‘హార్వర్డ్‌’ ప్రొఫెసర్‌ క్లాడియా గోల్డిన్‌కు ఆర్థిక నోబెల్‌

పని ప్రదేశాల్లో లింగ వివక్షపై నిర్వహించిన విస్తృత అధ్యయనానికిగాను అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ క్లాడియా గోల్డిన్‌ను ఈ ఏడాది ఆర్థిక రంగంలో నోబెల్‌ బహుమతి వరించింది. స్టాక్‌హోంలోని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ సోమవారం ఆర్థిక రంగంలో నోబెల్‌ అవార్డును ప్రకటించింది. ఈ రంగంలో ఇప్పటి వరకు 93 మంది నోబెల్‌ బహుమతిని అందుకోగా, వారిలో క్లాడియా మూడో మహిళ కావడం గమనార్హం. పని ప్రదేశాల్లో మహిళల భాగస్వామ్యానికి సంబంధించిన సుమారు 200 సంవత్సరాల వివరాలను క్లాడియా అధ్యయనం చేశారు. ఆర్థిక వృద్ధి కొనసాగుతున్నప్పటికీ మహిళలకు పురుషులతో సమానంగా వేతనాలు అందకపోవడం, పురుషుల కంటే ఉన్నత చదువులు చదివినప్పటికీ మహిళలకు తగిన ప్రాధాన్యం లభించకపోవడాన్ని ఆమె విశ్లేషించారు. ‘నేను నిరంతర ఆశావాదిని. కానీ, సంఖ్యాపరంగా చూస్తే అమెరికాలో ఏదో జరిగిందని తెలుస్తోంది. 1990వ దశకంలో ప్రపంచ శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం మా(అమెరికా) దేశంలోనే అత్యధికం. కానీ, ఇప్పుడు కాదు. దీనిపై మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల ఇళ్లలో ఏం జరుగుతుందో, పని ప్రదేశాల్లోనూ అదే ప్రతిబింబిస్తుంది. మరింత లింగసమానత్వం దిశగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది’ అని 77 ఏళ్ల క్లాడియా ఈ సందర్భంగా ఓ ఆంగ్లవార్తా సంస్థకు చెప్పారు. 1946లో న్యూయార్క్‌లో జన్మించిన ఆమె కార్నెల్‌ యూనివర్సిటీ, ది యూనివర్సిటీ ఆఫ్‌ చికాగోలలో విద్యాభ్యాసం చేశారు. ఉద్యోగ ప్రపంచంలో మహిళల పాత్ర, విస్తృత సామాజిక, ఆర్థిక అవసరాలకు అనుగుణంగా వారికి వేతనాలు లభించకపోవడాన్ని తన పరిశోధనల్లో ఆమె విశ్లేషించారు. క్లాడియా పరిశోధన సమస్యకు పరిష్కారాన్ని చూపనప్పటికీ, పాతుకుపోయిన సమస్యపై విధానకర్తలు దృష్టి కేంద్రీకరించేలా చేసిందని నోబెల్‌ కమిటీ సభ్యుడు, ఆర్థికవేత్త రాండి హ్జల్‌మర్సన్‌ వ్యాఖ్యానించారు. ‘లింగ వ్యత్యాసానికి కారణాలు, కాలానుగుణంగా వస్తున్న మార్పులు, అభివృద్ధి మార్గంతో అది ఎలా విభేదిస్తోంది, ఒకే విధానం లేకపోవడం తదితరాలను ఆమె వివరించారు. ఇది విధానపరమైన సంక్లిష్ట ప్రశ్న. ఎందుకంటే అంతర్లీన కారణం తెలియకుంటే నిర్దిష్ట విధానం పనిచేయదు’ అని రాండి హ్యాల్‌మర్సన్‌ పేర్కొన్నారు. మహిళల భాగస్వామ్యానికి సంబంధించి చరిత్రలోనూ, వ్యవస్థాగత లేబర్‌ మార్కెట్‌ రికార్డుల్లోనూ పూర్తిస్థాయి సమాచారం క్లాడియాకు లభించలేదని, దీంతో డిటెక్టివ్‌లా ఆ సమాచారం కోసం ఆమె శోధించారని కొనియాడారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *