మునుగోడులో సర్వేల టెన్షన్‌

తెలంగాణలో అంతటా ఇప్పుడు మునుగోడు చర్చే. మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యం అని తేలిపోయింది. బీజేపీ అభ్యర్థిగా తాజా మాజీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఖరారయ్యారు. అయితే కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరు? తెరాస తరఫున ఎవరు నిలబడతారు అన్న విషయంలో స్పష్టత లేదు. మునుగోడులో త్రిముఖ పోరు మాత్రం తథ్యం అనడంలో ఎలాంటి సందేహాలకూ తావులేకపోయినా.. అసలు అభ్యర్థులు ఎవరు? అన్నది తేలకుండానే గెలుపు ఓటములపై చర్చోపచర్చలు జోరుగా సాగుతున్నాయి.మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం కావడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. మునుగోడు ఉప ఎ ఎన్నికలను వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమిఫైనల్స్‌ గా రాజకీయ పక్షాలు భావిస్తున్నాయి. మునుగోడులో విజయం సాధిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తిరుగుండదని బీజేపీ సహా కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ లు కూడా భావిస్తున్నాయి. దీంతో తెలంగాణలో ప్రధాన పక్షాలైన మూడు పార్టీలూ కూడా మునుగోడుపై ప్రత్యేక దృష్టిసారించాయి.అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు ఆయా పార్టీల అధినేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ లు సమర్ధ అభ్యర్థుల కోసం గాలిస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తు అయితే ఇప్పటి నుంచే మునుగోడులో సర్వేలు హడావుడి ప్రారంభమైంది. మునుగోడు ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలుపొందుతుంది. ప్రజల మొగ్గు ఏ పార్టీ వైపు ఉంది అన్న అంశంపై ‘సర్వే’జనం విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి రాజగోపాలరెడ్డే అన్నది ఇప్పటికే స్పష్టమైన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ ల అభ్యర్థులు ఎవరన్న దానిపై విస్తృత చర్చ జరుగుతోంది.ఆ రెండు పార్టీలూ కూడా టికెట్‌ ఆశావహుల వివరాలు సేకరిస్తూ వారిలో బలమైన అభ్యర్థి ఎవరన్న దానిపై అంచనాలు వేసుకుంటున్నాయి. ఇక సామాజికవర్గాల వారీగా కూడా నివేదికలు రూపొందిస్తున్నాయి. ఏ సమాజిక వర్గం వారికి టికెట్‌ ఇస్తే విజయావకాశాలు మెరుగౌతాయి అన్న దానిపై కూడా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ లు అంతర్గతంగా సర్వేలు నిర్వహిస్తున్నాయని ఆయా పార్టీల శ్రేణులే చెబుతున్నాయి.
మునుగోడులో నిలబెట్టే అభ్యర్థి పార్టీ బలంపైనే కాక పార్టీకి బలంగా ఉండాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ లు ఉన్నాయి. అభ్యర్థి ఎంపిక విషయంలో ఆ లక్ష్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. అందుకే ముందుగా మునుగో డు నియోజకవర్గంలో సామాజిక సవిూకరణాల పరిశలన అనంతరమే అభ్యర్థికి ఖరారు చేయాలనే వ్యూహంలోనే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ లు ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *