పునరాలోచనలో ఈటెల, కోమటి

హైదరాబాద్‌, జూన్‌ 27, : బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హైకమాండ్‌ పిలుపుతో దిల్లీ వెళ్లిన ఈటల, కోమటిరెడ్డికి స్పష్టమైన హావిూ రాలేదని తెలుస్తోంది. దీంతో వారిద్దరూ రాజకీయ భవిష్యత్తుపై పునరాలోచనలో పడ్డారని సమాచారం. : తెలంగాణలో అధికారం కోసం పావులు కదుపుతున్న బీజేపీ అధిష్ఠానానికి అంతర్గత కుమ్ములాటలు తలనొప్పిగా మారాయి. దీంతో తెలంగాణ బీజేపీలో కీలక నేతలనైన ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని అధిష్ఠానం దిల్లీకి పిలిచింది. వీరితో పాటు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కూడా దిల్లీ వెళ్లారు. తెలంగాణపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన బీజేపీ…ఎలాగైనా అధికారం చేజిక్కుంచుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే ఈ తరుణంలో పార్టీ నేతల మధ్య కలహాలు మొదలవ్వడంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు నేతలను దిల్లీకి పిలిచింది. ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి…కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో భేటీ అయ్యారు. సుమారు మూడున్నర గంటలపాటు వీరి మధ్య సుదీర్ఘ సమావేశం జరిగింది. రాష్ట్రంలో పరిస్థితులను కేంద్రానికి వివరించిన నేతలు… ప్రస్తుత వ్యూహాలతో బీఆర్‌ఎస్‌ ను ఎదుర్కోవడం కష్టమని తేల్చినట్లు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ బీజేపీ మెత్తబడినట్లు ప్రజలు భావిస్తున్నారని, దీంతో స్పీడ్‌ పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీ అధిష్ఠానానికి తాము చెప్పాల్సిందంతా చెప్పామని ఈటల, కోమటిరెడ్డి విూడియాతో అన్నారు.తెలంగాణలో బీఆర్‌ఎస్‌ రోజురోజుకూ కొత్త వ్యూహాలతో బలపడుతోంది. మరోపక్క కాంగ్రెస్‌ కూడా చేరికలతో స్పీడ్‌ పెంచింది. కానీ బీజేపీ మాత్రం వెనకబడిరదని విశ్లేషకులు అంటున్నారు. బీఆర్‌ఎస్‌ ఓటమే లక్ష్యంగా బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి కొంత కాలం పార్టీ వ్యవహారాల్లో కీలకంగా ఉన్నారు. ఇటీవల కాలంలో వీరి జోరు తగ్గింది. పార్టీలో ఈటల , బండి వర్గాలుగా నేతలు విడిపోయారని ప్రచారం జరుగుతోంది. పటిష్ఠంగా ఉన్న బీఆర్‌ఎస్‌ ను ఎదుర్కోవాలంటే బీజేపీ అధిష్ఠానం మరింత దూకుడుగా వ్యవహరించాలని ఈటల వర్గం భావిస్తుంది. ఈ తరుణంలో ఈటల, కోమటిరెడ్డి దిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం… బీజేపీ అపర చాణక్యుడు అమిత్‌ షా నుంచి ఈటల, కోమటిరెడ్డికి స్పష్టమైన హావిూ రాలేదని తెలుస్తోంది. దీంతో ఈటల, కోమటిరెడ్డి తమ రాజకీయ భవిష్యత్తుపై పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. పార్టీలో ప్రస్తుత పరిస్థితులపై వీరిద్దరూ అసంతృప్తితో ఉన్నారని సమాచారం. దీంతో ఈ ఇద్దరు నేతలు పార్టీని వీడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటిస్తున్నప్పటికీ బీజేపీ నేతలు ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఇంకా దిల్లీలోనే ఉండిపోయారు. పార్టీలో మరికొందరు అగ్రనేతలను ఈ ఇద్దరు నేతలు కలిసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే జేపీ నడ్డా పర్యటనపై తెలంగాణ బీజేపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. బీఆర్‌ఎస్‌తో పోరుపై ఓ స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్‌ఎస్‌ పట్ల బీజేపీ వైఖరి మారిందని విశ్లేషకులు అంటున్నారు. బీఆర్‌ఎస్‌ పట్ల బీజేపీ అగ్రనాయకత్వం మెతక వైఖరి అవలంభిస్తోందని బీజేపీ నేతలు కొందరు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌తో కఠినంగా వ్యవహరించకుంటే తెలంగాణలో బీజేపీ తీవ్రంగా నష్టపోతుందని ఈటల, కోమటిరెడ్డి అధిష్ఠానానికి చెప్పినట్లు తెలుస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *