అజ్ఞాతంలో టీడీపీ నేతలు

వరుపుల రాజా. ప్రత్తిపాడు టీడీపీ ఇంఛార్జ్‌. 2019లో టీడీపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయారు. మధ్యలో ఒకసారి పార్టీ పై విమర్శలు చేసి దూరంగా ఉండి.. తిరిగి పసుపు కండువా కప్పుకొన్నారు. రాజా గతంలో లంపకలోవ పియేసీఎస్‌ ప్రెసిడెంట్‌ ఉన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో డిసిసిబి చైర్మన్‌గా ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో హస్తానికి హ్యాండ్‌ ఇచ్చి సైకిల్‌ ఎక్కేశారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. లంపకలోవ సొసైటీలో అక్రమాలు జరిగాయని గతంలో సిఐడి కేసు నమోదైంది. 15 కోట్ల మేర అవినీతి జరిగిందని సహకార శాఖ విచారణ చేసి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత కేసును పోలీసులు దర్యాప్తు చేసి సిఐడి కి బదిలీ చేశారు.ఆ సమయంలో వెంటనే అలెర్ట్‌ అయిన వరుపుల హైకోర్టు నుంచి అరెస్ట్‌ చేయకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు. అయితే పది రోజుల క్రితం సిఐడి అధికారులు గండేపల్లి సొసైటీలో అక్రమాలు జరిగాయని కేసు నమోదు చేశారు. ఆయనకి నోటీసులు ఇచ్చి అరెస్ట్‌ చేయడానికి సిద్ధం అయ్యారు. చనిపోయిన వ్యక్తులు బతికి ఉన్నట్టుగా సంతకాలు పోర్జరీ చేసి కోట్ల రూపాయల నొక్కేశారనేది ఆరోపణ. ఆ కేసులో సిఐడికి చిక్కకుండా కరెంట్‌ పోయినప్పుడు రాజా ఎస్కేప్‌ అయ్యారు. అది జరిగి పది రోజులు గడుస్తున్నా.. టీడీపీ నేత ఎక్కడున్నారో జాడ తెలియడం లేదట.ఈ మొత్తం వ్యవహారంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. గతంలో రాజా వల్ల లబ్ధి పొందిన కొందరు పోలీసులు ఆయనకు లీకులు ఇస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సిఐడి అధికారులు రాజా ఇంటికి వచ్చినప్పుడు స్థానిక పోలీసులు భారీగా మోహరించారు. అదే సమయంలో కరెంట్‌ పోవడంతో రాజా తప్పించుకోవడం.. అది ఆయన ఒక్కరి వల్ల సాధ్యం కాదని చెవులు కొరుక్కుంటున్నారట. బ్యాక్‌ బోన్‌ సపోర్ట్‌ వల్ల కథ సుఖాంతమైందనే టాక్‌ నడుస్తోంది. ఎవరో కావాల్సిన వాళ్లు ఉప్పు అందించారని అనుమానిస్తున్నారు.కొందరు ఉన్నతాధికారులు ఈ కేసుపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారట. రాజాను అరెస్ట్‌ ఛేస్తే తమ పరిస్థితి ఏంటి అని విచారణలో మొత్తం కూపీ లాగుతున్నారట. అసలు ఈ కేసు గురించి అధికారులకు ఎందుకు? వాళ్లెందుకు హైరానా పడుతున్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సిఐడి అధికారులు మాత్రం పది రోజులు గడిచినా సీరియస్‌గా లేరనే టాక్‌ నడుస్తోంది. గతంలో కూడా బెయిల్‌ వచ్చేంత వరకు ఇలాగే సాగదీశారని గుర్తు చేసుకుంటున్నారట. ఇప్పుడూ అదే జరుగుతుందేమోనని కొందరి సందేహం.వరపుల రాజా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఆయనకు వచ్చిన ముందస్తు సమాచారంతోనే ఎప్పటిలాగే అవుటాఫ్‌ స్టేషన్‌కి వెళ్లిపోయారని చర్చ జరుగుతోంది. షరా మామూలుగా సిఐడి అధికారుల గాలింపు కొనసాగుతోంది. మరి.. దర్యాప్తులో మలుపులు ఉంటాయో లేక పాత సీనే రిపీట్‌ అవుతుందో చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *