శంకరమ్మకు ఎమ్మెల్సీగా అవకాశం..?

తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నుంచి పిలుపు అందింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రి జగదీష్‌రెడ్డి ఆమెను ప్రగతి భవన్‌కు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. శంకరమ్మకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం. గవర్నర్‌ కోటాలో ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే ఛాన్స్‌ ఉందని చర్చ జరుగుతోంది. శంకరమ్మకు కీలక పదవి ఇస్తామని బీఆర్‌ఎస్‌ అధిష్టానం గతంలోనే హావిూ ఇచ్చింది. ఆ హావిూ మేరకు తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, తనకిచ్చిన హావిూని నెరవేర్చడంలో జాప్యం జరగడంతో.. కేసీఆర్‌ ప్రభుత్వంపై శంకరమ్మ గతంలో అసంతృప్తి వ్యక్తం చేశారు.20 రోజులుగా రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రోజుకొక కార్యక్రమాన్ని ఎంపిక చేసి ఈ వేడుకలను నిర్వహించారు. అయితే, శ్రీకాంతాచారి త్యాగాన్ని గుర్తుచేస్తూ కొంత మంది సోషల్‌ విూడియాలో తొలి రోజు నుంచే కేసీఆర్‌ సర్కార్‌పై విమర్శలు చేస్తున్నారు. శ్రీకాంతచారి త్యాగం.. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందని, ఆయన కుటుంబసభ్యులకు పదవులను ఇప్పించిందని.. అమరుల కుటుంబాలకు మాత్రం మేలు జరగలేదని ఆరోపిస్తున్నారు. ఈ విమర్శలకు చెక్‌ పెట్టేవిధంగా బీఆర్‌ఎస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం సరైన సందర్భాన్ని ఎంచుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి,తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజును అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించేందుకు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో, పట్టణాల్లో అమరులకు నివాళి అర్పించి, మౌనం పాటిస్తారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌పై నిర్మించిన అమరవీరుల స్మారకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆవిష్కరించారు. ఇందు కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇదే సందర్భంలో తెలంగాణ వచ్చినా, అమరుల కుటుంబాలకు మేలు జరగలేదనే విమర్శలను తిప్పికొట్టే విధంగా బీఆర్‌ఎస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది.శంకరమ్మకు 2014లో బీఆర్‌ఎస్‌ పార్టీ హుజుర్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చింది. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (కాంగ్రెస్‌) చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, హుజుర్‌నగర్‌ ఉప ఎన్నిక సమయంలోనూ ఆమె టికెట్‌ ఆశించారు. కానీ, టికెట్‌ దక్కకపోవడంతో ఆమె అసంతృప్తికి గురయ్యారు. కేసీఆర్‌ సర్కార్‌పై విమర్శలు కురిపించారు.తెలంగాణ ఉద్యమ సమయంలో 2009 డిసెంబర్‌ 4న ఎల్బీ నగర్‌ చౌరస్తాలో శ్రీకాంతాచారి తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మార్పణం చేసుకున్నారు. ఆయన బలిదానంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఎల్బీ నగర్‌ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు పెడుతున్నట్లు మంత్రి కేటీఆర్‌ ఇటీవల ప్రకటించారు. ఈ నిర్ణయంపై శంకరమ్మ కూడా స్పందించారు. ‘నా కుమారుడి త్యాగానికి ఇది సరైన నిర్ణయం. తెలంగాణ కోసం ఎల్బీనగర్‌ చౌరస్తాలో నా కొడుకు పెట్రోల్‌ పోసుకుని మాంసం కరుగపెట్టుకున్నాడు. ప్రభుత్వం చేసిన పనికి నా కొడుకు ఆత్మ శాంతిస్తుంది. చనిపోయిన నా కొడుకుకు మళ్లీ ప్రాణం పోసినట్టు నాకు అనిపిస్తోంది’ అని ఆమె అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *