ఇక నుంచైనా…

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాను కోరుకున్న విధంగా కొత్త సచివాలయాన్ని నిర్మించుకున్నందున ఇకపైన పాలన మొత్తం ఈ భవనం నుంచి అందిస్తారా? లేక మూణ్ణాళ్ళ ముచ్చటకే పరిమితం చేస్తారా? అనే చర్చ మొదలైంది. అధికారులు, సిబ్బంది మధ్య భిన్నమైన రీతిలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం మొత్తం సచివాలయానికి తరలిరావడంతో సీఎం కూడా కచ్చితంగా వస్తారని అధికారులు బలంగా నమ్ముతున్నారు.కోరుకున్న రీతిలో సచివాలయ భవనం నిర్మాణమైనందున పూర్తి సంతృప్తితో ఉన్నారని, రెగ్యులర్‌గా రావడానికే అవకాశాలున్నాయని ఆఫీసర్లు వ్యాఖ్యానించారు.మరో వైపు ఎన్నికల సంవత్సరం కావడంతో ఎప్పటికప్పుడు పథకాల సవిూక్ష, గతంలో ఇచ్చిన హావిూల అమలు, మార్గదర్శకాల రూపకల్పన తదితరాలన్నింటినీ లోతుగా స్టడీ చేస్తూ అవసరమైన రిపోర్టులను తెప్పించుకునే పనులు ఎక్కువగా ఉంటాయని గుర్తుచేశారు. గతంలోనైతే ప్రగతి భవన్‌ కేంద్రంగా పాలన సాగినందున అధికారులంతా రిపోర్టుల్ని తీసుకునే అక్కడికే వెళ్ళాల్సి వచ్చేదన్నారు.జిల్లా స్థాయిలో వెల్ఫేర్‌ స్కీమ్‌లు సీఎం కోరుకున్న విధంగా అమలవుతున్నాయో లేదో తరచూ కలెక్టర్లతోనే డైరెక్టుగా మాట్లాడి రిపోర్టులు తెప్పించుకుంటారని, సచివాలయానికి వచ్చిన తర్వాత పాలనలో ప్రత్యేక తేడా కనిపిస్తుందనే అభిప్రాయాన్ని ఐఏఎస్‌, ఐపీఎస్‌ స్థాయిలో కలిగించేందుకు సీఎం తరచూ సెక్రటేరియట్‌కు రావడానికే మొగ్గు చూపుతున్నారని మరో అధికారి వ్యాఖ్యానించారు. కానీ, ఎన్జీవో ర్యాంక్‌ సిబ్బందిలో మాత్రం మరో రకమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూణ్ణాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతుందని, వారానికి రెండు మూడు రోజులకు పరిమితం చేసి ఎన్నికల వేడి మొదలుకాగానే ప్రగతి భవన్‌కే పరిమితమవుతారని అభిప్రాయపడ్డారు.ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ఇకపైన రెగ్యులర్‌గా సెక్రటేరియట్‌కు వస్తాననే విషయాన్ని నొక్కిచెప్పలేదనే అంశంపై కొద్దిమంది సిబ్బంది స్పందిస్తూ, వాస్తవానికి తొలుత తయారైన స్పీచ్‌ వేరేగా ఉందని పేర్కొన్నారు. పాత సచివాలయాన్ని కూలగొట్టడంపై వచ్చిన విమర్శలపైనే ఎక్కువ దృష్టి పెట్టి కొత్త భవనాన్ని అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకున్నామనే అంశాన్ని చెప్పదల్చుకున్నారని, దాన్ని బట్టే వారికి విమర్శించే అవకాశం లేకుండా ఫోకస్‌ పెట్టారని గుర్తుచేశారు. ప్రతీ రోజు రాకపోయినా వారానికి మూడుసార్లయినా వస్తారనేది ఆఫీస్‌ సెటప్‌ను చూసిన తర్వాత అర్థమవుతుందని పేర్కొన్నారు. అనేక వెల్ఫేర్‌ స్కీమ్‌ల అమలు పెండిరగ్‌లో పడడంతో ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తిని తగ్గించేలా ఇకపైన పాలన విూద దృష్టి పెట్టడం కోసం సచివాలయానికి రావడం ఒక అవసరమన్న అభిప్రాయామే ఎక్కువ మంది ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతున్నది.సచివాలయానికి వచ్చే అలవాటే లేని కేసీఆర్‌ కొత్త భవనాన్ని కట్టుకున్నా ప్రయోజనమేంటంటూ ఇప్పటికే విపక్ష నేతలు విమర్శించారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే సచివాలయం అని గతంలో అధికార పార్టీ నేతలు చెప్పిన అంశాన్ని పలువురు గుర్తుచేశారు. రెగ్యులర్‌గా సెక్రటేరియట్‌కు సీఎం వస్తే సిబ్బందిలో స్పష్టమైన తేడా కనిపిస్తుందని, ఆఫీసర్ల స్థాయిలో తీసుకునే నిర్ణయాల్లో, పెండిరగ్‌ ఫైళ్ళను ఎప్పటికప్పుడు క్లియర్‌ చేయడంలో, అన్ని వివరాలను సమగ్రంగా రూపొందించడంలో.. అన్ని దశల్లోనూ ఒక భయం, క్రమశిక్షణ అలవడుతుందన్నారు. ముఖ్యమంత్రి హాజరుకాకపోతే అధికారుల్లోనూ అలసత్వం, నిర్లక్ష్యం ఉంటుందని, ఆ ప్రభావం రొటీన్‌ కార్యకలాపాలపై కనిపిస్తుందని గుర్తుచేశారు. ఎవరికెన్ని సందేహాలున్నా సీఎం ఇకపైన రెగ్యులర్‌గా వస్తారా లేదా అనేదానికి కొన్ని రోజుల తర్వాతనే క్లారిటీ వస్తుందన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *