అభివృద్ధికి ఆమడ దూరం ములుగు

పేరుకు ధనిక రాష్ట్రం. దేశంలోని ఇతర రాష్ట్రాలను వెనక్కి నెట్టి అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణ రాష్ట్రంలో అటవీ ప్రాంతమైన ములుగు జిల్లా వెంకటాపురం మండలం సీతారాంపురం అనే గ్రామంలో నీళ్ల కోసం కొన్ని కిలోవిూటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం రవాణా మార్గం కూడా లేకుండా మట్టి రోడ్లలొ కాలి బాటలో.. ఆటోలు కూడా వెళ్ళని కటిక అరణ్యంలో బిక్కుబిక్కు అంటూ బతుకుతున్న గిరిజన బిడ్డలను ఏ దేవుడు కరుణిస్తాడో, ఏ దేవుడు రోడ్లు నిర్మిస్తాడో అయోమయంలో గిరిజన బిడ్డలు సతమతమవుతున్నారు.ఈ ప్రాంతమంతా కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి పనులకు నోచుకోకపోవడం లేదు. నీరు, రోడ్డు సౌకర్యం కనీసం హాస్పిటల్‌ సౌకర్యం కూడా లేని ఈ ఊరుని చూసి బంగారు తెలంగాణ వచ్చిందనుకుందామా అనే రీతిలో విమర్శించే వారికి సరిగ్గా అద్దం పట్టేలా ఆ గ్రామం ఉంది. ఈ రోజుల్లో కూడా కనీసం నిత్య అవసరాలు, ప్రభుత్వ పథకాలు ఆ గ్రామానికి తెలియవు అని స్థానికులు చెబుతున్నారు. అభివృద్ధి పథంలో నడుస్తున్న ఈ కాలంలో మారుమూల గ్రామాలకు ప్రభుత్వ పథకాలు రావడం లేదా లేక స్థానికంగా ఉంటున్న నాయకులు మండల అధికారుల ధనదాహం ఆ గ్రామాన్ని అభివృద్ధికి నోచుకోకుండా చేస్తున్నారా అనేది హాట్‌ టాపిక్‌ గా మారింది.భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా సీతారాంపురం ఏజెన్సీ గ్రామంలో ఆ స్వతంత్ర ఛాయలు కనిపించడం లేదు. ఆ ఊరికి ప్రజలు ఇంకా కాలిబాటనే నడుస్తున్నారు. నీళ్లకోసం వాగులలో చేలిమెల నుంచి తెచ్చుకొని తాగే దుస్థితి ఉంది. అంటే అభివృద్ధి వారికి ఎంత అందుబాటులో ఉందో అర్థమవుతుంది. పల్లెలను అభివృద్ధిపరిచే ప్రభుత్వ పథకాలు ఏమవుతున్నాయి. రవాణా సౌకర్యం లేని ఆ ఊరును అభివృద్ధిపరిచే నాయకులు అధికారులు ఎవరు ఆ మూగ గిరిజన బిడ్డలు నీళ్ల కోసం రోడ్ల కోసం విలవిల్లాడుతుంటే అధికారులకు కనబడటం లేదా వారి ఆర్తనాదాలు వినబడటం లేవా.. రాష్ట్ర ప్రభుత్వం పల్లెలను అభివృద్ధిపరిచే విధంగా తెచ్చిన పథకాలు ఏ కోణాన కనిపించడం లేదు అని గిరిజనులు వాపోతున్నారు. ఓట్లకే గిరిజన దళిత బిడ్డలు పనికొస్తారు ప్రభుత్వ పథకాలకు పనికిరారు అనే విధంగా అభివృద్ధికి నోచుకోని ఆ గ్రామాన్ని చూస్తే అర్థమవుతుంది.ఆయా గ్రామాలలో చదువుకున్న విద్యార్థులు కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకుండా ఉంటే, ఇలాంటి పరిస్థితుల ప్రభావం యువకుల విూద ఎక్కువ పడితే, నవ భారతాన్ని నిర్మించే వారి మేధస్సు అడవి బాట పట్టే పరిస్థితులకు దారితీస్తున్నాయి. యువత నాశనం అవ్వడానికి మౌలిక సదుపాయాలు కూడా ఒక కారణమే అవుతాయన్న వాదన తెరపైకి వచ్చింది. ఇకనైనా అధికారులు ఈ గ్రామం పైన శ్రద్ధ చూపి వారి మొండి వైఖరిని మార్చుకుని, ఆ గ్రామంలో నీటి సౌకర్యం, రోడ్లు నిర్మించే విధంగా వారు బతుకులలో బాటలు వేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *