కౌన్సెలింగ్‌ తర్వాతే క్లాసులు…

హైదరాబాద్‌, ఆగస్టు 17
ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల బలవన్మరణాలను కట్టడిచేసేందుకు కేంద్ర విద్యాశాఖ చర్యలకు పూనుకుంది. ఇంజనీరింగ్‌, మెడికల్‌.. ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల మానసిక ఒత్తిడిపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. అందులో భాగంగా కాలేజీలకు కొత్తగా వెళ్లే విద్యార్ధులకు అక్కడి విద్యా విధానం, వాతావరణం, ఎదురయ్యే సమస్యలు, వాటిని అధిగమించే విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు దేశంలోని అన్ని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ యూనివర్సిటీలు, ఐఐఎస్‌ఈఆర్‌, ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (ఎయిమ్స్‌)లను ఆదేశించింది.ఆయా సంస్థల్లో 2018 నుంచి 2022 వరకు జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు, అందుకు దారి తీసిన కారణాలపై కేంద్రం అధ్యయనం చేసిన సంగతి తెలిసిందే. గత ఐదేళ్లలో ఐఐటీల్లో 32 మంది విద్యార్ధులు, ఎన్‌ఐటీల్లో 21 మంది విద్యార్ధులు, సెంట్రల్‌ వర్సిటీల్లో 20 మంది విద్యార్ధులు, ఎయిమ్స్‌ సంస్థల్లో 11 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జాతీయ స్థాయిలో పోటీని తట్టుకుని సీట్లు తెచ్చుకున్న విద్యార్థులు.. తీరా సీట్లు పొందిన తర్వాత అక్కడ చదువుల్లో మానసిక ఒత్తిడి ఇతర కారణాల రిత్యా డిప్రెషన్‌లోకి వెళ్లి దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు.ప్రతీ రాష్ట్రంలోనూ ఇంటర్మీడియెట్‌ వరకు బట్టీ విధానంలోనే విద్యాబోధన సాగుతోందని నిపుణులు అంటున్నారు. జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌, నీట్‌ కోసం కోచింగ్‌ కేంద్రాలు కూడా తమదైన విధానంలో బట్టీ పద్ధతిలోనే బోధన చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఇంజనీరింగ్‌లో చేరిన తర్వాత ఇదే పద్ధతి అక్కడ ఉండకపోవడం సమస్యకు మూలకారణంగా చెబుతున్నారు. గణితం, ఫిజిక్స్‌ ప్రామాణికంగా ఉండే సబ్జెక్టుల్లోనే విద్యార్థులు వెనుకబడుతున్నారు. ఇక బట్టీ విధానంలో వచ్చిన విద్యార్థులు ఈ సబ్జెక్టుల్లో గందరగోళానికి గురవుతున్నారు.తాజాగా ‘జోసా’ కౌన్సెలింగ్‌ పూర్తవగా మరికొద్ది రోజుల్లో ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో క్లాసులు మొదలవనున్నాయి. క్లాసులు ప్రారంభానికి ముందే ప్రతీ బ్రాంచీలోని విద్యార్థుల్లో ఉత్తేజాన్ని, మనోధైర్యాన్ని కల్పించేలా కౌన్సెలింగ్‌ నిర్వహించాలి. ప్రతీ విద్యార్థి వ్యక్తిగత, కుటుంబ వివరాలు సేకరించి కొన్ని రోజులు విద్యార్థులను గమనించాలి. వాళ్లు ధైర్యం కోల్పోతున్నట్టు గుర్తించిన వెంటనే ప్రత్యేక పద్ధతిలో కౌన్సెలింగ్‌ చేయాలి. ఈ మేరకు అన్ని కాలేజీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *