`నేడు విప్లవ వీరుడు అల్లూరి జయంతి

మన్యం ప్రజల హక్కుల కోసం, భారతమాత స్వాతంత్య్రం కోసం పోరాడి 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి. రెండేళ్ల పాటు బ్రిటిషర్లకు కంటివిూద కనుకులేకుండా చేసిన సీతారామరాజు.. తనను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారు. నేడు అల్లూరి సీతారామరాజు జయంతి. ఈ సందర్భంగా ఆ మహావీరుడిని ఒకసారి స్మరించుకుందాం…అల్లూరి సీతారామరాజు 1897 జులై 4న విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో జన్మించారు. అయితే పెరిగింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో. రామరాజు తండ్రి వెంకట రామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. 9వ తరగతి వరకు చదివిన అల్లూరి.. సంస్కృతం, జోతిష్యశాస్త్రం, జాతక శాస్త్రం, విలువిద్య, గుర్రపు స్వారీలో ప్రావీణ్యం పొందారు. 1917లో విశాఖపట్నం జిల్లా క్రిష్ణదేవీపేట ద్వారా మన్యంలోకి అడుగుపెట్టారు. మన్యం ప్రజల దీన స్థితిగతులను పరిశీలించి, బ్రిటిష్‌ అధికారుల నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవానికి సిద్ధం కావాలని మన్యం ప్రజలను పురిగొల్పారు. సీతారామరాజు ప్రధాన అనుచరుడు, సేనాని గాం గంటందొర. ఈయనది నడిరపాలెం గ్రామం.గంటందొర, మిగిలిన అనుచరుల సాయంతో బ్రిటిష్‌ అధికారులపై విప్లవానికి అల్లూరి తెరతీశారు. 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై తొలిసారి దాడి చేశారు. 23వ తేదీన క్రిష్ణదేవీపేట పోలీస్‌ స్టేషన్‌, 24న తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి పోలీస్‌ స్టేషన్‌పై దాడిచేశారు. ఈ మూడు స్టేషన్లపై దాడి ద్వారా భారీగా ఆయుధాలను సేకరించుకొని విప్లవం ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి వరసపెట్టి పోలీస్‌ స్టేషన్లపై దాడులు చేస్తూ బ్రిటిష్‌ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు అల్లూరి. ఈ విప్లవాన్ని ఎలాగైనా అణచివేయాలని నిర్ణయించుకున్న బ్రిటిష్‌ ప్రభుత్వం.. మన్యంలో ముమ్మర చర్యలు చేపట్టి చాలా మంది రాజు అనుచరులను చంపేసింది.బ్రిటిష్‌ ప్రభుత్వం మన్యం ప్రజలను కాల్చుకు తినడం మొదలుపెట్టింది. ప్రభుత్వం ప్రజలను పెడుతున్న కష్టాలను చూడలేని రాజు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. 1924 మే 7న విశాఖపట్నం జిల్లా మంప గ్రామానికి సవిూపాన రాజు స్వయంగా లొంగిపోయారు. సీతారామరాజుపై పగతో రగిలిపోతున్న బ్రిటిష్‌ అధికారులు ఆయన్ని చింతచెట్టుకు కట్టి కాల్చిచంపారు. మే 8న రాజు అనుచరులు ఆయన భౌతికకాయాన్ని క్రిష్ణదేవీపేటకు తీసుకువచ్చి తాండవనది పక్కన దహన క్రియలు జరిపారు. సీతారామరాజు ఆశించి కలలుగన్న స్వాతంత్య్రం ఆయన ఆత్మత్యాగం చేసిన 28 సంవత్సరాలకు ఆగస్టు 15, 1947న భారత ప్రజలకు లభించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *