మునుగోడు ఎవరికి…

తెలంగాణలో బలపడాలనుకుంటున్న బీజేపీ.. ఆపరేషన్‌ ఆకర్ష్‌ ను ముమ్మరం చేసింది. పేరున్న నేతలను పార్టీలోకి తీసుకోవడానికి పావులు కదుపుతోంది. ముఖ్యంగా ఇప్పటివరకు పార్టీకి ఎంట్రీ లేని ఖమ్మం, నల్గొండ జిల్లాలపై ఫోకస్‌ పెట్టింది. ఆయా జిల్లాల్లో ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలను కాషాయ దళంలో చేర్చుకోవడానికి ప్లాన్‌ వేసింది. ఇలా ఆపరేషన్‌ ఆకర్ష్‌ అమల్లో ఉండగానే.. మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిశారు. మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్నా.. ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.అమిత్‌ షాను మర్యాదపూర్వకంగానే కలిశానని చెబుతున్న రాజగోపాల్‌ రెడ్డి.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ ను ఓడిరచే పార్టీ నుంచే తాను పోటీ చేస్తానని వ్యాఖ్యానించారు. ఇక్కడే అసలు సినిమా మొదలైంది. అయితే.. రాజగోపాల్‌ రెడ్డి.. కేసీఆర్‌ ను ఓడిరచే పార్టీ ఏదో చెప్పలేదు. కానీ.. కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం ఆ సత్తా లేదనే అర్థం వచ్చేలా కామెంట్స్‌ చేశారు. దీంతో ఆయన బీజేపీలో చేరతారనే ఊహాగానాలు బలపడ్డాయి. అయితే.. పార్టీలో ఎవరు చేరినా.. వారున్న పదవులకు రాజీనామా చేసి బయటకు రావాలని బీజేపీ కండీషన్‌ పెడుతోంది. ఒకవేళ రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలోకి వెళ్లాలనుకుంటే.. రాజీనామా చేయాలి. ఇక్కడే అసలు చర్చ తెరపైకి వస్తోంది. ఆయన రాజీనామా చేస్తే.. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎవరికి ప్రమాదంగా మారతాయనే చర్చ నడుస్తోంది.తెలంగాణ సీఎం కేసీఆర్‌ ను ఉప ఎన్నికలతో ఇబ్బంది పెట్టాలనేది బీజేపీ వ్యూహాల్లో ఒకటి. ఒకవేళ రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలోకి వస్తే.. ఆయనతో రాజీనామా చేయించి.. ఆ ఉపఎన్నికను ఉపయోగించుకొని టీఆర్‌ఎస్‌ పార్టీని ఇబ్బంది పెట్టాలని బీజేపీ ప్లాన్‌ చేస్తోంది. రాజగోపాల్‌ రెడ్డిఎలాగూ సొంత ఇమేజ్‌ తో గెలిచే నేతనే కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని భావిస్తోంది. ఆ ప్రాంతంలో కోమటిరెడ్డి సోదరులకు మంచి పట్టుంది. స్వతంత్రంగా పోటీచేసిన గెలిచే సత్తా కూడా ఉంది. అయినా.. ఒకవేళ ఓడిపోతే.. రాజగోపాల్‌ రెడ్డికి రాజకీయంగా డ్యామేజ్‌ తప్పుదు. ఆ ఎఫెక్ట్‌ భవిష్యత్తులోనూ ఉంటుందనే చర్చ జరుగుతోంది.ఉప ఎన్నిక వచ్చి.. రాజగోపాల్‌ రెడ్డిగెలిచినా టీఆర్‌ఎస్‌ పార్టీకి పెద్దగా నష్టం ఉండదు. ఎందుకంటే మునుగోడు టీఆర్‌ఎస్‌ స్థానం కాదు కాబట్టి.. ఓడిపోయినా తమ స్థానం కాదని గులాబీ నేతలు చెబుతారు. అదే రాజగోపాల్‌ రెడ్డి ఓడిపోతే.. బీజేపీకి, రాజగోపాల్‌ రెడ్డికి నష్టం తప్పదు. ఇవన్నీ ఆలోచించిన బీజేపీ ఓ కొత్త ప్లాన్‌ వేసినట్టు తెలుస్తోంది. రాజగోపాల్‌ రెడ్డిని ఇప్పుడే బీజేపీలోకి తీసుకోవద్దని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు ఆయన్ను బీజేపీలోకి తీసుకుని.. అప్పుడు రాజీనామా చేయించాలని ప్లాన్‌ చేస్తోంది. ఎందుకంటే.. ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు రాజీనామా చేస్తే ఉప ఎన్నిక జరగదు. దీంతో సాధారణ ఎన్నికల్లో పోటీ చేయొచ్చని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలా చేస్తే.. అటు బీజేపీకి.. ఇటు రాజగోపాల్‌ రెడ్డి కి ఎలాంటి నష్టం ఉండబోదని కాషాయ పెద్దలు భావిస్తున్నట్టు చర్చ జరుగుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *