వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ బిజీ

కాలానికి అనుగుణంగా వర్షాలు సమృద్ధిగా కురియడంతో వానకాలం పంటల సాగులో రైతన్నలు బిజీగా మారారు. ఈసారి ముందుగానే తొలకరి పలకరించడంతో రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేస్తున్నారు. భారీ వర్షాలు కురియడంతో బావులు, మోటర్లలోకి నీరు పుష్కలంగా వచ్చింది. దీంతో సరైన సమయంలో పత్తి విత్తడంతో పాటు వరినార్లు పోశారు. ఈక్రమంలో రైతులు దుక్కులు దున్నడం, పత్తి చేనులో కలుపు తీయడం లాంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ముందస్తుగా నారు పోసిన రైతులు నాటు వేసే పనుల్లో సైతం ముందుకు సాగుతున్నారు.వర్షాలు సమృద్ధిగా కురియడంతో పంటలు ఆశాజనకంగా ఉన్నాయి. అంతేకాకుండా బోరుబావుల్లో పుష్కలంగా నిండుగా నీరున్నది. దీనికితోడు ప్రభుత్వం 24గంటల విద్యుత్‌ సరఫరా చేయడంతో పాటు ఎరువులు స్థానిక కోనరావుపేట, కొలనూర్‌ సింగిల్‌ విండో పరిధిలో అందుబాటులో ఉంచింది. దీంతో రైతులు రెట్టింపు ఉత్సాహంతో పంటలు సాగుచేస్తున్నారు.పత్తి పంట ఆశాజనకంగా ఉండి మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. ఒకేసారి అన్ని చోట్ల సాగుచేయడంతో కలుపు తీసేందుకు కూలీల కొరత ఏర్పడుతున్నది. వివిధ ప్రాంతాల నుంచి ఆటోలు, ట్రాక్టర్లలో కూలీలు తరలివస్తున్నప్పటికీ రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక వరినాట్లు వేసేందుకు రైతులు ట్రాక్టర్లతో దుక్కులు దున్నుతూ సిద్ధమవుతున్నారు.మండల వ్యాప్తంగా 22వేల ఎకరాల్లో రైతులు సాగుచేస్తున్నారు. 15వేల ఎకరాల్లో వరి, 8వేల ఎకరాల్లో పత్తి, 400 ఎకరాల్లో కందితో పాటు మక్క, పెసర పంటలను సాగు చేస్తున్నారు. అధిక దిగుబడి సాధించేందుకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సూచనలు, సలహాలను ఇస్తున్నారు. దీంతో రైతులు పంటలను ఉత్సాహంగా సాగుచేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *