టీడీపీలోకి ఆనం …?

ఏపీలో సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ తీర్థం తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కేబినెట్‌ లోనే కాకుండా, ఆయన మరణానంతరం ఏర్పాటైన రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి మంత్రివర్గాల్లో కూడా కీలక మంత్రి పదవులు నిర్వహించారు. అలాంటి రామనారాయణరెడ్డికి వైసీపీలో ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా పోయిన విషయం అందరికీ తెలిసిందే. వైఎస్సార్‌ నుంచీ రాజకీయాల్లో కీలకంగా ఉన్న తనను వైసీపీ అధినేత, సీఎం జగన్‌ పూర్గిగా పక్కన పెట్టేయడం రామనారాయణరెడ్డికి తీవ్ర అవమానంగా ఉంది. ఈ క్రమంలోనే ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.వాస్తవానికి ఏపీలో వైసీపీ బలంగా ఉన్న జిల్లాల్లో నెల్లూరు ఒకటి. 2019 ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాలలోనూ వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏపీలో ప్రత్యేకత గల కుటుంబాల్లో ఆ కుటుంబం కూడా ఒకటి. గతంలో ఆనం కుటుంబం నుంచి రామనారాయణరెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి పలుమార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆనం రామనారాయణరెడ్డి కూడా 2004, 2009లలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి , రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి ల కేబినెట్‌ లలో కీలకమైన మంత్రింగా ఉన్నారు. ఒకానొక దశలో సీఎం పదవికి రామనారాయణరెడ్డి పేరు కూడా చర్చకు వచ్చింది. అటువంటి ఆనం రామనారాయణరెడ్డిని జగన్‌ తన పార్టీలో చేర్చుకుని, ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చినా, అంతకు మించి ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆయన ఒకింత ఆగ్రహంతో ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి జగన్‌ గుడ్‌ బై చెప్పి సొంతంగా వైఎస్సార్సీపీని ఏర్పాటు చేసిన సందర్భంలో ఆయనపై ఘాటుగా విమర్శలు చేసిన వారిలో ఆనం రామనారాయణరెడ్డి ఒకరు. ఆ కారణం చేతనే జగన్‌ ఆనంకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదంటున్నారు. అలాగే 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన రామనారాయణరెడ్డి వెంకటగిరి నుంచి విజయం సాధించారు. తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాం నుంచీ రాజకీయాల్లో, కేబినెట్‌ లో కీలకంగా ఉన్న రామనారాయణరెడ్డికి ప్రాధాన్యం ఇవ్వకుండా జగన్‌ పక్కన పెట్టేయడానికీ ఇదే కారణం అయి ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు. అయితే తనక ప్రాధాన్యత లేదన్న అసంతృప్తి రామనారాయణరెడ్డిలో ఉందంటారు. రామనారాయణరెడ్డి సీనియారిటీని జగన్‌ గుర్తించలేదని, సరైన పదవి ఇవ్వలేదనే అసంతృప్తి ఆనం అనుచరుల్లో కూడా ఉంది. ఎంతో సీనియారిటీ, అనుభవం ఉన్న తనకు జగన్‌ తన తొలి కేబినెట్‌ లో స్థానం కల్పించలేదు. సరికదా మంత్రివర్గ పునర్మాణంలో కూడా పట్టించుకోకపోవడంతో రామనారాయణరెడ్డి ఇక పర్టీలో కొనసాగి ప్రయోజనం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు ఆయన అనుచరులు అంటున్నారు. తొలి కేబినెట్‌ లోకి నెల్లూరు జిల్లా నుంచి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ను తీసుకున్న జగన్‌ మలి కేబినెట్‌ లో కాకాణి గోవర్ధన్‌ రెడ్డిని తీసుకోవడమే కాకుండా తనను అస్సలు పట్టించుకోకపోవడంపై ఆనం రామనారాయణ రెడ్డి రగిలిపోతున్నారని చెబుతున్నారు.ఇటీవలి టీడీపీ మహానాడు సందర్భంగా రామనారాయణరెడ్డి కుమార్తె కైవల్యారెడ్డి తన భర్తతో సహా వెళ్లి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తో సమావేశం కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కైవల్యారెడ్డి టీడీపీలో చేరతారని, ఆత్మకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారనే ప్రచారం కూడా అప్పట్లో జోరుగా జరిగింది. ఇలా లోకేష్‌ తో కైవల్యారెడ్డి భేటీ అవడం వెనుక ఆనం రామనారాయణరెడ్డి రాజకీయ మంత్రాంగం ఉందని, ముందు కుమార్తెను టీడీపీలోకి పంపించి, ఆనక ఆయన కూడా తెలుగుదేశానికే జై కొడతారనే ఊహాగానాలు జోరుగా ప్రచారంలోనికి వచ్చాయి.ఈ క్రమంలోనే వైసీపీ సర్కార్‌ పై రామనారాయణరెడ్డి విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారని, అధికారుల తీరుపై ఫైరయ్యారని కూడా అప్పట్లో రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరిగింది. టీడీపీలోకి వెళ్లాలనే యోచన చేస్తున్న వల్లే రామనారాయణరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే అనుమానాలూ వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే రామనారాయణరెడ్డి టీడీపీలో చేరాలనే ఆలోచన చేస్తున్నారంటూ తాజాగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. రామనారాయణరెడ్డి మాత్రం దీనిపై ఎక్కడా స్వయంగా బయటపడకపోవడం గమనార్హం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *