశాఖకు మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు సదరు మంత్రిత్వ శాఖ నుంచి విచారణ చేయాలని ఆదేశాలందాయి. జిల్లా పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ చంటిబాబు కూడా దృవీకరించారు. ఈ రోడ్డు నిర్మాణంపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలందాయని తెలిపారు.ఇంటి ప్రహారీ లోపల భాగంలో సీసీ రోడ్డు నిర్మించున్నారన్న అభియోగాలపై ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఉన్న తన ఇంటికి కలవడానికి అనేక మంది ప్రజలు వస్తూ ఉంటారని, వారు ఇబ్బందులు పడకూడదనే ఆ స్థలాన్ని పంచాయతీకు రాసిచ్చి ఆపై తీర్మాణం చేశాకే రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. అంతే కాకుండా కొంత మేర ఆ రోడ్డును ఆనుకుని కొన్ని ఇళ్లు ఉన్నాయని అందుకే రోడ్డు నిర్మించినట్లు చెబుతున్నారు. జనసేన పార్టీ తరపున డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి 2019లో పోటీచేసి గెలుపొందిన రాపాక వరప్రసాదరావు ఏడాది కాలవ్యవధిలోనే అధికార వైసీపీ అనుకూలంగా ఉంటూ వ్యవహరిస్తున్నారు. నేరుగా వైసీపీ అధికారిక కార్యాక్రమాల్లో పార్టీ కండువా కప్పుకుని మరీ తిరుగుతున్నారు. అయితే ఈక్రమంలోనే ఇటీవలే మలికిపురం మండలం చింతలపూడి గ్రామంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఓ వీడియో వైరల్‌ అయ్యింది. తాను దొంగ ఓట్లతో నెగ్గానని ఆయనే స్వయంగా చెప్పిన మాటలు అందులో ఉన్నాయి. అయితే అది ఇప్పటి మాట కాదని, గతంలో తాను ఎమ్మెల్యేగా పోటీచేసినప్న్టటి మాట అని సర్ధి చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే దీనిపై ఓ వ్యక్తి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుచేయడంతో విచారణకు ఆదేశించింది. దీనిపై సంబందిత ఆదేశాలు జిల్లా కలెక్టర్‌ హిమాన్షుశుక్లాకు అందినట్లు కలెక్టరేట్‌ వెల్లడిరచింది..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *