ఐదు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీలే కీలకం

వచ్చే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల గెలుపోటములను శాసిస్తూ ప్రభుత్వాలను నిర్ణయించే అంశాలు చాలానే ఉంటాయి.త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో దళితులు, గిరిజనులు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో కీలకంగా మారారని అర్థమవుతోంది. అందుకే ఈ వర్గాల ఓట్ల కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్‌తో పాటు ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు సైతం ఈ దళిత, గిరిజనుల ఓట్ల వేటలో పరుగులు తీస్తున్నాయి. 2018లో దళిత, గిరిజనుల విశ్వాసాన్ని పొందలేకపోవడం వల్లనే బీజేపీ మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఐదు రాష్ట్రాల్లో షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్‌ తెగల(ఎస్టీ) కు చెందిన ఓటర్లు అధికార పీఠాన్ని అప్పగించడంలో కీలకంగా మారనున్నారు.రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో మొత్తం 669 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, వీటిలో 250 సీట్లు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేసి ఉన్నాయి. అంటే మొత్తం సీట్లలో వీరి వారా 37.36 శాతం. ఐదేళ్ల క్రితం మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో మూడిరట రెండొంతుల ఎస్సీ`ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాల్లో విజయ పతాకాన్ని ఎగురవేసి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న బీజేపీ ఆశలపై కాంగ్రెస్‌ నీళ్లు చల్లింది. ఓటర్లను ఆకట్టుకునే హావిూలు, మేనిఫెస్టోతో పాటు సిట్టింగ్‌ ప్రభుత్వాలపై ఉండే సానుకూలత లేదా వ్యతిరేకత సహా ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. వాటిలో కులాలు, మతాలు, వర్గాల పేరుతో ఓటుబ్యాంకుగా ఏర్పడే సమూహాలు కూడా కీలకమే అదే విధంగా తెలంగాణలో నాటి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌), మిజోరంలో మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) దళిత, గిరిజన సీట్లలో మెజారిటీ స్థానాలు గెలుచుకుని సత్తా చాటాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మాయాజాలం ఈ రిజర్వుడు స్థానాల్లో దాగి ఉండడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ మరొకటి లేదు.దళిత, గిరిజన ఓటర్ల మనసు గెలవకుండా తెలంగాణలో అధికారం చేపట్టడం అసాధ్యం. ఎందుకంటే 18 శాతం ఎస్సీ, 12 శాతం ఎస్టీ ఓటర్లు రాష్ట్రంలో ఉన్నారు. రాష్ట్రంలోని ఓటర్లలో దాదాపు 30 శాతం మంది ఈ రెండు వర్గాలకు చెందినవారే. ఈ కారణంగా తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో 31 సీట్లు రిజర్వ్‌ స్థానాలుగా ఉన్నాయి. వాటిలో 12 సీట్లు ఎస్టీకి, 19 సీట్లు ఎస్సీకి రిజర్వ్‌ అయ్యాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక రిజర్వ్‌డ్‌ స్థానాలను కైవసం చేసుకోవడంలో కేసీఆర్‌ పార్టీ విజయం సాధించింది. దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల వ్యవసాయ భూమి, దళిత బంధు వంటి పథకాలను కేసీఆర్‌ తీసుకొచ్చి వారిని ఎప్పుడూ తమవైపే ఉండేలా చూసుకుంటున్నారు. గిరిజనుల కోసం కోసం కొన్ని పథకాలను ప్రకటించారు. అయితే పథకాలు ప్రకటించిన స్థాయిలో అమలుకావడం లేదన్న విమర్శలున్నాయి. ఈ పరిస్థితుల్లో దళిత, గిరిజనులను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా అనేకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. మిజోరం రాజకీయాలు గిరిజన సంఘాల చేతుల్లో ఉన్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రం మొత్తం ఎత్తైన పర్వతాల మధ్య కొలువై ఉంది. రాష్ట్రంలోని మొత్తం 40 సీట్లలో 39 సీట్లు ఎస్టీ కమ్యూనిటీకి, ఒక సీటు జనరల్‌ కేటగిరీకి రిజర్వ్‌ అయింది. మిజోరాంలో ఎస్సీ వర్గానికి ఒక్క సీటు కూడా లేదు. 2018 ఎన్నికలలో మిజో నేషనల్‌ ఫ్రంట్‌ ప్రజలను ఆకట్టుకోగల్గింది. కానీ కానీ ఈసారి సవాళ్లను ఎదుర్కొంటోంది.రాజస్థాన్‌ రాజకీయాల్లో దళిత, గిరిజన ఓటర్లు చాలా నిర్ణయాత్మకంగా ఉన్నారు. 17 శాతం దళితులు, 13 శాతం గిరిజన ఓటర్లు ఉన్నందున రాష్ట్రంలో అధికారాన్ని ఈ రెండు వర్గాల ఓటర్లే నిర్ణయిస్తారు. రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ సీట్లలో దాదాపు 30 శాతం అంటే 59 సీట్లు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేయగా.. అందులో 34 సీట్లు ఎస్సీలకు, 25 సీట్లు ఎస్టీలకు కేటాయించారు. 2013 ఎన్నికల్లో 45 రిజర్వ్‌డ్‌ స్థానాలు గెలుచుకుని రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ 2018లో 21కి పడిపోయింది. బీజేపీ 11 ఎస్టీ, 10 ఎస్సీ స్థానాల్లో విజయం సాధించింది. 2013లో కాంగ్రెస్‌ 7 రిజర్వ్‌డ్‌ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. 2018 నాటికి కాంగ్రెస్‌ బలం 34 సీట్లకు (21 ఎస్టీ, 13 ఎస్సీ) పెరిగింది. ఫలితంగా విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఈ గణాంకాలే రాజస్థాన్‌లో ఎస్సీ`ఎస్టీ రిజర్వ్‌డ్‌ సీట్లలో అధికార మాయాజాలం ఎలా దాగి ఉందో స్పష్టంగా చెబుతున్నాయి. అందుకే ఈ స్థానాల్లో గెలుపు కోసం బీజేపీ, కాంగ్రెస్‌ లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.మధ్యప్రదేశ్‌లోని దళిత, గిరిజన ఓటర్లకు ఏ పార్టీనైనా ఆట కట్టించగల శక్తి ఉంది. ఈ రాష్ట్రంలో 16 శాతం ఎస్సీ, 21 శాతం ఎస్టీ ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 230 అసెంబ్లీ స్థానాల్లో 82 సీట్లు ఎస్సీ`ఎస్టీలకు రిజర్వు కాగా, అందులో 47 సీట్లు ఎస్టీకి, 35 సీట్లు ఎస్సీలకు కేటాయించారు. 2013 ఎన్నికల్లో 82 రిజర్వ్‌డ్‌ స్థానాల్లో 53 గెలుచుకోవడంలో బీజేపీ విజయం సాధించగా, 2018లో 25 సీట్లకు పరిమితమై ఓటమిపాలైంది. 2013లో 12 రిజర్వ్‌డ్‌ స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్‌ గెలుపొందగా, 2018 ఎన్నికల్లో 40 సీట్లకు చేరుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విజయం సాధించింది. అందుకే ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓట్లను రాబట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ లు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.ఛత్తీస్‌గఢ్‌ రాజకీయాలు గిరిజన, దళిత సంఘాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. రాష్ట్రంలో 34 శాతం గిరిజన ఓటర్లు ఉండగా వారికి 29 సీట్లు రిజర్వ్‌ అయ్యాయి. దళితులు 11 శాతానికి చేరువలో ఉండగా వారికి 10 సీట్లు రిజర్వ్‌ అయ్యాయి. అలా మొత్తంగా రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 39 స్థానాలు ఎస్సీ`ఎస్టీలకు రిజర్వ్‌ అయ్యాయి, 2018 ఎన్నికల్లో 39 రిజర్వ్‌డ్‌ స్థానాల్లో బీజేపీ 6 మాత్రమే గెలుచుకోగలిగితే, కాంగ్రెస్‌ 29 ఎస్టీ సీట్లలో 28 గెలుచుకుంది. అలాగే 6 ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానాల్లో విజయం సాధించింది. ఈ గెలుపే కాంగ్రెస్‌ మెజారిటీకి ఉపయోగపడిరది. తద్వారా 15 సంవత్సరాల తర్వాత మళ్లీ తిరిగి అధికారంలోకి రాగలిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎస్సీ`ఎస్టీల సీట్లలో గెలుపు కోసం రెండు పార్టీలు శాయశక్తులా ప్రయత్నాలు సాగిస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *