విజయం ఒక్కసారిగా రాదు..

ప్రేక్షకులు మనకు స్టార్‌డమ్‌ ఇస్తే.. దాని ద్వారా వచ్చే ఒత్తిడిని కూడా స్వీకరించాల్సిందేనని సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు (Mahesh babu) అన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మహేష్‌ – నమ్రత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్‌ తన తండ్రి దివంగత కృష్ణను (Superstar krishna) గుర్తుచేసుకున్నారు. ‘‘నేను నటించిన సినిమాలు విజయం సాధించనప్పుడు నిరుత్సాహ పడతాను. ఓ సినిమా వెనుక ఎంతోమంది కష్టం, అంచనాలు ఉంటాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కకపోతే బాధ కలగడం సహజం. అయితే దాని పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను. అలాగని అదే ఆలోచిస్తూ కూర్చోను. తర్వాతి సినిమాపై మరింత దృష్టి సారిస్తాను. ఎంతోమంది అభిమానులు చూపించిన ప్రేమతో ఈ స్టార్‌డమ్‌ వచ్చింది. ఏ హీరో అయినా స్టార్‌డమ్‌తో వచ్చిన ఒత్తిడిని కూడా అంగీకరించాలి. ఈ విషయం మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నా. క్రమశిక్షణ, వినయం.. వంటి వాటి ప్రాముఖ్యతను ఆయనే నేర్పించారు. విజయం ఒక్కసారిగా రాదని ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటేనే వరిస్తుందని నాన్న చెబుతుండేవారు’’ అని మహేశ కృష్ణ గురించి చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం మహేష్‌ త్రివిక్రమ్‌ (Trivikram) దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ సినిమా నటిస్తున్నారు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో రానున్న మూడో చిత్రమిది. తప్పకుండా హ్యాట్రిక్‌ అవుతుందని చిత్ర బృందం ధీమాగా ఉంది. మహేశ జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేశ రాజమౌళితో ఓ సినిమా చేయనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *