తెరపైకి రాయల తెలంగాణ డిమాండ్‌

టీడీపీ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను తెలంగాణలో కలపాలని జేసీ డిమాండ్‌ చేశారు. రాయలసీమను తెలంగాణలో కలుపుకోవాల్సిన అవసరం సీఎం కేసీఆర్‌ కు ఉందన్నారు. రాయల తెలంగాణ అవ్వడానికి ఎవరికి అభ్యంతరం లేదన్నారు. ఈ విషయంపై నాయకులతో చర్చిస్తున్నామన్నారు. ఎన్నికల తర్వాత ఈ విషయంపై నేతలందరినీ కలుస్తానన్నారు. రాయలసీమను తెలంగాణలో కలిపినప్పుడే రాయలసీమ సాగునీటి సమస్య తీరుతుందన్నారు. రాష్ట్రాలను విడగొట్టడం కష్టమన్న జేసీ… కలపడం సులభమని వ్యాఖ్యానించారు. తమ వాళ్లు ప్రత్యేక రాయలసీమ అంటున్నారని, అది సాకారం అయితే మంచిదేననే జేసీ దివాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ‘‘రాయలసీమను తెలంగాణలో కలపాలి. అప్పుడే రాయలసీమ సాగునీటి సమస్య తీరుతుంది. రాష్ట్రాన్ని విడగొట్టడం కష్టంగాని కలపడం సులభం. రాయలసీమను తెలంగాణలో కలిపితే ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు.’’` జేసీ దివాకర్‌ రెడ్డి
రాష్ట్ర విభజన టైంలో రాయలసీమను తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్లు వినిపించాయి. రాష్ట్ర విభజన జరిగి కూడా దాదాపు తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా రాయలసీమను తెలంగాణలో కలపాలని మళ్లీ డిమాండ్‌ తెరపైకి తేవడంపై రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. ఏపీ విభజన సమయంలో కొంత మంది సీమ నేతలు రాయల తెలంగాణ ప్రతిపాదనలు తెచ్చారు. అయితే రాయల తెలంగాణ సాధ్యం కాలేదు. మళ్లీ ఇన్నేళ్లు తర్వాత జేసీ దివాకర్‌రెడ్డి రాయల తెలంగాణ అంశం తెరపైకి తేవడం సంచలనంగా మారిపోయింది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యక్షమైన జేసీ దివాకర్‌రెడ్డి.. తెలంగాణ వదిలిపెట్టి తాము నష్టపోయమాన్నారు. తాను ఏపీ వదిలేసి తెలంగాణకు వచ్చేస్తానని చెప్పుకొచ్చారు. అప్పట్లో తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను కలిసిన జేసీ.. కేసీఆర్‌ సీఎం అయ్యాక కలవలేదని, అందుకే కలుద్దామని వచ్చినట్లు చెప్పారు. ఏపీ కన్నా తెలంగాణలో పాలన బాగుందని మెచ్చుకున్నారు. రాజకీయ అంశాలు పక్కనబెడితే తాను రాయల తెలంగాణ కోరుకున్నానన్నారు. రాష్ట్రం విడిపోయాక రాయలసీమ నష్టపోయిందన్నారు. 2021లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి కలిశారు. అప్పట్లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అక్కడకు వచ్చిన కేసీఆర్‌తో శాసనసభ ఆవరణలో జేసీ దివాకర్‌ రెడ్డి కలిసి పలు అంశాలపై మాట్లాడారు. అంతకు ముందు సీఎల్పీ కార్యాలయంలో భట్టి విక్రమార్క, జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డి తదితరులతో జేసీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేసీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్‌ నేత జానారెడ్డి గెలవడం కష్టమని ముందే చెప్పానన్నారు. ఆయన ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసన్న ఆయన… తనకు జానారెడ్డి మంచి మిత్రుడని తెలిపారు. రాజకీయాలు బాగోలేవని, సమాజం కూడా బాగోలేదన్నారు. ఏపీ వదిలేసి తెలంగాణకు వస్తానన్నారు. తెలంగాణ వదిలిపెట్టి నష్టపోయామన్నారు. రాయల తెలంగాణ కావాలని నాడు జైపాల్‌రెడ్డిని అడిగితే ఒప్పుకోలేదని జేసీ వ్యాఖ్యానించారు. తాను రాజకీయంగా ఎదిగింది కాంగ్రెస్‌లోనే అన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక కలవలేదని తెలిపారు. అందుకే ఇప్పుడు కలిశానని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజనతో తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందన్న ఆయన… రాయలసీమ కూడా తెలంగాణతో కలిసి ఉంటే బాగుండేదని కేసీఆర్‌తో చెప్పానని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *