ఎటూ తేల్చుకోలేకపోతున్న వివేక్‌

’రాజకీయాల్లో హత్యలుండవ్‌.. ఆత్మహత్యలే’ అనే సామెత.. మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్‌ వెంకటస్వామి రాజకీయ జీవితం పరిశీలిస్తే.. మనకు స్పష్టమవుతోంది.. నిలకడ లేని నిర్ణయాలు.. ‘వివేక’వంతుడిగా ఆలోచించకపోవటం.. అతి విశ్వాసంతో రాజకీయంగా దెబ్బ తింటున్నారా.. అంటే అవుననే జవాబు వస్తోంది.. అంగ, అర్దబలం ఉన్నా.. సకాలంలో సరైన నిర్ణయం తీసుకోకపోవటంతో రాజకీయంగా నష్టపోగా.. భవిష్యత్తులోనూ ఆయన రాజకీయ భవితవ్యమెలా ఉంటుందనే చర్చ మొదలైంది.. తాజాగా ఆయన ఆచితూచి అడుగులేస్తారా.. మళ్లీ అలాంటి పొరపాట్లు చేస్తారా.. అనేది వేచి చూడాలి.. పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలోని మూడు నియోజక వర్గాల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు..!వివేక్‌ వెంకటస్వామి.. కాంగ్రెస్‌ వాది, గాంధీ కుటుంబానికి విధేయుడు కాకా (వెంకట స్వామి) తనయుడు.. పెద్ద పారిశ్రామిక వేత్త.. ప్రముఖ విూడియాధిపతి.. అంగ, అర్ధ బలం పుష్కలంగా ఉన్న ప్రముఖ నేత.. ప్రజల్లో మంచి పేరు, పూర్తి పట్టు ఉన్న నాయకుడు.. కాక వారసుడిగా 2009ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. ఉమ్మడి రాష్ట్రంలో ఓసారి లోక్‌ సభ సభ్యుడిగా పని చేశారు. తర్వాత కాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో రాజకీయంగా తీవ్రంగా నష్టపోయారు. పలుమార్లు పార్టీలు మారగా.. వివేక్‌ ఇప్పటికీ తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. రాజకీయంగా ఉన్నత స్థాయి పదవుల్లో ఉండాలనే ఆలోచనతో ఎప్పటికప్పుడు కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు వికటించి అసలుకే ఎసరు తెచ్చి పెట్టాయి.వివేక్‌ 2009లో కాంగ్రెస్‌ నుంచి పెద్దపల్లి ఎంపీగా గెలువగా.. తెలంగాణ ఉద్యమం ఎగిసి పడుతున్న దశలో కాంగ్రెస్‌ వీడి టీఆర్‌ఎస్‌ లో చేరారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించాక.. 2014 ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్‌ లోకి వెళ్లారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే దళితుడిని సీఎం చేస్తామని సోనియాగాంధీ చేసిన ప్రకటనకు ఆకర్షితుడై టీఆర్‌ఎస్‌ ను వీడినట్లు అప్పట్లో ప్రచారంలో ఉంది. పెద్దపల్లి నుంచి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి బాల్క సుమన్‌ చేతిలో ఓడిపోయారు. 2014లో తొలి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్‌ తో సఖ్యతతో మెలిగి 2017లో సింగరేణి ఎన్నికలకు ముందు మరోసారి టీఆర్‌ఎస్‌ లో చేరారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోషించిన పాత్ర వివాదాస్పదంగా మారింది. ఒకవేళ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే… అనే ఆలోచనతో టీఆర్‌ఎస్‌ లోనే ఉంటూ.. పలువురు కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేశారనే ఆరోపణలున్నాయి. ధర్మపురి, పెద్దపల్లి, చెన్నూరు, మంథని, రామగుండం, మంచిర్యాల నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ అభ్యర్థుల ఓటమికి పని చేశారని ఆరోపణలుండగా.. మంథని, రామగుండం సీట్లు టీఆర్‌ఎస్‌ కోల్పోవడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూర్చింది.ఆ తర్వాత పరిణామ క్రమంలో ఆయన బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో ఆయనకు పెద్దపల్లి ఎంపీ టిక్కెట్టు ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చింది. పార్టీ ఎస్‌.కుమార్‌ పేరును పెద్దపల్లి అభ్యర్థిగా ప్రకటించినా.. వివేక్‌ కోసం రెండ్రోజులు బీఫారం ఇవ్వకుండా ఆపింది. పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకులు ఎంత నచ్చచెప్పినా.. పోటీ చేసేందుకు వివేక్‌ ఒప్పుకోలేదు. ఆ ఎన్నికల్లో బీజేపీ నాలుగు లోక్‌ సభ స్థానాల్లో గెలిచింది. అన్నింటి కంటే ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పెద్దపల్లి చుట్టున్న కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ ఎంపీ స్థానాలు గెలవడం. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఉంటే టీఆర్‌ఎస్‌ మోసం చేసిందనే సానుభూతితోపాటు మోదీ హవా.. కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ లా ప్రభావం కూడా పెద్దపల్లిపై పడేవని.. వివేక్‌ గెలిచి ఉండేవారని పలువురు చెబుతున్నారు.తాజాగా ఆయన ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తోంది. ఇప్పటికే తాను తీసుకున్న నిలకడ లేని నిర్ణయాలతో రాజకీయంగా తీవ్రంగా దెబ్బతిన్నారు. తాజాగా అసెంబ్లీ బరిలో దిగాలని భావిస్తుండగా.. పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలోని మూడు అసెంబ్లీ స్థానాలపై ఆయన గురి పెట్టారు. ఈ పార్లమెంట్‌ పరిధిలో ఎస్సీ రిజర్వు స్థానాలైన చెన్నూరు, బెల్లంపల్లి, ధర్మపురి సెగ్మెంట్లలో ఒక చోటు నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే తన అనుచరులతో సమాచారం తెప్పించుకోగా.. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంపై తర్జన భర్జన పడుతున్నారు. తన బలాలు, బలహీనతలు, పార్టీ బలం, స్థానిక పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఈ మధ్య కాలంలో ధర్మపురి సెగ్మెంటులో తరచూ పర్యటిస్తున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రాతనిధ్యం వహిస్తుండగా.. ఆయనపై పోటీకి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక చెన్నూరులో తన చిరకాల ప్రత్యర్థి బాల్క సుమన్‌ పై పోటీ చేస్తారనే చర్చ కూడా ఉండగా..అక్కడ నుంచి బరిలో ఉండే అవకాశాల తక్కువని ఆయన అనుచరులే చెబుతున్నారు. ఇక మిగిలింది బెల్లంపల్లి… ఇక్కడ దుర్గం చిన్నయ్యపై అయితే ఈజీగా గెలవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్‌ పార్టీ నుంచి వివేక్‌ సొంత అన్న వినోద్‌ పోటీ చేసేందుకు సిద్ధం చేసుకున్నారు. ఆయనను పోటీలో నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాను కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తానని వినోద్‌ ఖరాఖండిగా చెప్పడంతో ఏం చేయాలనే విషయంలో ఆలోచిస్తున్నారు. అన్నను తప్పించి తాను బెల్లంపల్లి బరిలో ఉంటే ఖచ్చితంగా గెలుపు ఖాయమని వివేక్‌ భావిస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత వెరసి తన విజయం నల్లేరు విూద నడక అని వినోద్‌ పావులు కదుపుతున్నారు. ఇలా అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు రూ. వేల కోట్ల అధిపతి, పెద్ద ఎత్తున అనుచరగణం ఉన్నప్పటికీ రాజకీయంగా సరైన నిర్ణయాలు తీసుకోక బొక్కాబోర్లా పడుతున్నారు. ఇప్పటికైనా ఆయన సరైన నిర్ణయం తీసుకుని గెలిస్తే రాజకీయ భవిష్యత్‌ ఉంటుందని, లేకపోతే మరోసారి పోటీ చేసే అవకాశం రాకపోవచ్చని పలువురు చెబుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *