సత్వర న్యాయం సాధ్యం కాదా…

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 పౌరుని హక్కుగా సత్వర న్యాయం అందజేయాలని చెప్తుంది. సీనియర్‌ న్యాయవాది వేరే కోర్టులో బిజీగా ఉన్నాడని జూనియర్‌ న్యాయవాది చెప్పటం, వెంటనే న్యాయమూర్తి కేసు వాయిదా వేయటం, ఎంతకాలమైనా జూనియర్‌ న్యాయవాది కేసు కొనసాగించకపోవటం లాంటి పస లేని, జవాబుదారీతనం లేని కారణాలు ఎన్నో. ఏళ్ల కొద్దీ విచారణ పేరుతో కేసును సాగదీయటం రాజ్యాంగం కల్పించిన నిందితుడి హక్కుకు తూట్లు పొడవటమే కాకుండా అతడిని మానసిక క్షోభ, ఆందోళనకు గురి చేయటం కూడా శిక్ష విధించటం లాంటిదైనని అరుణ్‌ కుమార్‌ ఘోష్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బెంగాల్‌, కర్తార్‌ సింగ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ అనే కేసుల్లో సుప్రీంకోర్టు నిర్వచించింది. తీర్పు ఆలస్యానికి జరిగే కారణాలను, మార్గదర్శకాలను సుప్రీం కోర్టు గతంలోనే అబ్దుల్‌ రహమాన్‌ వర్సెస్‌ ఎస్‌ ఆర్‌ నాయక్‌ కేసులో సూచించింది.1998 ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్‌ పరిపాలనా ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలను అమలు పరచటం కోసం తన నుండి ఐదువేల రూపాయలు లంచం డిమాండ్‌ చేసినట్లుగా ఒక ప్రధానోపాధ్యుడు ఫిర్యాదు చేసారు. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు వల పన్ని ఒక ఎంపీడివో డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌ హాండెడ్‌గా పట్టుకుని, అతడిపై అభియోగం మోపుతూ విజయవాడలోని అనిశా ప్రత్యేక కోర్టు ముందు ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ఏడు సంవత్సరాల పాటు సాక్షుల సుదీర్ఘ విచారణ, వాదనల అనంతరం అభియోగం రుజువు కాలేదని 2005లో అనిశా కోర్టు కేసు కొట్టివేస్తూ, ఎంపీడివోను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పిచ్చింది. ఆ తీర్పుతో తృప్తి చెందని అనిశా 2007లో ఉమ్మడి హైకోర్టుకు అప్పీలు చేసింది. అప్పటికే ఎంపీడివో వయస్సు 64 సంవత్సరాలు. తదనంతర రాష్ట్ర విభజన మూలంగా అప్పీలు అమరావతి హైకోర్టుకు బదిలీ అయింది. వాదనలు విన్న హైకోర్టు 2005లో అనిశా కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ, విశ్రాంత అధికారికి ఏడాది జైలు శిక్ష, పదివేల రూపాయల జరిమానా విధిస్తూ 2023 ఫిబ్రవరిలో తీర్పిచ్చింది. 1998 లో మోపిన నేరానికి 25 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తన 80వ ఏట ఒక ఏడాది పాటు జైలు జీవితం గడపాల్సిన దుస్థితికి కారణం నిందితుడి స్వయంకృతాపరాధమనుకుందామా!తోటి ప్రభుత్వ ఉద్యోగి నుండే లంచం డిమాండ్‌ చేయటం క్షమించరాని నేరమే. ఈ విషయంలో దాక్షిణ్యత ఏ మాత్రం ఉండకూడదు. ఇక్కడ అసలు సమస్య అది కాదు. అనిశా కోర్టు తీర్పుకు ఏడు సంవత్సరాలు, హైకోర్టు తీర్పుకు 16 సంవత్సరాలు పట్టిన సమయం గురించి ఆలోచించాలి. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసుకునే అవకాశం నిందితుడికి ఉంటే ఉండవచ్చు. సుప్రీం ధర్మాసనం నుండి బెయిలు లభించే దాకా ఈ వృద్దాప్యంలో, అనారోగ్యంతో బాధ పడుతూ కొన్నాళ్ళ పాటు నిందితుడు జైలు జీవితం గడపాల్సిందే. అక్కడ ఎంత కాలం నిరీక్షణ ఉంటుందో తెలియదు. దాదాపు 25 సంవత్సరాల పాటు కేసులో తీర్పుకై నిరీక్షిస్తూ అతడు, అతని కుటుంబ సభ్యులు నిస్సందేహంగా ఎంతో మానసిక సంఘర్షణను, క్షోభను అనుభవించటమే కాకుండా సంఘంలో చులకనకు గురై ఉంటారు!. వ్యక్తిగత జీవితంతో ముడిపడిన క్రిమినల్‌ కేసులు ఏళ్ల కొద్దీ కోర్టులో పెండిరగ్‌ ఉండటం మూలాన మానసికంగా మాత్రమే కాకుండా, వేతనం, పెన్షన్‌ కూడా పొందకుండా నిందితుడు ఆర్ధికంగా నష్టపోతాడనటంలో ఎటువంటి సందేహం లేదు. నేరారోపణకు గురైన వ్యక్తిని జీవితంలో సగభాగం మానసిక సంఘర్షణకు గురి చేయటం భావ్యం కాదు. తుది తీర్పు తగిన సమయంలో వచ్చి ఉంటే నిందితుడు భవిష్యత్‌ జీవితాన్ని తగిన విధంగా మలచుకొని, ఆర్ధికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. విచారణలో జాప్యానికి కారణం నిందితుడా లేక న్యాయవ్యవస్థా లేక ప్రభుత్వమా? స్వయంగా నిందితుడు కారణమైతే అతడు అనుభవించాల్సిందే. అలా కాకుండా రాజ్యం కారణమైతే నిందితుడికి పరిహారం ముట్టజెప్పే విధంగా సంస్కరణలు తేవాలి. ముఖ్యంగా న్యాయవ్యవస్థతో ముడిపడిన ప్రతి ఒక్కరు జవాబుదారితనంతో వ్యవహరించినప్పుడే జాప్యాన్ని కొంతవరకు నివారించవచ్చు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *