నల్గోండలో జంపింగ్‌ జంపాంగ్‌ లు

నల్గోండ, అక్టోబరు 18
ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేరికల రాజకీయం మొదలైంది. వివిధ రాజకీయ పార్టీలలో కిందిస్థాయి ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి తెచ్చుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రయత్నాలను మొదలు పెట్టాయినల్గొండ జిల్లాల చేరికల రాజకీయం ఊపందుకుంది. అన్ని ప్రధాన పార్టీలు ఇతర పార్టీల నాయకుల్ని తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందిజిల్లా కేంద్రమైన నల్గొండలో చేరికల రాజకీయం ఊపందుకుంది. అధికార బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తలపడున్నారు. బీజేపీ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు.మరో వైపు బీఆర్‌ఎస్‌ రెబెల్‌, కౌన్సిలర్‌ పిల్లి రామరాజు యాదవ్‌ ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచి బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నుంచి ఆయన వెంట తిప్పర్తి, కనగల్‌, నల్గొండ రూరల్‌ మండలాలు, నల్గొండ మున్సిపాలిటీ నుంచి కొందరు నాయకులు వెళ్లిపోయారు. ఇది అధికార పార్టీ సిట్టింగ్‌ అభ్యర్ధికి కొంత సమస్యగా పరిణమించింది.నల్గొండ మున్సిపాలిటీలో కొందరు కౌన్సిలర్లు బీఆర్‌ఎస్‌ కు షాక్‌ ఇవ్వనున్నారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేష్‌ , మరో ఐదుగురు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు కాంగ్రెస్‌ కండువాలు కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. సోమవారం ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి తన ఎన్నికల ప్రచారం షురూ చేశారు. ఆయన వెంట ప్రచారంలో పాల్గొని ఆ తర్వాత కాంగ్రెస్‌ అభ్యర్థి, ఎంపీ కోమటిరెడ్డితో ఈ కౌన్సిలర్లు టచ్‌ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోందిసూర్యాపేట జిల్లా పరిధిలోని కోదాడలో అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కొందరు సీనియర్‌ నాయకులు బీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇవ్వనున్నారు. ఇక్కడ కూడా సిట్టింగ్‌ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ కు టికెట్‌ ఇవ్వడాన్ని సీనీయర్లు ఆక్షేపిస్తున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మార్చాలని పట్టుబట్టారు. కానీ, అధిష్టానం ఆయనకే బి ఫారం కూడా అందజేసింది. దీంతో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌ రావు, బీఆర్‌ఎస్‌ మాజీ ఇంచార్జ్‌ శశిధర్‌ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ ముత్తవరపు పాండురంగా రావు తదితర నాయకులు పార్టీ మారాలని నిర్ణయించుకునట్లు తెలుస్తోంది. వారంతా ఈ రోజు మధ్యాహ్నం కోదాడలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో భేటీ కానున్నారని సమాచారం. కోదాడ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి భార్య, మాజీ ఎమ్మెల్యే పద్మావతీరెడ్డి టికెట్‌ దక్కించుకున్నారు.నాగార్జున సాగర్‌ బీఆర్‌ఎస్‌కూ చేరికల తలనొప్పి తప్పడం లేదు. ఇక్కడ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌ రెండో సారి పోటీ పడనున్నారు. కాగా, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కుందూరు జానారెడ్డి ఈ సారి పోటీ నుంచి తప్పుకుని తన రెండో తనయుడు కుందూరు జైవీర్‌ రెడ్డికి టికెట్‌ ఇప్పించుకున్నారు. ఈ నియోజకవర్గంలో ఇపుడు ఇద్దరు యువకుల నడుమ పోరు జరగనుంది.జైవీర్‌ రెడ్డికి టికెట్‌ ప్రకటించగానే చేరికల రాజకీయాల్లో కాంగ్రెస్‌ నాయకత్వం వేగం పెంచింది. ఇప్పటికే నిడమనూరు మండలానికి చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకలను బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ లోకి తీసుకువచ్చారు. నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో అసమ్మతి భగ్గుమంటోందినోముల భగత్‌ టికెట్‌ రద్దు చేయాలన్న డిమాండ్‌ ను అసమ్మతి వర్గం బలంగా వినిపించినా హైకమాండ్‌ పట్టించుకోలేదు. ఈ నియోజకవర్గం పరిధిలోని గుర్రంపోడ్‌ మండల జెడ్పీటీసీ సభ్యుడు గాలి రవి కుమార్‌, 10 మంది సర్పంచులు, 12 మంది మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఇతర నాయకులు ఎమ్మెల్యే భగత్‌ ను అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు.బీఆర్‌ఎస్‌ నాయకుడు , మాజీ ఎమ్మెల్యే గుండబోయిన రామ్మూర్తి యాదవ్‌ మనవడు మన్నెం రంజిత్‌ యాదవ్‌ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. నాగార్జు సాగర్‌ నియోజకవర్గం నుంచి రంజిత్‌ బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించారు. గత ఉప ఎన్నికల సమయంలోనూ టికెట్‌ ఆశించినా దక్కలేదు. కనీసం ఈ సారి టికెట్‌ వస్తుందని ప్రయత్నించినా.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో దాదాపు అందరికీ టికెట్లు ఇవ్వడంతో నోముల భగత్‌ అభ్యర్థిత్వమే ఖరారు అయ్యింది.ఈ కారణంగానే మన్నెం రంజిత్‌ పార్టీని వీడి ఈటల రాజేందర్‌ సమక్షంలో బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది. ఇవే కాకుండా సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులను వివిధ పార్టీల నుంచి తెచ్చుకోవడంలో అధికార బీఆర్‌ఎస్‌ బిజీగా ఉంది. కాగా, సూర్యాపేటలో మంత్రి జగదీష్‌ రెడ్డి దగ్గరి అనుచరుడు వట్టె జానయ్య యాదవ్‌ సోమవారం బీఆర్‌ఎస్‌ కు రాజీనామా చేసి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ సమక్షంలో బీఎస్పీలో చేరారు. దేవరకొండలో కాంగ్రెస్‌ నాయకుడు బిల్యానాయక్‌ ఇటీవలనే ఆ పార్టీని వీడి కేటీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *