ఎమ్మెల్యేగా బరిలోకి ఎంపీ…

ఎన్నికల ఏడాది కావటంతో తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇక అధికార పార్టీ(బీఆర్‌ఎస్‌)లో స్వరాలు మారుతున్నాయి. మరోవైపు టికెట్ల అంశం కూడా తెరపైకి వస్తోంది. ఇప్పటికే పొంగులేటి, జూపల్లి వంటి నేతలు ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లోనూ అసమ్మతి మంటలు రాజుకుంటున్నాయి. ఇదిలా ఉన్నప్పటికీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొవటం, వ్యూహ రచన విషయంలో బీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ క్లారిటీతోనే ఉందన్న చర్చ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే ఎన్నికల మూడ్‌ లోకి వెళ్లిన బీఆర్‌ఎస్‌…. రేసు గుర్రాలపై ఫోకస్‌ పెంచుతోంది. చాలా స్థానాల్లో సిట్టింగ్‌ లకే మరోసారి ఛాన్స్‌ ఉండగా… మరికొన్ని స్థానాల్లో మాత్రం కొత్త అభ్యర్థులను నిలిపాలని చూస్తోంది. ఈ క్రమంలో ఎంపీ మాలోతు కవితకు కొత్త బాధ్యతలు కట్టబెట్టింది పార్టీ అధినాయకత్వం. ఈ పరిణామం కాస్త ఆసక్తికరంగా మారింది.రాష్ట్రవ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తోంది బీఆర్‌ఎస్‌. ఇందుకోసం ప్రత్యేకంగా ఇంఛార్జ్‌ లను కూడా నియమించింది. ఈ క్రమంలోనే మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవితకు భద్రాచలం నియోజకవర్గం బాధ్యతలను అప్పగించారు. నిజానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ పరిస్థితి పటిష్టంగా లేదు. గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక సీటుకే పరిమితం అయింది. ఆ తర్వాత పలువురు ఎమ్మెల్యేలు కారు ఎక్కినప్పటికీ… ప్రస్తుతం కూడా అంతర్గతంగా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మధ్యనే మాజీ ఎంపీ పొంగులేటిపై వేటు వేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ లో ఉన్న పలువురు ముఖ్య నేతలు ఆయనతో నడిచే పనిలో ఉన్నారు. ఆ విషయానికి వస్తే గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా భద్రాచలం నుంచి పోటీ చేసిన డాక్టర్‌ డా. తెలం వెంకట్రావు కూడా ఈ జాబితాలో ఉన్నారు. పొంగులేటితోనే తన ప్రయాణమని కూడా చెప్పారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో భద్రాచలం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారనేది ప్రశ్నగా మారింది.తాజా పరిస్థితుల నేపథ్యంలో… ఎంపీ కవితకు భద్రాచలం నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది అధినాయకత్వం. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకే టికెట్‌ కేటాయించే అవకాశం ఉందన్న టాక్‌ కూడా ఓవైపు నుంచి వినిపిస్తోంది. కవిత ప్రస్తుతం మహబూబాబాద్‌ ఎంపీగా ఉన్నారు. భద్రాచలం నియోజకవర్గం కూడా ఈ పార్లమెంట్‌ సీటు పరిధిలోకి వస్తోంది. నిజానికి ఎంపీ కవిత అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండాలని భావిస్తున్నారు. కుదిరితే డోర్నకల్‌ లేదా మహబూబాబాద్‌ నుంచి రేసులో ఉండాలని చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పరిస్థితుల దృష్ట్యా… బలమైన అభ్యర్థులను నిలపాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఆ కోణంలోనే ఎంపీ కవితను భద్రాచలం ఇంఛార్జ్‌ గా నియమించిందా..? లేక పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతల వరకు పరిమితం చేసి కొత్త అభ్యర్థిని నిలబెడుతుందా..?అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక కామ్రేడ్లతో పొత్తు కుదిరితే భద్రాచలం సీటును కూడా కమ్యూనిస్టులు అడిగే అవకాశం ఉంది.మొత్తంగా అసెంబ్లీ ఎన్నికలు సవిూపిస్తున్న నేపథ్యంలో….ప్రధాన పార్టీలు అస్త్రాలను సిద్ధం చేసేస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలకు చెందిన నేతలు కూడా టికెట్లపై లెక్కలు వేసుకుంటున్నారు. కుదరకపోతే పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఫలితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయం మరింత హాట్‌ హాట్‌ గా మారే అవకాశం ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *