మహాగణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ `నేడు ఆయన వర్ధంతి

అపారమైన మేధస్సుతో భారతదేశపు కీర్తిని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన మహాగణిత శాస్త్రవేత్త మన శ్రీనివాస రామానుజన్‌. 1887 డిసెంబర్‌ 22న తమిళనాడులోని ఉత్తర అర్కాట్‌ జిల్లా ఈరోడ్‌లో ఓ నిరుపేద కుటుంబంలో పుట్టాడు. ఆయన తలిదండ్రులు కోమలమ్మాళ్‌, శ్రీనివాస అయ్యంగార్‌. పన్నెండేళ్ల వయసులోనే అసాధారణ బాలునిగా గుర్తింపు పొందిన రామానుజన్‌ ‘ఆయిలర్‌’ సూత్రాలు, త్రికోణమితికి చెందిన అనేక సమస్యలను స్వయంగా సాధించాడు. రామానుజన్‌లోని తెలివితేటలను బయటకు తీసుకువచ్చిన గ్రంథం కార్‌ రాసిన ‘సినాప్సిస్‌’, అందులో ఆల్‌జీబ్రా, అనలిటికల్‌ జామెట్రీ వంటి విషయాల విూద దాదాపు 6165 సిద్ధాంతాలున్నాయి. వీటి నిరూపణలు చాలా కష్టంగా ఉండేవి. పెద్ద పెద్ద ప్రొఫెసర్‌లు సైతం ఎన్నో పుస్తకాలు రిఫర్‌ చేసినా అర్థం చేసుకోలేకపోయిన సూత్రాలకు రామానుజన్‌ ఎటువంటి పుస్తకాలను తిరగేయకుండా వాటి సాధనలను అలవోకగా కనుక్కునేవాడు. అప్పటికే అందులో చాలా సమస్యలు నిరూపించబడ్డాయన్న విషయం తెలియకపోవడంతో వాటిని తన పద్ధతితో సాధించాడు.కుంభకోణం గవర్నమెంటు కాలేజీలో చేరిన రామానుజన్‌ ఎఫ్‌.ఎ. పరీక్ష తప్పాడు. తర్వాత మద్రాస్‌లోని పచ్చయ్యప్ప కాలేజీలో చదువుకు చేరాడు. అక్కడ గణితోపాధ్యాయునిగా ఉన్న ఎన్‌.రామానుజాచారి సమస్యలను కఠినంగా చెప్తుంటే, రామానుజన్‌ వాటిని తనదైన రీతిలో తక్కువ సోపానాలతో సాధించే వాడు. రామానుజన్‌ ప్రతిభను గమనించిన ప్రొఫెసర్‌ సింగారవేలు ముదలియార్‌, రామానుజన్‌తో కలిసి మ్యాథమెటికల్‌ జర్నల్స్‌లో క్లిష్టమైన సమస్యలను చర్చించి సాధిస్తుండేవారు. తర్వాత రామానుజం 1909లో జానకి అమ్మాళ్‌ను పెళ్లి చేసుకున్నాడు. మ్యాజిక్‌ స్క్వేర్స్‌, కంటిన్యూడ్‌ ఫ్రాక్షన్స్‌, ప్రధాన సంఖ్యలు, పార్టిషన్‌ ఆఫ్‌ నంబర్స్‌, ఎలిప్టిక్‌ ఇంటిగ్రల్స్‌ వంటి విషయాలపై పరిశోధనలు కొనసాగించేవాడు. 1913లో మద్రాస్‌ పోర్ట్‌ట్రస్ట్‌కు వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డా?వాకర్‌ రామానుజన్‌ పరిశోధనలు చూసి ఆశ్యర్యపోయి, రామానుజన్‌ కనుగొన్న 120 పరిశోధనా సిద్ధాంతాలను ఆ కాలంలో ప్రసిద్ధుడైన కేంబ్రిడ్జి ప్రొఫెసర్‌ గాడ్‌ ఫ్రెహెరాల్డ్‌ హార్డి (1877`1947)కి పంపాడు. ఉన్నతస్థాయి గణితజ్ఞుడు రాయగల ఆ ఫలితాలను చూసి వెంటనే రామానుజన్‌ను జి.హెచ్‌.హార్డీ కేంబ్రిడ్జి యూనివర్శిటీకి ఆహ్వానించారు. అక్కడ రాత్రనకా, పగలనకా గణితం పైనే ఏకాగ్రత పెట్టి కొత్త సిద్ధాంతాలను కనిపెట్టాడు రామానుజన్‌. ఫిబ్రవరి 28, 1918లో ‘ఫెలో ఆఫ్‌ ద రాయల్‌ సొసైటీ’ గౌరవం పొందిన రెండవ భారతీయుడిగా, 1918 అక్టోబర్‌లో ‘ఫెలో ఆఫ్‌ ద ట్రినిటీ కాలేజి’ గౌరవం పొందిన మొదటి భారతీయుడిగా చరిత్రకెక్కాడు. 1919 మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చాడు. మనదేశ ఔన్నత్యాన్ని జగతికి చాటిన రామానుజన్‌, అనారోగ్య కారణంగా చివరకు ఏప్రిల్‌ 26, 1920న అస్తమించాడు. అప్పటికి ఆయన వయసు 33. చివరిదశలో ‘మ్యాజిక్‌ స్క్వేర్‌’, ‘ప్యూర్‌ మాథ్స్‌కు చెందిన నంబర్‌ థియరీ’, ‘మాక్‌ తీటా ఫంక్షన్స్‌’ చాలా ప్రసిద్ధి పొందాయి. వీటి ఆధారంగా ఆధునికంగా కనుగొన్న స్వింగ్‌ థియరీ, క్యాన్సర్‌ పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని 1986`87 రామానుజన్‌ శతజయంతి ఉత్సవాల్లో గణిత శాస్త్రవేత్తలు ప్రకటించారు. రామానుజన్‌ నోటు పుస్తకాలపై, గణిత సిద్ధాంతాలపై రామానుజన్‌ ఇనిస్టిట్యూట్‌లో, అమెరికాలోని ‘ఇలినాయిస్‌’ యూనివర్సిటీలో నేటికీ రీసెర్చ్‌ జరుగుతోంది. గణితశాస్త్రంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును ‘జాతీయ గణితదినోత్సవం’గా ప్రకటించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *