శ్రావణమాసంలో… పార్టీల తొలి జాబితా

హైదరాబాద్‌, ఆగస్టు 15
తెలంగాణ రాజకీయాల్లో తొలి జాబితా సందడి కనిపిస్తోంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నుంచి తొలి జాబితా రెడీ అయిందంటూ లీకులు విూడియాకు వస్తున్నాయి. శ్రావణ శుక్రవారం మంచి ముహుర్తం అని ప్రకటించేస్తామని ఊరిస్తున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం అయితే.. డిసెంబర్‌ మొదటి వారంలో పోలింగ్‌ ఉంటుంది. అక్టోబర్‌ లో షెఢ్యూల్‌ ఉంటుంది. అయినా ముందుగానే రాజకీయ పార్టీలు తొలి జాబితా గురించి ప్రకటనలు చేస్తున్నాయి. నిజంగా ప్రకటించడానికి మాత్రం అవకాశం లేదని.. అయితే బీఆర్‌ఎస్‌ ప్రకటిస్తుంది కానీ.. జాతీయ పార్టీలు ప్రకటించే అవకాశం లేదని .. రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. అభ్యర్థుల కసరత్తును ఇప్పటికే పూర్తి చేశారు. మంచి రోజు చూసుకుని విడుదల చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.బీఆర్‌ఎస్‌ చీఫ్‌, సీఎం కేసీఆర్‌ అభ్యర్థులపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు జాబితా కూడా రెడీ చేసుకున్నారు. ఈ నెల 17 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. 18న శ్రావణ మొదటి శుక్రవారం ఉంది. అదే రోజు లేదా ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మొదటి జాబితాను కేసీఆర్‌ ప్రకటించే అవకాశముందని బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు చెప్తున్నారు. ఫస్ట్‌ లిస్టులోనే 105 పేర్లు ప్రకటించే అవకాశముందని కూడా అంచనా వేస్తున్నారు. ఒకవేళ 105 పేర్లు ప్రకటించకుంటే.. కేసీఆర్‌ లక్కీ నంబర్‌అయిన ‘6’ సంఖ్య వచ్చేలా అభ్యర్థుల లిస్ట్‌ ఉండొచ్చని చెప్తున్నారు. పదేళ్లుగా అధికారంలో ఉండటంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందని సర్వేల్లో తేలింది. 40 మంది ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందని.. వారిలో అతి ఎక్కువ వ్యతిరేకత ఉన్న 20 మందిని మార్చి కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు, ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే వేర్వేరు వేదికలపై అక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. తద్వారా ఆ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు అయినట్టు సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్‌, వీరిలో కాంగ్రెస్‌ , టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌లో జాయిన వారికి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఒక్క వనమా వెంకటేశ్వరరావుకు మాత్రం ఇంకా ఖరారు చేయలేదని చెబుతున్నారు.తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. బీఆర్‌ఎస్‌ కంటే ముందుగా అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికలకు అభ్యర్ధులను సమాయత్తం చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే పావులు కదుపుతోంది. కర్ణాటక ఎన్నికల జోష్‌ను తెలంగాణలోనూ కంటిన్యూ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్ధుల తొలి జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తొలి జాబితాపై కసరత్తు పూర్తి చేసిన రాష్ట్ర నేతలు జాతీయ నాయకత్వానికి పంపినట్లు కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ జాబితాకు హైకమాండ్‌ ఆమోదం తెలిపితే త్వరలోనే అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉందని చెబతున్నారు. కొంత మంది పేర్లతో ఓ జాబితా సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతోంది. అన్ని పార్టీల కంటే ముందుగానే ఓ జాబితాను విడుదల చేస్తే అసంతృప్తులను బుజ్జగించేందుకు సమయం ఉండటంతో పాటు విస్తృత ప్రచారానికి సమయం దొరుకుతుందని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది.రాష్ట్రంలో బీజేపీ నుంచి ఉన్న నలుగురు ఎంపీలతోపాటు, సీనియర్‌ నేతలంతా అసెంబ్లీకి పోటీ చేయాలని బీజేపీ అధిష్టానం ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అయితే మొత్తంగా 60 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేయాలనే నిర్ణయంతో బీజేపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం వివిధ జిల్లాల నుంచి డేటా సేకరించే కసరత్తు కూడా ప్రారంభమైందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 27న ఖమ్మం జిల్లాలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటించబోతున్నారు. భద్రాద్రి రాముడి సన్నిధి నుంచి సమరశంఖం పూరించాలని కమలనాథులు భావిస్తున్నారు. ఆ లోపు తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే జాతియ పార్టీల్లో అభ్యర్థుల ప్రకటన అంత తేలిక కాదు. ఆ పార్టీల కేంద్ర ఎన్నికల కమిటీలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తేనే ప్రకటిస్తారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు. కానీ బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దలు మాత్రం అనుకున్నట్లుగానే అభ్యర్థుల్ని ప్రకటించే చాన్స్‌ ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *