కన్నడ జగన్‌ పథకాలు

రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీలూ ఈ ఎన్నికల్లో గెలిచేందుకు సిద్ధమవుతున్నాయి. అధికార బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్‌ మాత్రం ఒంటరిగా పవర్‌లోకి వచ్చి రాహుల్‌కు గిఫ్ట్‌ గా ఇవ్వాలని భావిస్తుంది. ఇక కుమారస్వామి నేతృత్వంలోని జనతాదళ్‌ ఎస్‌ మాత్రం ఎవరికీ తగినన్ని సీట్లు రాకూడదని, తామే మళ్లీ కింగ్‌ మేకర్‌ అవ్వాలని మనసులో దేవుడిని ప్రార్థిస్తుంది. ఎన్నికల సర్వేలు కూడా హంగ్‌ అసెంబ్లీ రాక తప్పదని సూచిస్తున్నాయి. కాంగ్రెస్‌కు మాత్రం అధిక సీట్లు వస్తాయని అనేక సర్వేల్లో తేలుతుంది. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో వందకు పైగా స్థానాలు కాంగ్రెస్‌ గెలుచుకుంటుందని ఇప్పటికే అనేక సర్వేలు వెల్లడిరచాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే జేడీఎస్‌ రైతు బిడ్డను పెళ్లి చేసుకున్న యువతికి రెండు లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ఇది విన్నూత్న పథకమే. రైతులను పెళ్లిళ్లు చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కన్నడనాట అనేక మంది అవివాహితులుగానే పురుషులు మిగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి ప్రకటన వారిని ఆకట్టుకునేలా ఉంది. రెండులక్షల కోసమైనా తమతో పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారని ఎందరో వ్యవసాయం చేస్తున్న యువకులు ఆశపడుతున్నారు. వారంతా ఓట్లు వేస్తే అధిక సీట్లు గెలుచుకుంటామని జేడీఎస్‌ ధీమాగా ఉంది. . ఇక మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది. తాము గెలిస్తే ఉచిత పథకాలను అందిస్తామని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పథకాలను కన్నడ కాంగ్రెస్‌ తాను అమలు పరుస్తానని చెబుతూ ప్రజల్లోకి వెళుతుంది. ఉచిత కరెంట్‌, మహిళలకు ఆర్థిక సాయం, ఉచిత బియ్యం, నిరుద్యోగి భృతి ఇస్తామంటూ వాగ్దానాలు చేస్తుంది. తమ మ్యానిఫేస్టోలో కూడా పెట్టనుంది. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు ఇస్తామని తెలిపింది. గృహలక్ష్మి పథకం ద్వారా ఏడాదికి 24వేలు ఇస్తామని ప్రకటించింది. వీటిలో ఎక్కువగా ఏపీలో జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న పథకాలే కావడంతో కన్నడ నాట పార్టీలు తమ నేతను కాపీ కొడుతున్నాయంటున్నారు వైసీపీ నేతలు. ఇలా ఎన్నికలు దగ్గరపడే కొద్దీ కాంగ్రెస్‌ పార్టీ తాము ఇస్తున్న హావిూలు ప్రజల్లోకి తీసుకెళుతున్నాయి. 120 స్థానాలు సాధించి ఒంటరిగా అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్నాయి. ప్రజల్లో కూడా కొంత కాంగ్రెస్‌ పట్ల సానుకూలత ఉండటం, బీజేపీలో అసంతృప్తులు చెలరేగడంతో కాంగ్రెస్‌ నేతలు ఐకమత్యంగా పనిచేస్తే గెలుపు ఖాయమని భావిస్తున్నారు. అందుకోసం నేతలు కలసికట్టుగా శ్రమించాలని ఇప్పటికే ఏఐసీసీ నుంచి ఆదేశాలు జారీ అయ్యారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కర్ణాటక చేరుకున్నారు. సీఎం పదవిపై హైకమాండ్‌దే నిర్ణయమని నేతలకు స్పష్టం చేయనున్నారు. మరి కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఏ మేరకు కలసి కట్టుగా పనిచేస్తారన్నది చూడాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *