సంజయ్‌ ఘర్‌ వాపసీ… లాభం లేదా…

నిజామాబాద్‌ మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌?. కొద్ది రోజుల క్రితం ఘర్‌ వాపసీలో భాగంగా.. తన తండ్రి డీఎస్‌తో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన్ని పార్టీలోకి తిరిగి రానీయకుండా జిల్లా నేతలు చాలా కాలం అడ్డుకున్నా..చివరికి ఆపలేకపోయారట. కుమారుడితో పాటే కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న డీఎస్‌.. ఆ తర్వాత మాట మార్చడంతో అసలా చేరికే గందరగోళంలో పడిరది.దీంతో కొన్నాళ్ళు మౌనంగా ఉన్నారు సంజయ్‌. పార్టీ కార్యక్రమాలకు హాజరవడం లేదు. ఆయన చేరికను తాము గుర్తించడం లేదన్నట్లు జిల్లా నేతలు సైతం పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం పంపడం లేదట. దీంతో సంజయ్‌.. తన ఇంటినే పార్టీ లోకల్‌ ఆఫీస్‌గా చేసుకుని.. చేరికలను ప్రోత్సహిస్తున్నారట. అయితే.. తమ అనుమతి లేకుండా జరిగే ఆ చేరికలు కూడా చెల్లవంటూ క్లారిటీ ఇచ్చేశారు నిజామాబాద్‌ అర్బన్‌ కాంగ్రెస్‌ నేతలు. ఎవరు ఏం అనుకున్నా.. నా దారి నాదేనంటూ తెర వెనుక మంత్రాంగం నడుపుతున్నారట సంజయ్‌. అర్బన్‌ కాంగ్రెస్‌ లో యాక్టివ్‌ రోల్‌ పోషించేందుకు సమయం కోసం వేచి చూస్తున్నారట.నిజామాబాద్‌ అర్బన్‌ సీటు పై కన్నేసిన సంజయ్‌.. ఆ వ్యూహంలో భాగంగానే హస్తం గూటికి చేరి చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతున్నారన్నది లోకల్‌ టాక్‌. ఈ పాటికే అర్బన్‌ సీటు పై కన్నేసిన .. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అర్బన్‌ నా అడ్డా అంటున్నారట. ఈ సీటును వదులుకునే ప్రసక్తేలేదని తన అనుచరుల దగ్గర చెబుతున్నారట. గత ఎన్నికల్లో అర్బన్‌ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో ఉన్న సీనియర్‌ నేత తాహేర్‌ బిన్‌ హందాన్‌, అర్బన్‌ పార్టీ అధ్యక్షుడు కేశ వేణు సైతం ఒక్క ఛాన్స్‌ అంటున్నారట. అందుకే అంతా కలిసి సంజయ్‌కి పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం పంపకుండా , జిల్లా పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టకుండా జాగ్రత్త పడుతున్నారట. మాజీ మేయర్‌ సైతం దూకుడుగా వ్యవహరించకుండా అవకాశం కోసం ఎదురుచూస్తూ.. అండర్‌ గ్రౌండ్‌ లో తన పని తాను చేసుకుంటూ పోతున్నారట. అయితే ఆ మౌనం వెనక ఉన్న వాస్తవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో ఉంది రాజకీయ ప్రత్యర్థి వర్గం. ఇలా నిజామాబాద్‌ అర్బన్‌ టికెట్‌ కోసం నాలుగు స్తంభాలాట నడుస్తుండగా? రేసులో ఎవరు ముందుంటారో తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే

Leave a comment

Your email address will not be published. Required fields are marked *