వేటు వెనుక… మర్మం అదేనా

వరంగల్‌, అక్టోబరు 13
కేంద్ర ఎన్నిక సంఘం తెలంగాణలో జరిపిన బదిలీల్లో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ బదిలీ అయ్యారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో క్రైం డీసీపీగా పనిచేస్తున్న ఐపీఎస్‌ అధికారి దాసరి మురళీధర్‌ను ఇన్‌చార్జ్‌ సీపీగా నియమించారు. గురువారం సీపీ రంగనాథ్‌ నుంచి దాసరి మురళీధర్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే రంగనాథ్‌ బదిలీ వెనక బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్‌ని రంగనాథ్‌ అరెస్టు చేశారు. దీనిని మనసులో పెట్టుకున్న బండి సీపీ బదిలీ కోసం కేంద్రంతో పట్టుబట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవల ఎలక్షన్‌ కమిషన్‌ రాష్ట్రంలో పర్యటించిన సమయంలో సీపీ రంగనాథ్‌పై బండి సంజయ్‌ ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.వరంగల్‌ కమిషనరేట్‌లో పనిచేస్తున్న కొంత మంది అధికారులపై కూడా బదిలీ వేటు పడే అవకాశం ఉందని పోలీస్‌ శాఖలో ప్రచారం జరుగుతోంది. ఎలక్షన్‌ కమిషన్‌ రాష్ట్రంలో పర్యటించిన సమయంలో కొంత మంది అధికారులపై కొందరు ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వారిపై వేటు పడే అవకాశం ఉందనే సమాచారం. 21 మంది అధికారులపై వచ్చిన అభియోగాలపై సీపీ రంగనాథ్‌ గతంలో ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చారువరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా 2022 డిసెంబర్‌ 3న ఏవీ రంగనాథ్‌ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆయన నేరుగా ప్రజలు, బాధితులతో మాట్లాడేవారు. వారి నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారం చూపేవారు. ఇందు కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు క్షేత్రస్థాయిలో ఉన్న అనేక సమస్యలను స్వయంగా పరిశీలన చేసి సంబంధిత అధికారులకు పరిష్కార మార్గాలను చూపించారు. సామాన్యుల భూములను ఆక్రమించి వ్యాపారం చేసే భూకబ్జాదారులకు దడ పుట్టించారు.బాధితులు, ప్రజలు నుంచి సీపీ స్వయంగా 2,500కు పైగా ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతోపాటు ఏసీపీ, డీసీపీ, టాస్క్‌ఫోర్స్‌, ఎస్‌బీ విభాగాల ద్వారా విచారణ చేయించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు. మోసాలకు పాల్పడిన చిట్‌ఫండ్‌ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. చిట్‌ డబ్బులు ఎగ్గొట్టి ఇబ్బందులకు గురిచేసిన చిట్‌ఫండ్‌ యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. ప్రతి నెల చిట్టి డబ్బులను చెల్లించేలా డీసీపీ స్థాయి అధికారితో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ప్రజలను మోసం చేసిన చిట్‌ నిర్వాహకుల నుంచి సుమారు రూ.200 కోట్ల ప్రజలకు అందేలా చేశారు. ప్రజా సమస్యల పరిష్కరించే క్రమంలో అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. అధికార పార్టీ నేతలను సైతం వదలిపెట్టలేదు. దీంతో భూకబ్జాలకు పాల్పడుతున్న వారు చాలామంది వెనక్కి తగ్గారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అధికారులు సమస్యాత్మక విషయాల్లో రెండు వర్గాలను సీపీ దగ్గర ప్రవేశపెట్టడంతో స్వయంగా పరిష్కార మార్గాలను చూపెట్టారు. ఫలితంగా తక్కువ కాలంలోనే ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. చాలా మంది సీపీ ఫొటోలకు పాలాభిషేకాలు నిర్వహించారు.భూకబ్జాదారులకు సహకరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్న పోలీస్‌ అధికారులపై ఆయన ఉక్కుపాదం మోపారు. 10 నెలల సమయంలో 24 మంది పోలీస్‌ అధికారులపై సీపీ సస్పెన్షన్‌ వేటు వేశారు. ఏడుగురు ఇన్‌స్పెక్టర్లు, ఒక ఆర్‌ఐ, ఏడుగురు సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఒక ఏఎస్సై, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. అంతేకాకుండా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పలువురు పోలీసులను ఏఆర్‌కు పంపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *