తెగిపోతున్న చెక్‌ డ్యాంలు….

నిజామాబాద్‌ జిల్లాలో ఈ నెల 10 నుంచి 12 వరకు కురిసిన వర్షాలకు చెక్‌ డ్యాంలు తెగిపోయాయి. ఈ వర్షాకాలంలో ఇప్పటికీ ఒక్కో చెక్‌ డ్యాం కనీసం రెండు సార్లు.. అధికంగా 3 సార్లు తెగాయి. అయితే ఇవేం పాతకాలం నాటి చెక్‌ డ్యాంలు కావు.. గత 2 ఏళ్ళ కాలంలో నిర్మంచినవే.. కోట్ల రూపాయలు ఖర్చు చేసినా.. అవన్నీ చెక్‌ డ్యాంలలో కొట్టుకుపోయాయి. మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెక్‌ డ్యాంలు కొట్టుకు పోతుండటంతో అధికార పార్టీ కార్యకర్తలు, రైతులు తలలు పట్టుకుంటున్నారు.నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా చెక్‌ డ్యాంల నిర్మాణాలు తలపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజక వర్గంలో మొత్తం 24 చెక్‌ డ్యాంలు నిర్మిస్తున్నారు. ఇందులో 17 చెక్‌ డ్యాంలు పూర్తవ్వగా.. మిగితావి ఇటీవలే అంచనాలు పూర్తి చేశారు. అధికారులు.. బాల్కొండ నియోజక వర్గంలోని కప్పల వాగు, పెద్దవాగు పై ఈ చెక్‌ డ్యాంలు నిర్మిస్తున్నారు. మొత్తం రూ.162 కోట్ల రూపాయలతో ఈ చెక్‌ డ్యాంల నిర్మాణం చేపట్టారు.అయితే ఇందులో కప్పల వాగు పై నిర్మించిన 1. బడా భీంగల్‌, అక్లూర్‌ మధ్యన (రూ.4.60 కోట్లు), 2. సికింద్రపూర్‌, బేజ్జోరా మధ్యన ( రూ.5.28 కోట్లు), 3. మోతె (రూ.5.01కోట్లు), 4. మోతె, అక్లూర్‌ మధ్యన (రూ.5.08 కోట్లు), 5. గోనుగొప్పుల (రూ.3.5 కోట్లు), 6. భీంగల్‌ (రూ.4.95 కోట్లు).. చెక్‌ డ్యాంలు పూర్తయ్యాయి.పెద్దవాగు పై నిర్మించిన 1. దోనుకల్‌, గాండ్ల పేట్‌ మధ్యన (రూ.4.84 కోట్లు), 2. వేల్పూర్‌ గ్రామ సవిూపంలో (రూ.4.14 కోట్లు), 3. జానకంపేట్‌ (రూ.4.80 కోట్లు), 4. ఎరగట్ల మండలం తొర్తి (రూ.4.79 కోట్లు), 5. పాలెం, ధర్మోరా మధ్యన (రూ.8.96 కోట్లు), 6. గాండ్ల పెట్‌, సుంకేట్‌ గ్రామాల మధ్యన (రూ. 9.56 కోట్లు), 7. వెంకటాపుర్‌ (రూ.6.66 కోట్లు), 8.వేల్పూర్‌ (రూ.9.36 కోట్లు), 9. కొత్తపల్లి (రూ.7.73కోట్లూ),10. పచ్చల నడుకుడా (రూ. 5.74 కోట్లు),11. కుకునూర్‌, సుంకేట్‌ మధ్యన (రూ. 9.03 కోట్లు) ఈ చెక్‌ డ్యాంలన్నీ నిర్మాణాలు పూర్తయ్యాయి.ఇవి కాక నూతనంగా మంజూరు అయినవి.. 1. మోర్తాడ్‌ మండలం శేట్పల్లి (రూ. 8.46 కోట్లు), 2. పాలెం`దోనుకల్‌ మధ్యన (రూ.11.24 కోట్లు), 3. రామన్నపేట (రూ.8.61 కోట్లు), 4. జానకంపెట్‌`వేల్పూర్‌ మధ్యన (రూ. 7.45 కోట్లు), 5. బేజ్జోరా` భీంగల్‌ మధ్యన (రూ.5.69 కోట్లు). 6. సాలిపూర్‌`సికింద్రాపూర్‌ (రూ.9.32 కోట్లు), 7. వెంకటాపుర్‌ (రూ.6.26కోట్లు).. నిర్మాణాలు కావాల్సి ఉన్నవి.బాల్కొండ నియోజకవర్గంలో మొత్తం 24 చెక్‌ డ్యాంలు మంజూరు కాగా 17 పూర్తయ్యాయి. మిగితా 7 చెక్‌ డ్యాంలు పనులు మొదలు కావాల్సి ఉంది. అయితే పనులు పూర్తయి ఇటీవల వర్షాలకు కొన్ని చెక్‌ డ్యాంలు తెగిపోయాయి. గోనుగొప్పుల, అక్లూర్‌, నడుకుడా, ధర్మోరా వద్ద చెక్‌ డ్యాంలు తెగగా, వాటిపై వేసిన రోడ్లు కూడా తెగిపోయాయి. ఈ సీజన్‌లో నిజామాబాద్‌లో భారీ వర్షాలు పడ్డాయి. గత జూన్‌ నుండి ఇప్పటి వరకు విస్తారంగా వర్షాలు కురుస్తునే ఉన్నాయి. ఈ క్రమంలో పెద్దవాగు పై నిర్మించిన పచ్చల నడుకుడ చెక్‌ డ్యాంలు ఇప్పటికి 3 సార్లు తెగిపోయింది. ఈ చెక్‌ డ్యాంను రూ.9 కోట్లతో నిర్మించగా ఈ సీజన్‌లో ఇప్పటికి 3 సార్లు తెగింది. నాసిరకం నిర్మాణాలు చేపట్టడంతో ఇలా జరిగిందన్న ఆరోపణలున్నాయి. గత నెలలో భారీ వరదలకు చెక్‌ డ్యాం కింది నుండి నీరు పోతుండటంతో ఇసుక సంచులతో ఆపే యత్నం చేసినా అది సఫలం కాలేదు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మరో సారి చెక్‌ డ్యాం తెగింది.నడ్కుడ వద్ద పెద్ద వాగుపై దాదాపు రూ.14 కోట్ల రూపాయాలతో మరో చేక్‌ డ్యామ్‌ నిర్మించారు. అయితే దీని ఎత్తు పెంచటం వల్ల ఈ సీజన్‌లో ఇది కూడా 3 సార్లు తెగిపోయింది. నీటి ప్రవాహానికి కట్ట కుంగిపోయింది. సైడ్‌ వాల్‌ తెగిపోయింది. దీంతో నీరంతా చెక్‌ డ్యాం పై నుండి కాకుండా తెగిన కట్టగుండా ప్రవహిస్తుంది. దీంతో 50 ఎకరాల పంట నీట మునిగింది. వ్యవసాయ భూమి తెగిపోయింది.. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.నియోజకవర్గంలో అత్యధికంగా చెక్‌ డ్యాంలు నిర్మించామని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, అధికారులు చెబుతున్నారు. కానీ, పనులన్నీ నాసిరకంగా జరిగాయన్న అనుమానాలున్నాయి. మంత్రి బంధువు ఒకరు ఈ చెక్‌ డ్యాంలన్నీ నిర్మించారు. దీంతో అంచనాలు పదే పదే పెంచారని, నాణ్యత ప్రమాణాలు పాటించలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. చెక్‌ డ్యాం కట్ట ఎత్తుగా నిర్మించటం, సైడ్‌ వాల్‌ మట్టి, ఇసుక తో ఏర్పాటు చేయడం వల్ల పదే పదే తెగిపోతున్నాయని ఆరోపిస్తున్నారు రైతులు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటికే తమ పంటలు రెండుసార్లు మునిగాయని తమని ఆదుకోవాలని కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *