ఏపీలో ఇసుక యుద్ధం

తిరుపతి, ఆగస్టు 28
టిడిపి అధినేత చంద్రబాబు ‘ఇసుకాసురుడు 40 వేల కోట్ల దోపిడీ’ పేరుతో చేసిన ప్రజెంటేషన్‌ అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. వైసీపీ 4 ఏళ్ల పాలనలో ఇసుక అక్రమ తవ్వకాలపై చంద్రబాబు చేసిన సంచలన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వాలు, కోర్టులు, ఎన్జీటీ విధించిన ప్రతి నిబంధనను తుంగలో తొక్కిన వైసీపీ సర్కార్‌ లో 40 వేలకోట్ల టన్నుల ఇసుక దోపిడీ జరిగిందని ఆరోపించారు. సీఎం జగన్కు ఇసుకే ఆహారం భూములు ఫలహారమని జగన్‌ ఇసుకాసురుడని తీవ్ర కామెంట్స్‌ చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టమని తిన్న ప్రతి పైసా కక్కిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. ఇసుక అక్రమ తవ్వకాల ద్వారా రూ. 40 వేల కోట్ల సొమ్ము దోపిడికి గురైందని ఆరోపించారు. ప్రభుత్వ ఖజానాకు చిల్లర విదిరించి సొంత జేబులు నింపుకున్నారని సంచలన కామెంట్స్‌ చేశారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ లో టిడిపి హయాంలో అమల్లోకి తెచ్చిన ఉచిత ఇసుక విధానం నుంచి వైసీపీ సర్కార్‌ లోని ఇసుక పాలసీ వరకు స్లైడ్లు వేసి మరి విశ్లేషించిన చంద్రబాబు సీఎం జగన్‌ దోపిడీ ఇదంటూ చెప్పే ప్రయత్నం చేశారు చంద్రబాబు.దీనిపై ఘాటుగా స్పందించారు వైసీపీ నేతలు. చంద్రబాబు అల్టిమేటంకు అధికారులే సమాధానం చెబుతారని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఇసుక పేరుతో డబ్బులు వసూలు చేశారా, లేదా అని మంత్రి పెద్దిరెడ్డి ప్రతిపక్ష నేతను ప్రశ్నించారు. వసూల్‌ చేసిన ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్ళిందో చెప్పాలన్నారు. ఈ క్రమంలోనే కేబినెట్‌ సబ్‌ కమిటీ ద్వారా ఇసుక పాలసీ తీసుకొచ్చామని, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎం.ఏస్‌. టి.సి ద్వారా టెండర్లను పిలిచామన్నారు పెద్దిరెడ్డి. ఎవరి ప్రభుత్వంలో ఏం జరిగిందో, ఇసుక ఆదాయం ఎంత వచ్చిందో లెక్కలతో సహా బయటపెట్టారని అన్నారు.కావాలంటే చంద్రబాబు ఇసుక టెండర్లలో పాల్గొనాలని కూడా సూచించిన మంత్రి పెద్దిరెడ్డి టన్ను ఇసుక రూ.375, అదనంగా రూ.100 అడ్మినిస్ట్రేషన్‌ ఎక్స్‌పెన్సేస్‌తో కలిసి రూ. 475 కు టన్ను ఇసుక అందుబాటులోకి తెచ్చామన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఉచిత ఇసుక విధానం పేరు చెప్పి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేశారో లేదో చెప్పాలన్నారు పెద్దిరెడ్డి. చంద్రబాబు హయాంలో ఇసుక తవ్వకాలపై రూ.100 కోట్లు ఎన్‌.జీ.టి ఫైన్‌ వేసిందన్నారు. చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్‌ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ కు ఇసుక తరలించి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. టిడిపి పాలనలో ఉచిత ఇసుక పేరుతో వేల కోట్లు పక్కదారి పట్టాయన్న పెద్దిరెడ్డి 2018`19 లో చంద్రబాబు పాలనలో భూగర్భ గనుల శాఖ కు రూ.1950 కోట్లు మాత్రమే ప్రభుత్వ ఆదాయం వస్తే 2022`23 లో రూ.4756 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.టిడిపి ప్రభుత్వ హయాంలో 2018`19 ఏడాదికి గాను ఎ.పి ఎం.డి.సి సంస్థ కు రూ. 833 కోట్లు ఆదాయం వస్తే, జగన్‌ పాలనలో రూ. 1806 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు పెద్దిరెడ్డి. ఇక 2022`23 లో రూ.4 వేల కోట్లు ఆదాయం వచ్చిందని, చంద్రబాబు ఇచ్చే అల్టిమేటంకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి. తప్పుడు లెక్కలతో చంద్రబాబు చేసిన ప్రజెంటేషన్‌కు త్వరలోనే అదే తరహా ప్రజెంటేషన్‌ గనుల శాఖ అధికారులు ఇస్తారన్నారు మంత్రి పెద్దిరెడ్డి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *