దూకుడు పెంచిన టీటీడీపీ

తెలంగాణలో ఎన్నికలకు మరో ఆరు నెలలు మాత్రమే సమయం ఉండటంతో.. టీటీడీపీ దూకుడు పెంచుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీతో పాటు తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. టీటీడీపీ నేతలకు టచ్‌లో ఉండటంతో పాటు పార్టీ కార్యక్రమాలను షురూ చేయాలని నేతలకు సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి టీటీడీపీ శ్రీకారం చుట్టగా.. ఈ కార్యక్రమంలో భాగంగా టీటీడీపీ నేతలు గడపగడపకు వెళుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయాంలో చోటుచేసుకున్న అభివృద్ధి గురించి తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలో పార్టీ బలోపేతం కోసం టీటీడీపీ మరో భారీ ప్లాన్‌ వేసింది. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సభలు నిర్వహించేందుకు సర్వం సిద్దం చేసుకుంది. అందులో భాగంగా ఈ నెల 29వ తేదీ నుంచి మే 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో సభలను టీటీడీపీ నిర్వహించనుంది. తెలంగాణలోని 17 పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల పేరుతో సభలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను టీటీడీపీ తాజాగా ప్రకటించింది.ఈ నెల 29న జహీరాబాద్‌, మే3న మహబూబ్‌నగర్‌, 4న భువనగిరి, 6న హైదరాబాద్‌, 7న ఖమ్మం, 8న మహబూబాబాద్‌, 9న సికింద్రాబాద్‌, 10న మెదక్‌, 11న ఆదిలాబాద్‌, 12న కరీంనగర్‌, 12న నాగర్‌ కర్నూల్‌, 14న పెద్దపల్లి, 15న చేవెళ్ల, 16వ తేదీన వరంగల్‌, 17న నిజామాబాద్‌, 19న మల్కాజ్‌ గిరి, 20వ తేదీన నల్లగొండ పార్లమెంట్‌ పరిధిలో సభలు నిర్వహించనున్నారు. ఈ సభలలో పార్టీ కార్యకర్తలు, అభిమానులందరూ పాల్గొని విజయవంతం చేయాలని టీటీడీపీ పిలుపునిచ్చింది. అయితే ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది టీడీపీ మినీ మహానాడు సభలు నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఈ సారి ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల పేరుతో ప్రత్యేక సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.అలాగే పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో ఎక్కడ నిర్వహించాలనే దానిపై వేదికలను కూడా సిద్దం చేయనున్నారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో బాన్సువాడ నియోజకవర్గంలోని వర్నిలో, మహబూబ్‌ నగర్‌ టౌన్‌, మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌, హైదరాబాద్‌లోని కార్వాన్‌, ఖమ్మం టౌన్‌, ములుగు, ఖైరతాబాద్‌, నరసాపూర్‌, ఉట్నూరు, కరీంనగర్‌, కొల్లాపూర్‌, చెన్నూర్‌ నియోజకవర్గంలోని మందమర్రి టౌన్‌, చేవేళ్లలోని పరిగి టౌన్‌, వరంగల్‌, నిజామాబాద్‌ పరిధిలోని ఆర్మూరు టౌన్‌, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని బాచుపల్లి, నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ టౌన్‌లో సభలు నిర్వహించనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *