ఇల్లెందు గులాబీలో గుబులు

ఖమ్మం, అక్టోబరు 6
టికెట్‌ ప్రకటించేసి వారాలు గడిచిపోయాయి. మిగిలిన చోట్ల అసమ్మతి స్వరాలు కాస్త తగ్గాయేమోకానీ అక్కడమాత్రం రీసౌండ్‌ వస్తోంది. అంతా అయిపోయాక చేసేదేముందని రాజీపడటం లేదు అక్కడి అసంతృప్త నేతలు. మారుస్తారా లేదా అంటూ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచుతున్నారు. మరో నిర్ణయం తీసుకోకపోతే మునిగిపోతామని ముందే హెచ్చరిస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే తప్ప టికెట్‌ ఎవరికిచ్చినా నో ప్రాబ్లమ్‌ అంటున్నారు. ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని ఆ రిజర్వుడ్‌ సీట్లో లొల్లి బీఆర్‌ఎస్‌కి తల్నొప్పిగా మారిందా? ఆ మహిళా ఎమ్మెల్యేపై ఎందుకంత వ్యతిరేకత?టికెట్‌ ఎనౌన్స్‌చేసి వారాలు గడిచినా ఇల్లందు బీఆర్‌ఎస్‌లో అసమ్మతి చల్లారలేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే హరిప్రియనాయక్‌కే టికెట్‌ ప్రకటించింది బీఆర్‌ఎస్‌ పార్టీ. టికెట్ల ప్రకటనకు ముందునుంచే హరిప్రియని వ్యతిరేకిస్తున్న నేతలు.. పార్టీ అభ్యర్థిని మార్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఎమ్మెల్యేకంటే ఆమె భర్తపై ఎక్కువ ఆగ్రహంతో ఉంది అసమ్మతివర్గం. హరిసింగ్‌ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ సొంత పార్టీ నేతలనే ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారన్నది వ్యతిరేకవర్గం ఆరోపణ. హరిప్రియకి టికెట్‌ పార్టీకి నష్టం చేస్తుందన్న వాదనతో అధినాయకత్వం మనసుమార్చే ప్రయత్నాల్లో ఉన్నారు అసంతృప్త నేతలు. మున్సిపల్‌ చైర్మన్‌ వెంకటేశ్వరరావుతో పాటు కొందరు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సిట్టింగ్‌ ఎమ్మెల్యేకి టికెట్‌ ఇవ్వటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.టికెట్‌ ప్రకటనకు ముందునుంచే ఇల్లందులో అసమ్మతివర్గం స్పీడ్‌పెంచింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు టికెట్‌ ఇవ్వొద్దని పార్టీ అధిష్ఠానానికి మొరపెట్టుకుంటూ వస్తున్నారు ఇల్లందు నేతలు. అయినా హరిప్రియకే టికెట్‌ ప్రకటించడంతో అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇల్లందులో పార్టీ ఇంచార్జి, ఎంపీ గాయత్రి రవి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే హరిప్రియతో కలిసి ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. అయితే నియోజకవర్గంలోని అసమ్మతి వర్గం నేతలు ఆ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు జిల్లా నేతలు. ఎవరెన్ని చెప్పినా ఇల్లందు బీఆర్‌ఎస్‌లో నిరసనసెగ ఏమాత్రం తగ్గినట్లు కనిపించడంలేదు.ఇల్లందు పంచాయితీ చివరికి మంత్రి హరీష్‌రావు దగ్గరికి చేరింది. హైదరాబాద్‌లో మంత్రిని కలిసి నియోజక వర్గంలోని ఇబ్బందులు, సమస్యలను ఏకరువు పెట్టారట అసమ్మతినేతల. తమ అభ్యంతరాలను కాదని ఎమ్మెల్యే హరిప్రియకు బీ ఫామ్‌ ఇస్తే సహకరించేది లేదని తెగేసి చెప్పేశారట. హరిప్రియ కాకపోతే ప్రత్యామ్నాయం ఎవరని మంత్రి అడిగినట్లు సమాచారం. హరిప్రియకి కాకుండా ఎవరికి టికెట్‌ ఇచ్చినా గెలిపించుకుంటామంటోందట ఇల్లందు నియోజకవర్గ అసమ్మతి వర్గం. అధినేత దృష్టికి అన్ని విషయాలు తీసుకెళ్తానని, ఈలోపు ఎవరూ తొందరపడొద్దని అసమ్మతినేతలకు నచ్చజెప్పారట హరీష్‌రావు. ఈ పరిణామాలతో చివరికి ఏమవుతుందోనని ఎమ్మెల్యే వర్గం టెన్షన్‌పడుతుంటే.. అభ్యర్థిని మార్చేదాకా వెనక్కితగ్గొద్దన్న పట్టుదలతో ఉన్నారు ఇల్లందు బీఆర్‌ఎస్‌ అసమ్మతి నేతలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *