పిల్లనగ్రోవి స్థానంలో కత్తి…

ఖమ్మం, జూలై 3
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శతజయంతి సంవత్సరం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో లకారం ట్యాంక్‌బండ్‌ వద్ద శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న అన్నగారి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని వాస్తవంగా మే 28.. అయన జయంతి సందర్బంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ చేత ఆవిష్కరింప చేయాలని నిర్వాహకులు భావించారు. బేస్‌మెంట్‌తో కలిసి 54 అడుగులు ఎత్తు ఉన్న ఈ విగ్రహం తల భాగం అయిదు అడుగులు, కాళ్ల భాగం అయిదు అడుగులు, ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు 45 అడుగులు గా రూపొందించారు. తానా అసోసియేషన్‌తోపాటు పలువురు ప్రముఖుల సహకారంతో దాదాపు 4 కోట్ల రూపాయిల వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ విగ్రహాన్ని హైదరాబాద్‌ హుస్సేన్‌ సాగర్‌లో బుద్దుడి విగ్రహాం వలే.. ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లూ చేశారు. మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌ విగ్రహావిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లను అప్పట్లో స్వయంగా పర్యవేక్షించారు. పెద్ద ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడం కోసం.. జూనియర్‌ ఎన్టీఆర్‌ వస్తుండడం పట్ల అప్పట్లో ఆయన ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఎన్టీఆర్‌ విగ్రహం శ్రీకృష్ణుడి రూపంలో ఉండడంపై పలు యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకెక్కాయి.దీంతో తెలంగాణ హైకోర్టు తొలుత విగ్రహం ఏర్పాటుపై స్టే ఇచ్చి, ఆ తరువాత శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటుకు నో చెప్పింది. దీంతో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహంలో పలు మార్పులు చేయడానికి నిర్వాహకులు ఉపక్రమించారు. ఎన్టీఆర్‌ విగ్రహం చేతిలో ఉన్న పిల్లన గ్రోవిని తొలగించారు. పింఛం కూడా తీసేశారు. పిల్లనగ్రోవి స్థానంలో ఖడ్గాన్ని చేర్చారు. అలాగే కిరీటం, నెమలి పింఛం, విష్ణు చక్రం తొలగించినట్లు తెలుస్తోంది. లకారం చెరువుపై విగ్రహావిష్కరణకు హైకోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రైవేట్‌ స్థలంలో విగ్రహం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విగ్రహావిష్కరణ ఆగస్టులో జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *